KCR | ఉమ్మడి మహబూబ్‌నగర్‌ను పచ్చగ చేయాల్నని ఎన్నో అవరోధాలు దాటుకొని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును 90 శాతం పూర్తిచేసినం. కాంగ్రెస్ వచ్చినంక తట్టెడు మట్టి తీయలేదు సరికదా.. కేంద్రం డీపీఆర్‌ను వెనక్కి పంపితే కుయ్యిలేదు.. కుటుక్కులేదు. డీపీఆర్‌ను వెనక్కి పంపితే భూమి, ఆకాశాన్ని ఏకం చేసి లొల్లి చేయాల్సింది పోయి ప్రభుత్వం సప్పుడుజేస్తలేదు.
మాకు రెండు బాధ్యతలున్నయ్.. ఒకటి తెలంగాణ తెచ్చిన పార్టీగా.. ప్రధాన ప్రతిపక్షంగా రాష్ట్ర హక్కులు, నీళ్లు, ప్రయోజనాలను రక్షించుకోవాలె. ప్రజలను ఎన్ని రోజులు వంచిస్తరు? ప్రభుత్వాలను నిద్రపోనివ్వం. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం. జరిగే అన్యాయాన్ని, జల దోపిడీని ఎండగడుతం. తెలంగాణ కోసం ఎంతదాకైనా పోతం. నేనే రంగంలోకి దిగుతున్న. వి విల్ ఫైట్. -కేసీఆర్
హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : ‘రాష్ర్టానికి జరుగుతున్న అన్యాయంపై నిలదీసేందుకు ఇప్పుడు తెలంగాణకు వాయిస్ ఎవరు? తెలంగాణలో ఉన్న ప్రభుత్వం మాట్లాడకుంటే ఇంకెవరు మాట్లాడాలె? ప్రతిపక్షమే కదా? మాకు రెండు బాధ్యతలున్నయ్. ఒకటి తెలంగాణ తెచ్చిన పార్టీగా, రెండోది ప్రధాన ప్రతిపక్షంగా కంపల్సరీ మా డ్యూటీ మేము చెయ్యాలె. వీళ్లేదో తమాషాకు అదోటిదోటి అడ్డం పొడుగు మాట్లాడి, కిరికిరి మాటలు మాట్లాడి, ఈ కారు కూతలు కూసి ఏదో చేస్తామనుకుంటే నడవదిక..ఇయ్యాల్టి దాకా వేరే కథ.. రేపటి నుంచి వేరే కథ. ఎకడికకడ తోలు తీస్తాం’ అని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. ఆదివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ప్రజలతో కలిసి ఎకడికకడ నిలబెట్టే ప్రయత్నం చేస్తం.. అడుగడుగునా చెక్ చేస్తం. ప్రతి విషయంలో చెక్ చేస్తం. మేము తొందరపడి మీ మీద కన్నెర్ర జేయడం లేదు. మీకు చాలా పెద్ద సమయమే ఇచ్చినం. మా ప్రభుత్వం పోయింది.. వీళ్లు వచ్చిండ్రని పిచ్చి పిచ్చిగా చేయడం లేదు. అలాంటి వాటి జోలికిపోలే. ఇష్యూల మీద మాత్రమే పోరాడుతున్నం.. వక్ఫ్ ఇష్యూస్ మీద పోరాడుతున్నం. రకరకాల భూదందాల మీద.. దోపిడీ మీద.. లగచర్ల మీద పోరాడుతున్నం. పార్టీ కొట్లాడుతున్నది. బరాబర్ కొట్లాడుతం.
