భవిష్యత్తులో ఈ ఆలయం వైకుంఠ వైభవంతో, ప్రాకారాలతో, స్వర్ణమయంగా నిర్మితమవుతుందని, జగద్విఖ్యాతి నొందుతుందని సాక్షాత్తూ నృసింహుడు, పరమేశ్వరుడే చెప్పినట్టు పురాణాలు ఘోషిస్తున్నాయి. కలియుగంలో ఈ అవకాశం ఎవరికి దక్కుతుందో, దైవ సంకల్పమేమిటో ఇంతకాలం ఎవరికీ అంతుచిక్కలేదు. చివరికి యుగయుగాలుగా ఎదురుచూస్తున్న ఆ ఉద్విగ్న ఘడియలు ఆసన్నమయ్యాయి. భక్తాగ్రేసరుడు కేసీఆర్ సత్సంకల్పంతో ఈ నిర్మాణం జరుగటం విశేషం. ఈ ఆలయ నిర్మాణం కోసం కేసీఆర్ సాగించిన కృషి అపూర్వమైనది, అనితర సాధ్యమైనది, ఆచంద్రతారార్కం విలసిల్లేది. దైవ సంకల్పం మేరకు యాదాద్రి ఆలయాన్ని భూతలానికే తలమానికంగా స్వర్ణమయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్చిదిద్దడమే కాదు, ఆలయ విధులు, భక్తుల సందర్శకుల కోసం సకల సౌకర్యాలు సమకూర్చారు. యాదాద్రి నరసింహస్వామి ఆలయం పూర్తిగా రూపాంతరం చెందింది. నూతన గంభీర సర్వశిలానిర్మిత సువిశాలాలయం వెలిసింది. ఒక రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఏ విఘ్నాలు లేకుండా నిర్నిరోధంగా నృసింహాలయం నిర్మించడం దేశ చరిత్రలోనే ఓ ఉజ్వల ఘట్టం. సామాజిక, ఆధ్యాత్మిక, శిల్పకళ, వాస్తు, ఆగమశాస్ర్తాది విద్యలకు శ్రద్ధా నిబద్ధతలకు ఈ ఆలయం ఒక విశ్వవిద్యాలయం.
సుందరరాజన్ స్థపతి మార్గదర్శనం
యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణ యజ్ఞంలో సుందరరాజన్ స్థపతి ప్రధానమైన శిల్పాచార్యుడు. కళారత్న ఆనందవేలు ఉప ప్రధాన స్థపతి. మరో పద్ధెనిమిదిమంది భాగస్వాములయ్యారు. ఆనందవేలు అనుభవజ్ఞుడు, ఔత్సాహికుడు. సినీ ప్రపంచాన సెట్టింగులు వేసి మెప్పించిన ఆర్ట్ డైరెక్టర్ ఆనందసాయి. యాదగిరి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ సారథి కిషన్‌రావు అత్యంత అనుభవజ్ఞుడిగా, సమర్థుడిగా లబ్ధ ప్రతిష్ఠులు. వీరంతా ఈ ఆలయ నిర్మాణంలో భాగస్వాములయ్యారు. కేసీఆర్ స్వప్నాన్ని సాకారం చేయడంలో కీలక పాత్ర వహించారు.
బాలాలయంలో స్వామి దర్శనం
నృసింహుడి దర్శన భాగ్యానికి విఘాతం కలుగకుండా పక్కన ఒక ‘బాలాలయం’ ఏర్పాటు చేశారు. ప్రణాళికాబద్ధంగా పనులు సాగిస్తూ, స్వయంగా పర్యవేక్షిస్తూ ఆలయ నిర్మాణాన్ని అతి వేగంగా పూర్తి చేశారు. 2016లో బ్రహ్మోత్సవాల అనంతరం ప్రారంభమైన ఆలయ నిర్మాణం 2021 మే నెల నాటికి సంపూర్ణ సాకారమైంది. పూర్వం ఆలయాల నిర్మాణానికి అనేక సంవత్సరాలు పట్టేది. ఒక్కోసారి రాజవంశం అంతరించి, యుద్ధ విజితులై, ప్రభువులు కనుమరుగై, అర్థోక్తిలో ఆగిన మహావాక్యంలా అసంపూర్ణాలయాలు కూడా ఉండేవి.
