హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యవర్గం, బీఆర్ఎస్ఎల్పీ సమావేశం ఆదివారం తెలంగాణభవన్‌లో జరుగనున్నది. సమావేశానికి లెజిస్లేటివ్ పార్టీ (ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు), పార్లమెంటరీ పార్టీ (ఎంపీలు) సభ్యులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ముఖ్య నేతలు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడానికి శనివారం సాయంత్రమే అధినేత కేసీఆర్ ఎర్రవల్లి నుంచి హైదరాబాద్ నందినగర్‌లోని నివాసానికి చేరుకున్నారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులను తగ్గిస్తూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తెలంగాణ వ్యవసాయ, రైతాంగ, ప్రజావ్యతిరేక విధానాలపై క్షేత్రస్థాయిలో పో రాటాలు నిర్మించాలని, తెలంగాణ సాగునీటి కోసం మరో జల సాధన ఉద్యమం తప్పదని కేసీఆర్ భావిస్తున్నారు.
పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన, వ్యవసాయాభివృద్ధికి తోడ్పడుతున్న పలు సాగునీటి రంగ ప్రాజెక్టులను నిర్వీర్యం చేయాలనే కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను ప్రజాక్షేత్రంలో తిప్పికొట్టేందుకు వ్యూహ రచన చేస్తున్నారు. పలు ప్రజా సమస్యలు, కీలక అంశాలపై పార్టీ నేతలతో కేసీఆర్ చర్చలు, నిర్ణయాలు తీసుకుంటారని భా విస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీపై జంగ్‌సైరన్ మోగించడానికి ఆదివారం సమావేశం వేదిక కానున్నట్టు తెలుస్తున్నది.