నీళ్ల వాటా కోసం కొట్లాడుతం
ఇప్పుడు మొదటికే ముప్పు వచ్చే పరిస్థితి ఉన్నది. అటు గోదావరి మీద అరాచకం చేసి చంద్రబాబు నాయుడు, ఏపీ ప్రభుత్వం నల్లమల సాగర్, ఈ సాగర్, ఆ సాగర్ అంటూ నీళ్ల దోపిడీ చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం సప్పుడు లేదు. ఇటు కృష్ణలో పాలమూరు ఎత్తిపోతలకు అన్యాయం జరుగుతున్నా సప్పుడు లేదు. మరి ఎవరి ప్రయోజనాల కోసం ఉన్నట్టీ రాష్ట్ర ప్రభుత్వం? ఏం చేయడానికి ఉన్నట్టు? ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నట్టు ? ఎట్టి పరిస్థితుల్లో నేనే స్వయంగా రంగంలోకి దిగాలనుకున్న. దిగిన. ఈరోజు డెసిషన్ అయిపోయింది. నాలుగు రోజుల్లో ఆయా జిల్లాల నాయకులతో సమావేశమై గ్రామ గ్రామాన డప్పు కొడుతం. మొత్తం సభలు పెడుతం. కవులు, గాయకులు, కళాకారులందరినీ తట్టిలేపుతం. ఈ మీడియా సోదరులను కూడా రిక్వెస్ట్ చేస్తం. అకడ జరిగే అన్యాయాన్ని, ప్రజలకు జరిగే అన్యాయాన్ని, జల దోపిడీని ప్రజలకు చూపెట్టాలని కోరుతం. ఈ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాన్ని కూడా తప్పకుండా ప్రజలకు చెప్తం. ఇన్ని రోజులు ఒక రకంగా పోయినం. కానీ ఇక తప్పేటట్టు లేదు. ఎవరితోనైనా సరే కొట్లాడుతం. తెలంగాణ కోసం భయపడం. ఏందాకైనా పోతం. కొండ మీద కోతితోనైనా సరే కొట్లాడుతం తప్ప విడిచి పెట్టం. ఇకడ ఎవరి ముఖాలు చూసేది లేదు. డెఫినెట్‌గా ఫైట్ చేస్తం. ఎందుకంటే రాష్ట్ర హకులను రక్షించుకోవాలె.. నీళ్ల హక్కులను రక్షించుకోవాలె.
రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను రక్షించుకోవాలె.
సర్వభ్రష్ట ప్రభుత్వం.. మౌనమెందుకు?
మా కండ్ల ముందే జరిగిన ఈ దుర్మార్గంలో కేసీఆర్ ఎట్లా మౌనం పాటిస్తడు? ఎందుకు మౌనంగా ఉంటడు? ఎవరి కోసం ఉంటడు? ఎందుకోసం ఉండాలె? కాబట్టి ఈ అరాచక ముచ్చట్లు ఇక చెల్లవు. ఇష్టమొచ్చినట్టు మాట్లాడి, ఆల్తుఫాల్తు కూతలు కూసి ఏదో చేస్తామంటే అది జరిగేది కాదు. అలా జరగనియ్యం. ఈ ప్రభుత్వం కూడా సర్వభ్రష్ట ప్రభుత్వం. నువ్ మా ఇంటికొచ్చి మావి దోచుకుపోతా అంటే ఊరుకుంటామా? జేబులో చేయిపెట్టి పైసలు తీసుకుంటా అంటే ఊరుకుంటామా? చేతనైన కాడికి కొట్లాడుతం కదా.
ప్రశాంత రాష్ట్రంలో అశాంతి
మా ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి విషయంలో, పారిశ్రామికీకరణలో, ఐటీ రంగం లో, క్రైమ్‌ను తగ్గించడంలో, లా అండ్ ఆర్డర్ మెయింటెయిన్ చేయడంలో.. ఒక మంచి పద్ధతిలో పోయినం. ఇయ్యాల ఏందండి? జంట నగరాల్లో పట్టపగలు నడిరోడ్డుపై హత్యలు జరుగుతున్నయి. అడిగే దికు లేదు. మానభంగాలు జరుగుతున్నయి. ఎన్సీఆర్బీ రిపోర్టు ప్రకారం తెలంగాణలో 20% క్రైమ్ రేట్ పెరిగింది. మా హయాంలో పీస్ ఫుల్ స్టేట్ ఉండె.. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండె. ఇవాళ తెలంగాణలో అవన్నీ మృగ్యమైపోతున్నయి. దారుణాలన్నీ పెరిగిపోయినయి. ఇక ఉపేక్షించేది లేదు.