ఈ ఆధునిక యుగంలో ముఖ్యమంత్రి అకుంఠిత దీక్షకు నగ సదృశంగా నిర్మితమైందీ ఆలయం. ఆగమ శాస్త్ర నియమాలు, శిల్ప కళారీతులు, పర్యాటక సౌందర్యం, విజ్ఞుల అభిప్రాయాలు, ప్రజల మనోభావాలు, భక్తుల సౌకర్యాలు మొదలైన అనేక అంశాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి స్వయంగా పదేపదే పర్యటిస్తూ ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షించారు. కనీసం ఇరువై సార్లయినా స్వయంగా వెళ్ళి ఉంటారు. అడుగడుగునా అనేక సూచనలిస్తూ, మార్పులు చేర్పులు సాగించారు. భగవత్కార్యం కనుక భక్తిశ్రద్ధలతో కావించే విధంగా అధికారులను, కార్మికులను ప్రేరేపించారు. చిరునవ్వుతో పలకరించినా, సందర్భానుసారం చిరుకోపం ప్రదర్శించినా అధికారులు, శిల్పులు, కార్మికులు ముఖ్యమంత్రి ప్రదర్శించే అనురాగ వాత్సల్యాల్ని అర్థం చేసుకుంటూ పని సాగించారు. అంకితభావం, కార్యదక్షత మూర్తీభవించిన అధికారులను, నిపుణులైన స్థపతులను, యోగ్యులైన సలహాదారులను ఎంచుకోవడంలో కేసీఆర్ కార్యశీలత ప్రస్ఫుటమైంది.
సంకల్పం నుంచి సాకారం దాకా..వీడియో
నాణ్యతలో రాజీ లేదు
నాణ్యత దెబ్బతినకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిరంగంలోనూ ఉత్తమ సంస్థలను, నిష్ణాతులను నియోగించారు. థర్డ్ పార్టీ పరీక్షలను ఏర్పాటు చేశారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి.. నాణ్యత విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరచారు. డంగు సున్నం నాణ్యతను బెంగళూరుకు చెందిన బ్యూరో వెరిటాస్ (ఇండియా) సంస్థ నిపుణులు తనిఖీ చేసేవారు. కృష్ణశిలల నాణ్యత, నిర్మాణంలో నాణ్యతను పరిశీలించేందుకు కూడా థర్డ్‌పార్టీని ఏర్పాటుచేశారు. లడ్డూల నాణ్యత తనిఖీని కూడా థర్డ్ పార్టీ చేత పరిశీలింప చేయాలని నిర్ణయించారు. ఐఎస్వో సర్టిఫికేషన్ గల ఏకైక ఆలయమిది. దీంతో కళారీతుల్లోనూ, నిర్మాణాల్లోనూ, నాణ్యతలోనూ, సౌకర్యాల దృష్ట్యానూ, పర్యాటక కోణంలోనూ – ఏ విధంగా చూసినా యాదాద్రి అతి తక్కువ వ్యవధిలో ఆలయాలకే మకుటాయమానంగా రూపుదిద్దుకున్నది. ఆధ్యాత్మికత తోపాటు సౌందర్యాత్మకతకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. డిజైన్ నుంచి ఆకృతి వరకు కేసీఆర్ తన కనుసన్నల్లో నడిపించారు.
ఆర్నమెంటల్ లుక్ ఉండాలంటూ సూచనలు చేశారు. దేవాలయం చుట్టూ 360 డిగ్రీలు ఎటుతిరిగినా చుట్టూరా దృశ్యం సుందరంగా, ఐకానిక్ ఎలిమెంట్‌లా ఉండాలన్నారు. విష్ణు పుష్కరిణి చుట్టూ ప్రహరిపై లైట్లు, మైదానం మధ్యలో ఎనభై అడుగుల ఎత్తు దీపస్తంభం, రహదారులపై విద్యుత్తు కాంతులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆలయమే కాదు, ఆలయ నగరి అంతా రాత్రివేళ లైటింగ్ ఏర్పాట్లతో జిగేల్ మంటుంది. అద్దాల మండపమైతే భక్తులను అబ్బుర పరుస్తుంది. ప్రధానాలయంలోని ద్వితీయ ప్రాకారంలో వాయువ్య దిశలో స్వామివారి అద్దాల మండపం ఉన్నది. మండపంలోని స్తంభాలన్నింటికీ ఇత్తడి రేకులతో బంగారంలా మెరిసే విధంగా గ్లాస్ పాలిషింగ్ చేశారు. ఇందులో విద్యుద్దీపాలను వెలిగించడంతో మండపం స్వర్ణమయంగా కనిపిస్తున్నది. ఇక్కడ ఊయలలో నరసింహస్వామి, లక్ష్మీ అమ్మవారిని ఉంచి శయనోత్సవం నిర్వహిస్తారు. స్వామివారి రూపాలు అన్ని వైపులా కనిపించే విధంగా అద్దాల మండపం ఏర్పాటు చేశారు.
