ఖైరతాబాద్, ఫిబ్రవరి 9: మరియమ్మ లాకప్‌డెత్ విషయంలో బాధిత కుటుంబానికి నాటి సీఎం కేసీఆర్ తక్షణ న్యాయం చేశారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణమాదిగ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మరియమ్మ మృతి అంశంలో పోలీసుల తప్పిదమని తేలిపోయిన వెంటనే దళితులపై చేయి పడితే ఊరుకోబోమని కేసీఆర్ బహిరంగ ప్రకటన చేశారని గుర్తు చేశారు. పది రోజుల వ్యవధిలో మరియమ్మ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు, రూ.15 లక్షలు పరిహారం, ఇద్దరు కుమార్తెలకు రూ.10లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించి న్యాయం చేశారని తెలిపారు. బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. కానీ కర్ల రాజేశ్ లాకప్ డెత్ అంశంపై ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటివరకూ స్పందించలేదని మండిపడ్డారు. కర్ల రాజేశ్ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
గత మూడు నెలలుగా ఈ కేసులో పురోగతి రావడం లేదని, బాధిత కుటుంబానికి న్యాయం జరగడం లేదని తెలిపారు. రాజేశ్ గుండెపోటుతో చనిపోయినట్టు పోస్టుమార్టం రిపోర్టు తయారు చేయించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్టు ఇంకా పెండింగ్‌లో ఉండగా, గుండెపోటుతో చనిపోయారని ఎలా చెబుతారని ప్రశ్నించారు. రాజేశ్ మృతదేహానికి పోస్టుమార్టం చేసిన డాక్టర్, దానిని చిత్రీకరించిన వీడియోగ్రాఫర్‌పై తమకు అనుమానం ఉందని పేర్కొన్నారు. అరెస్టు చేయకముందు కర్ల రాజేశ్ సంపూర్ణ ఆరోగ్యవంతుడని నివేదికలు వచ్చాయని, మరి గుండెపోటుతో ఎలా చనిపోయాడని ప్రశ్నించారు. బీబీనగర్ ఏయిమ్స్ వైద్యులు, నిపుణులైన ఫోరెన్సిక్ నిపుణుల సమక్షం లో రీపోస్టుమార్టం చేయించాలని డిమాండ్ చేశారు.
పది రోజుల్లో నివేదిక పంపించమని జాతీయ ఎస్సీ కమిషన్ అడిగితే, 50 రోజులైనా డీజీపీ, చీఫ్ సెక్రటరీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రీపోస్టుమార్టం చేసేందుకు సూర్యాపేట జిల్లా ఎస్పీ అడ్డుపడుతున్నారని, ఆయనపై మంత్రి ఉత్తమ్, కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ఈ కేసు విషయంలో సీసీ ఫుటేజీలను ఎందుకు బయట పెట్టడం లేదని నిలదీశారు. రాజేశ్ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు విశ్రమించేది లేదని, త్వరలోనే జాతీయ ఎస్సీ కమిషన్‌ను మళ్లీ కలుస్తామని తెలిపారు. పోలీసుల చర్యలపై ఆధారాలు అందజేస్తామని, దోషులకు శిక్ష పడే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.