ఇస్తామన్న రూ.15వేలు ఎక్కడ?
వీళ్ల వాగ్దానాలు ఏందండి.. వీళ్లు చేసినవి? మంచిగున్న ప్రజలకు మాకు ఓటేసే ఉద్దేశంలో ఉన్న ప్రజలకు పచ్చి అబద్ధాలు చెప్పి.. టెంప్ట్ చేసి, మోసం చేసి, ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేసిండ్రు. దొంగ మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి, అర్రాస్ పాటలు పాడిండ్రు. వేలం పాట పాడినట్టు పాడిండ్రు. కేసీఆర్ 10 వేలు ఇస్తున్నడు..రైతుబంధుకు మేము 15 వేలు ఇస్తమన్నరు? ఎక్కడవి? మహిళలకు రూ.2,500 ఇస్తామన్నరు అవెక్కడ? కేసీఆర్ కల్యాణలక్ష్మి లక్ష రూపాయిలిస్తున్నడు.. మేం తులం బంగారం కలిపి ఇస్తమన్నరు. పెండిండ్లు చేసుకోవద్దన్నరు. ఇదే ప్రభుత్వం చెప్పే మాటలకు కొందరు పెండ్లి చేసుకోలేదు. ఆ తులం బంగారం ఎక్కడ? పెద్ద క్యాసెట్లు వేసిండ్రు. ఆ క్యాసెట్లు మా దగ్గర ఉన్నయి. పెన్షన్ తీసుకునే ముసలోళ్లు నవంబర్‌లో తీసుకోవద్దు.. డిసెంబర్లో 4 వేలు ఇస్తమన్నరు. ఆ రూ.4 వేలు ఎక్కడ? రూ.2 లక్షల రుణమాఫీ అని నరికిండ్రు. ఉరుకుండ్రి ఉరుకుండ్రి బ్యాంకుల దగ్గరకు వెళ్లి జల్ది తెచ్చుకొండ్రి అని అర్రాస్ పాట పాడిండ్రు.. ఏంజేసిండ్రు? ఆఖరికి పేద విద్యార్థులను కూడా మోసం చేసిండ్రు. మొత్తం 420 హామీలున్నయి. కొన్నింటినే మేం ప్రస్తావించినం.
ఓవర్సీస్.. దళితబంధు ఎక్కడ?
మేము మొత్తం 100 శాతం సమ్మిళితమైన అభివృద్ధి మీద ముందుకు పోయినం. మీలా ఏకాకిగా, ఏకపక్షంగా, ఏకోన్ముఖంగా పోలేదు. ఆల్ ఫ్రంట్స్ కవర్ చేయాలని చూసినం. పేద పిల్లలకు విదేశీ విద్య కోసం లేకలేక సీటు వస్తది. చదువుకోవాలని ఆశ పడుతరు.. కానీ పోలేరు. వ్యక్తిగతంగా మమ్మల్ని అడిగితే మేము పార్టీ పరంగానో వ్యక్తిగతంగానో చేసేది కొంత మేరకే. పాలసీగానే ఎందుకు చేయకూడదు? అని చెప్పి ఆలోచించి 20 లక్షల రూపాయలిచ్చినం. ఎస్సీ, ఎస్టీ పిల్లలు పోతే వాళ్లకు అంబేదర్ ఓవర్సీస్ అని, బీసీలకు జ్యోతిబా పూలే ఓవర్సీస్ అని.. రకరకాలుగా మొత్తం మీద అన్ని వర్గాల వాళ్లకు ఒక్కొక్కరికి రూ.20 లక్షలిచ్చినం. అవి కూడా పెంచుతామని చెప్పిండ్రు. ఇష్టమొచ్చినట్టు బరితెగింపుగా మాట్లాడిండ్రు. ఆవేవి? కేసీఆర్ దళిత బంధుకు రూ.10 లక్షలిస్తే మేము రూ.12 లక్షలిస్తమన్నరు. ఇష్టం వచ్చిన మాటమాట్లాడిండ్రు. మీ నోటికి మొకాలె. అది కూడా 100 రోజుల్లోపలనే ఇస్తమన్నరు. కార్డులు పంచిండ్రు. సంతకాలు పెట్టి బాండ్ రాసిచ్చిండ్రు. ఇంటింటికీ కార్డులు పంచి మోసంచేసిండ్రు. చివరికి శఠగోపం పెట్టిండ్రు. దికుమాలిన దరిద్రమంతా నెత్తిన పెట్టి కంప్లీట్ ప్రజలను టెంప్ట్ చేసిండ్రు.
