జమ్మికుంట, సెప్టెంబర్ 23: ‘కాళేశ్వరం ప్రాజెక్టు దేశానికే దిక్సూచి. ఆలాంటి ప్రాజెక్టుపై కనీసం అవగాహన లేకుండా సీఎం, మంత్రులు మాట్లాడుతున్నరు. లక్ష కోట్లు వృథా చేశారని, పైసలన్నీ గోదావరిలో పోశారని ఆరోపిస్తున్నరు. ప్రకృతి విపత్తుతో మేడిగడ్డకు చెందిన పిల్లర్ కుంగింది. దీనిని రాద్ధాం తం చేస్తున్నరు. ప్రాజెక్టు కొట్టుకుపోవాలని దుర్మార్గంగా ఆలోచిస్తున్నరు. కాళేశ్వరమంటే ఒక్క మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలే కాదు.. ఈ మూ డు బ్యారేజీలకు పెట్టిన ఖర్చు కేవలం రూ.9,500 కోట్ల లోపే. వందల కిలోమీటర్ల సొరంగాలు, కాలువలు, ఎత్తిపోతలు, లిఫ్టులు, విద్యుత్తు సబ్స్టేషన్లు.. ఇలా ఎన్నో నిర్మాణాలకు రూ.90 వేల కోట్లు ఖర్చుచేసినం.
తెలంగాణ రైతాంగానికి భవిష్యత్తు అందించినం. రాబోయే రోజుల్లో సోలార్ ప్యానళ్లతో కాళేశ్వరం సాగుతుంది. ఇదీ కేసీఆర్ విజన్. కాళేశ్వరం గురించి తెలియాల్సిన ప్రాథమిక సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం’ అని రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ స్పష్టంచేశారు. సోమవారం ఆయన కరీంగనర్ జిల్లా జమ్మికుంట మండల కేంద్రానికి హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డితో కలిసి వచ్చారు.
మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్‌రావు నివాసంలో వినోద్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ సాధించుకున్న తర్వాత ఆరు ప్రాజెక్టులను కట్టించిన చరిత్ర బీఆర్ఎస్దేనని పేర్కొన్నారు. ఎల్లంపల్లి, ప్రాణహిత, చేవేళ్ల, టీడీపీ విడిచిపెట్టిన దేవాదుల, ఇంద్రావతి, సీతమ్మసాగర్, మల్లన్నసాగర్, అనంతసాగర్, రంగనాయకసాగర్ తదితర పాత ప్రాజెక్టులకు రీడిజైన్లతోపాటు కొత్త ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిన ఘనత కేసీఆర్‌దేనని చెప్పారు. పిల్లర్ కుంగితే రాద్ధాంతం చేయడం తగదని సూచించారు.