సంప్రదాయ, ఆధునికత కలబోత
సామాజిక పురోగతిలో ప్రభవించే సాంకేతిక పరిజ్ఞానం ఆలయ నిర్మాణాలలో చోటు చేసుకోవడం సహజం. యాదాద్రి ఆలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సంప్రదాయ భావన దెబ్బతినకుండానే ఆధునికతను జోడించడంలో అమిత శ్రద్ధ వహించారు. మెట్లు ఎక్కలేని వృద్ధులు, వికలాంగులను దృష్టిలో పెట్టుకొని ఎస్కలేటర్లు ఏర్పాటు చేశారు. కొండ క్యూ కాంప్లెక్స్‌లోని మొదటి అంతస్తు నుంచి ప్రసాద విక్రయ కేంద్రం వరకు ఎస్కలేటర్లు నిర్మిస్తున్నారు. సాధారణ భక్తులు మెట్లపై ఎక్కవచ్చు. ఇదే విధంగా భక్తుల రద్దీతో నిమిత్తం లేకుండా స్వామివారికి ప్రసాదం తీసుకుపోవడానికి లిఫ్టు సౌకర్యం ఉన్నది. లడ్డూల తయారీ, పంపిణీ స్థలానికి సరఫరా వరకు యంత్రాల ద్వారానే సాగుతుంది. ఆయా పదార్థాలు సమపాళ్లలో యంత్రాల ద్వారా మిశ్రమం జరిగి లడ్డూలు తయారవుతాయి.
ఆ తరువాత కన్వేయర్ బెల్ట్ ద్వారా కౌంటర్ దగ్గరకు చేరుకుంటాయి. భక్తుల సంఖ్యకు అనుగుణంగా పులిహోరను తయారు చేస్తారు. రోజుకు యాభై లక్షల లడ్డూలు తయారు చేసే సామర్థ్యం ఉన్నది. అవసరమైతే ఈ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. లడ్డూ రంగు, రుచి, వాసనలో మార్పు లేకుండా తగు నాణ్యతతో తయారు చేస్తున్నారు. ఆలయంలో లైటింగ్‌కు ప్రత్యేక ప్రాధాన్యమున్నది. దీనిని బెంగళూరుకు చెందిన క్రియేటివ్ లైటింగ్ సంస్థకు అప్పగించారు. లైటింగ్ ఏర్పాటులో అమెరికా, రష్యా సాంతికేక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. ఆలయ పరిసరాలలో అంతటా పటిష్టమైన నిఘా వ్యవస్థ నెలకొని ఉంటుంది. ఇందుకోసం ఇజ్రాయెల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. అత్యాధునిక కెమెరాలు, స్కానర్లు, బాంబ్ డిటెక్టర్లు అమరుస్తారు.
మనసే కోవెలగా..
ఒక భవన నిర్మాణం జరిగే చోటికి వెళ్లి ముగ్గురు కూలీలను మీరేమి చేస్తున్నారని అడిగారట. మొదటి కూలీ రాళ్ళు కొడుతున్నాను అని బదులిచ్చాడు. రెండవ కూలీ నా జీవనోపాధి సాగిస్తున్నాను అన్నాడట. మూడో వ్యక్తి ఆలయం కడుతున్నామని చెప్పాడట! ముగ్గురు చేస్తున్నదీ అదే పని. కానీ ఎవరి దృక్పథం వారిది. యాదాద్రి ఆలయ నిర్మాణం తలపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే కాదు. ఈ సత్సంకల్పానికి బలమిచ్చిన ఆధ్యాత్మికవేత్తలు.. బోర్డు చైర్మన్ కిషన్‌రావు.. ఇంకా.. అధికారులు.. మొదలుకొని.. డిజైనర్.. శిల్పాచార్యులు, ఇతర శిల్పులు.. సామాన్య కూలీల వరకు అందరిలోనూ ఆధ్యాత్మిక పరిమళం తొణకిసలాడుతున్నది. వారెవరూ ఏదో పని చేస్తున్నామనుకోలేదు. ఆచంద్రతారార్కం నిలిచిపోగలిగే ఒక మహత్తర కోవెలను నిర్మిస్తున్నామనే సంభ్రమం, సంతోషం, సంతృప్తి వారిలో ద్యోతకమవుతున్నది.
సామాన్యులకూ వేద ఆశీర్వచనం
అత్యంత ప్రముఖులు ఆలయాలు సందర్శించినప్పుడు వారికి వేద ఆశీర్వచనం చేస్తారు. కానీ యాదగిరి లక్ష్మీనరసింహుడి సన్నిధిలో సామాన్యులకు కూడా వేద ఆశీర్వచనం ఏర్పాటుచేశారు. సాధారణ ప్రజలు 516 రూపాయల టికెట్ ధర చెల్లిస్తే వేద ఆశీర్వచనం పొందవచ్చు. ఆలయానికి ఏటా అరవై కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. ఇప్పుడు బాలాలయానికి వంద కోట్లు వస్తున్నది. గతంలో వారాంతంలో రోజుకు ఐదువేల మంది భక్తులు యాదాద్రికి వచ్చేవారు. ఇప్పుడు శని, ఆది వారాల్లో 30 వేల మంది వరకు వస్తున్నారు. ఆలయం పునఃప్రారంభమైన తరువాత రోజుకు యాభై వేల మంది భక్తులు సందర్శిస్తారని అంచనా.