గిట్టుబాటు ధర, రూ.500 బోనస్ ఏది?
ఈ దద్దమ్మ పాలనలో రాష్ట్రంలో ఇవ్వాళ వడ్లు కొంటలేరు. రైతులకు గిట్టుబాటు ధర ఏది? ప్రతి ధాన్యానికి లిస్ట్ పెద్ద లిస్ట్.. శాంతాడంత లిస్ట్ చెప్పిండ్రు. కందులకు ఇంత, మినుములకు ఇంత, పసుపునకు ఇంత, పప్పునకు ఇంత, మొకజొన్నకు ఇంత అని అన్నిటికీ రూ.500 బోనస్ అన్నరు. అన్నిటికీ చెప్పి దేనికీ దికులేదు. పత్తి కొనే దికులేదు. వడ్లు కొనే దికులేదు. పాపం రైతులు ప్రైవేట్‌కు అమ్ముకొని దోపిడీకి గురవుతున్నరు.
రైతుల కోసం 7,100 కొనుగోలు కేంద్రాలు
7,100 కొనుగోలు కేంద్రాలు పెట్టినం. ఊర్లోకి పోయి కొన్నం. ధాన్యం నెత్తిన పెట్టుకొని వాళ్లు అంగడికి వచ్చి మారెట్లలో తిరుగుడు బంద్ చేసినం. అరాచక పాలనలో రెండు సార్లు రైతు బంధు ఎగ్గొట్టిండ్రు. పెన్షన్ 4000 ఇస్తామని ఎగ్గొట్టిండ్రు. రాష్ట్రంలో చాలా భయంకరమైన పరిస్థితి తెచ్చిండ్రు. వాళ్ల నోటికి మొక్కాలె.. నిరుద్యోగ భృతి ఇస్తం, తోక ఇస్తం, నోటిఫికేషన్లు ఇస్తం, జాబ్ క్యాలెండర్లు ఇస్తం, విద్యా భరోసా కార్డులిస్తమని మోసపూరిత మాటలు అడ్డం వేస్తే.. ప్రజలు ఓటేసిండ్రు. తీరా వీళ్లు అందర్నీ ముంచిండ్రు.
ఇదీ పింఛన్ల అసలు కథ..
ఒక సందర్భంలో నేను అడిగిన. అసలు మనం పెన్షన్ ఎందుకిస్తం? దానికో పరమార్థమో, పర్పసో ఉన్నదా? లేకపోతే ఉత్తగనే అట్లా పంచి పెట్టడమా? ఏందసలు? అంటే ‘మీ ఉద్దేశం ఏంటి సార్’ అన్నరు. యాక్సిడెంట్ అయితే తెల్లారి వికలాంగులమైతం. వృద్ధాప్యం వస్తే పట్టించుకునే వాళ్లు లేకపోతే ఎట్ల? అట్లాంటి వాళ్లకు, అనాథలకు, విధివంచితులకు, ఇచ్చేది పెన్షన్. దానికో పరమార్థం ఉండాలె. వాళ్లు బిర్యానీ తినకపోయినా కనీసం రెండు పూటలా పప్పో, పచ్చిపులుసో తిని పండుకునేటట్టు ఉండాలయ్యా’ అని చెప్పిన. అప్పుడు గోయల్ సాబ్ అని ఐఏఎస్ ఆఫీసర్.. ఆయన ‘ఉప్పు కింత, పప్పు కింత అని అన్ని రేట్లు లెకపెట్టి రూ.670 ఇస్తే సరిపోతది సార్’ అన్నడు. నేను ఒప్పుకోనయ్యా రూ.1000 పెట్టు అన్నా. సెకండ్ టర్మ్‌లో మమ్మల్ని గెలిపించుకోండి, రూ.2,000 చేస్తమని చెప్పిన. మొదట రూ.1000 ఎవరూ అడగలే. మేమే సుమోటోగా డే వన్ గవర్నమెంట్ వచ్చిన ఫస్ట్ క్యాబినెట్లోనే డిసైడ్ చేసి.. రూ.1000 పెట్టినం. రూ.200 నుంచి 1000కి పెరిగింది. రూ.1000 నుంచి రూ.2000 కూడా ఫస్ట్ మంత్లోనే సెకండ్ టర్మ్‌లో ఇచ్చినం. వీళ్ల ఫాల్తు మాటలకు జనం కూడా ఏమనుకున్నారో ఏమో.. కేసీఆర్ రూ.2000 అన్నప్పుడు వీళ్లు రూ.4000 ఇస్తామన్నరు అని టెంప్ట్ అయి మాకు ఓటు వేసే ఉద్దేశం ఉన్నా ఆ మాయాజాలంలో పడి గోల్ మాలై వాళ్లకు ఓట్లేసిండ్రు. ఇవ్వాళ తలలు బాదుకుంటున్నరు. తిడుతున్నరు.
