హైదరాబాద్: తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమానికి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ (Konda Laxman Bapuji) అందించిన ప్రజాస్వామిక స్ఫూర్తి, చేసిన త్యాగం మరువలేనిదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) అన్నారు. స్వాతంత్ర్య సమర యోధుడు, తెలంగాణ తొలి తరం ఉద్యమ కారుడు, గాంధేయ వాది, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన కృషిని కేసీఆర్ స్మరించుకున్నారు. బాపూజీతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ నివాళులు అర్పించారు.
రేపటి తరాలు కొండలక్ష్మణ్ బాపూజీ కృషిని గొప్పతనాన్ని గుర్తుంచుకునే దిశగా ఆయన పేరుతో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం, రాష్ట్ర ఉద్యానవన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిందని, వారి జయంతి వర్ధంతులను అధికారికంగా నిర్వహించే సంప్రదాయాన్ని నెలకొల్పిందని, కేసీఆర్ అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం బాపూజీ చేసిన కృషిని ఆదర్శంగా చేసుకుని అనేక సంక్షేమ పథకాలను నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిందని తెలిపారు. వాటిని కొనసాగిస్తూ, బీసీ వర్గాల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేయడమే వారికి మనమందించే ఘన నివాళి అని కేసీఆర్ స్పష్టం చేశారు.