హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): వనపర్తి, జనగామ జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటనలు వాయిదా పడ్డాయి. ఈ నెల 19, 20 తేదీల్లో ఈ జిల్లాల్లో పర్యటించాలని సీఎం నిర్ణయించిన విషయం తెలిసిందే. కేంద్రం ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని శుక్రవారం టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో నిర్ణయించిన నేపథ్యంలో ఆ పర్యటనలు వాయిదా వేసినట్టు సమాచారం. మరోవైపు జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్ శనివారం సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో జరిగే ఈ సమావేశంలో దళితబంధుతోపాటు వ్యవసాయం, ధాన్యం సేకరణ తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారులు కూడా పాల్గొంటారని అధికారవర్గాలు తెలిపాయి. సమావేశానికి హాజరు కావాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. దళితబంధు పథకం అమలుపై అధికారులు, ప్రజా ప్రతినిధులకు శిక్షణ ఇచ్చే అంశంపై సమావేశంలో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నది.