వచ్చేది మనమే అని ప్రజలంటున్నరు
నిన్న నేను ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి హైదరాబాద్ వస్తుంటే.. ప్రామిస్ చెప్తున్నా ప్రజలే అంటున్నరు.. సార్ వచ్చేది మనమే, మన ప్రభుత్వమే అని. ఒక పది ప్లేసెస్‌లో పకపొంటివచ్చి.. ఒకాయన కార్లో కూర్చొని స్టీరింగ్ మీద రెండు చేతులు మీదికి పెట్టిండు. బాస్ మళ్లా మనం జల్ది రావాలి. మనమే వస్తున్నం నెక్స్ట్ మనమే అని దుంకుతున్నడు. ఆ మోటార్ బైక్స్‌పై వచ్చేటోళ్లు కూడా పకపొంటి రుయ్రుయ్మని నా పకన వచ్చి.. నెక్స్ట్ మనమే సార్. వచ్చేస్తున్నం సార్ అంటూ పోతున్నరు. హైదరాబాద్ సిటీలో అనేక ప్లేసెస్‌లో కనీసం ఒక 10, 12 ప్లేసెస్‌లో అట్లా చెప్తున్నరు జనం. ఇది దేనికి సంకేతం? మీ మీద ప్రజలు విశ్వాసం కోల్పోతున్నరు. రోజురోజుకూ మీ చర్యల వల్ల, మీ పిచ్చి పనుల వల్ల ప్రజలు మార్పు కోరుతున్నరు. మీరు చేసే చర్యలు ఎట్లున్నయి? మొత్తం రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందానా? అని కేసీఆర్ ధ్వజమెత్తారు.
ప్రజా ఉద్యమానికి శ్రీకారం
రాష్ర్టానికి జరుగుతున్న అన్యాయాలపై రెండేండ్ల నుంచి నేను మౌనం పాటించి చూసుకుంటూ వస్తున్న. తప్పని పరిస్థితుల్లో ఇప్పుడు నేను బయలుదేరిన. ఇక తప్పదు. ప్రజల మధ్యలో అటు కేంద్రాన్ని ఎక్స్పోజ్ చేస్తం. ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కచ్చితంగా ఎండగడుతం. ఇవ్వాళ మొత్తం విస్తారంగా మాట్లాడినం. చర్చించినం. చాలా పెద్ద ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడుతం. పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో గ్రామగ్రామాన సభలు పెడుతం. ప్రజా ఉద్యమాలు చేస్తం. పెద్ద బహిరంగ సభలు పెడుతం. బహిరంగ సభలకు నేను స్వయంగా అటెండ్ అవుతున్నా. ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వ నిష్రియాపరత్వాన్ని ఎండగడుతం. -కేసీఆర్
యూరియా కోసం మళ్లీ లైన్లలోకి చెప్పులొచ్చినయ్!
యూరియా సప్లయ్ చేసే తెలివి లేదా వీళ్లకు? మా గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులు ఆటోకు డబ్బులిచ్చి పది బస్తాలు తెచ్చియ్యి బాబూ అంటే.. తెచ్చి ఎకడో పొలంకాడ పడేస్తుండె. ఇవ్వాల రైతులు రోజుల తరబడి లైన్లలో చెప్పులు పెడుతున్నరు. రాష్ట్రం ఏర్పడక ముందు చెప్పుల లైన్లు ఉండె. బీఆర్ఎస్ ఉన్నన్ని రోజులు చెప్పుల లైన్లు మాయమైనయ్. కాంగ్రెస్ రాగానే మళ్లీ చెప్పుల లైన్లు స్టార్ట్ అయినయ్. మళ్లీ ఇప్పుడు ఏదో యాప్ అట. ఓపెన్ చేస్తే అది నడుస్తలేదు. ఈ ఎరువుల బస్తాకు యాప్ ఎందుకయ్యా? మూడెకరాల పొలం ఉంటే.. రెండు బస్తాల చొప్పున మూడు సార్లు ఇస్తరట. ఏడికి పోవాలో ఎవరికీ తెల్వదు. అసలు దుకాణాల్లోనే దొరకదు.. ఇక యాప్‌ల ఏడ దొరుకుతది? ఇవ్వాళ గజ్వేల్‌లో చెప్తరు.. రేపు సిద్దిపేటలో చెప్తరు.. ఎల్లుండి సిరిసిల్లలో చెప్తరు. ఏ గోదాముకు పోవాలో తెల్వదు. ఇంతకన్నా జోక్ ఉంటదా? రైతులకు మండల కేంద్రంలో ఎరువుల దుకాణం ఉంటది. తాలూకా కేం ద్రంలో ఉంటది. అకడ సావుకారు ఉంటడు.. ఇచ్చేటోడు ఉం టడు.. అప్పిచ్చేటోడు ఉంటడు. వీళ్లకు ఆ మాత్రం సోయిలేదా?
కనీసం వడ్లు కొంటలేరు. రైతులకు యూరియా సప్లయ్ చేసే తెలివి లేదు. ఎరువుల బస్తాలకు యాప్ ఎందుకు? ఇదో రాష్ట్ర ప్రభుత్వమా? అసలు ప్రభుత్వం ఉన్నదా? ఎంతసేపు రియల్ ఎస్టేట్ దందా తప్ప పాలమూరుకు రెండేండ్ల నుంచి రూపాయి పెట్టలేదు. తట్టెడు మట్టి తీయలేదు. వెనుక ఎవరి ఒత్తిడి ఉన్నది? ఎవరి ప్రయోజనాలు కోరుతున్నట్టు?
-కేసీఆర్
మా హయాంలో ఈ రాష్ట్రం ఒక పద్ధతి ప్రకారం ముందుకు నడిచింది. సంక్షేమం, అభివృద్ధి, పారిశ్రామికం, ఐటీ రంగం, క్రైమ్ తగ్గింపు, లాండ్ అండ్ ఆర్డర్ నిర్వహణలో మంచి పద్ధతిలో ముందుకు పోయింది. ఇప్పుడు మానభంగాలు, నడి రోడ్డుపై హత్యలు జరుగుతున్నా అడిగే దిక్కులేదు. అప్పుడు పీస్ ఫుల్ స్టేట్ ఉండె.. ఇప్పుడవన్నీ మాయమైనయ్.
-కేసీఆర్
డీపీఆర్ పంపితే.. దద్దమ్మలా చూస్తారా?
90 టీఎంసీలకు మా గవర్నమెంట్ ప్రాజెక్టు కోసం డీపీఆర్ పంపింది. ఇప్పుడేమో ఆ డీపీఆర్ తిప్పి పంపించిండ్రు.. దానిమీద సడీసప్పుడు లేదు.. లొల్లీ లేదు.. లొకాండం లేదు. వాళ్లేది చెప్తే దానికి తల ఊపుతున్నరు. ఎందుకు తల ఊపుతున్నరు? రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం చేతకాకపోతే, రాష్ర్టానికి వస్తున్న నీళ్లను కూడా కాపాడే పరిస్థితి లేకపోతే.. ఇదేం దద్దమ్మ ప్రభు త్వం? ఇంత చేతగాని ప్రభుత్వం ఉంటే ఎట్ల? నోరు లేని ప్రభుత్వం ఉంటే ఎట్ల? డీపీఆర్ వెనక్కి పంపినప్పుడైనా పెద్దనోరు వేసుకొని పెద్దపెద్దగా గడబిడ చెయ్యాలె కదా?. ఒక 10 టీఎంసీలు పోతుంటే ఒక్కో రాష్ట్రం ఎకడిదాకనో పోయి కొట్లాడుతది. కేంద్రం మొత్తం డీపీఆర్ పంపిస్తే ప్రాజెక్టుని ఆగం చేసే పరిస్థితి వస్తే.. వీళ్ల నుంచి సప్పుడులేదు.
–కేసీఆర్
45 టీఎంసీల కోసం లేఖలు రాస్తరా?
ఇరిగేషన్ మంత్రి కేంద్రానికి లెటర్ రాసిండు. మాకు 45 టీఎంసీలకు అనుమతి ఇయ్యండని ఎట్లా రాస్తవు? నీకు అర్థం కాదా? ఏం ముఖం పెట్టుకొని రాస్తవు? ఇదొక ప్రభుత్వమా? ఉన్న వస్ర్తానికి పోతే అన్నవస్త్రం పోయినట్టు ఉన్నది. ఉన్నది వదులుకుంటరా ఎవరన్న? ఎవరివి ఈ నీళ్లు? ఆల్రెడీ బచావత్ ట్రిబ్యునల్ తీర్మానంలోనే ఇచ్చింది. దాన్ని కర్ణాటక వాడుతున్నది. అటు మహారాష్ట్ర వాడుతున్నది. వాళ్లు లెకల్లో కూడా చూపెడుతున్నరు. ఆల్మట్టి డ్యామ్‌లో వినియోగంలో చూపెడుతున్నరు. మాకు వచ్చిన 21 టీఎంసీలు మేము వాడుతున్నామని చెప్తున్నరు. ఆ రెండు ఎగువ రాష్ర్టాలు వాడుతుంటే.. ఆ బచావత్ బ్రిబ్యునల్ ద్వారా వచ్చిన 45 టీఎంసీలను మీరెందుకు ఆపుతున్నరు?
-కేసీఆర్
నిద్రపోతున్నదా? దందాలు చేస్తున్నదా?
రాష్ర్టానికి అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వం చూస్తూ కూర్చుంటుందా? ఇదొక రాష్ట్ర ప్రభుత్వమా? ఇకడ ప్రభుత్వం ఉన్నదా? నిద్రపోతున్నదా? ఎంతసేపూ రియల్ ఎస్టేట్ దందా తప్ప ఇంకోటి లేదా? హిల్ట్ భూములు ఎట్లమ్ముదాం? ఆ భూములను ఎట్ల దెబ్బ కొడుదాం? ఇండ్ల ఎంత కమీషన్ కొడు దాం? ఇది తప్ప రాష్ట్ర ప్రయోజనాలు, నీళ్లు, రైతుల ప్రయోజనాలు పట్టవా? మనుషులు లేరా? ప్రాజెక్టులకు ఎందుకు రెండేండ్ల నుంచి రూపాయి పెట్టలే? ఎందుకు తట్టెడు మట్టి తీయలే? ఎవరు నిరోధించిండ్రు మిమ్మలను? ఎవరు అడ్డుపడ్డరు మీకు? ఎవరు కట్టేసిండ్రు మీ కాళ్లను? అటు పైసా పని చేయరు. నిష్రియాపరత్వంగా ఉంటరు. డీపీఆర్ పంపిస్తే చప్పుడు చేయరు. ఇవాళ చివరికి 45 టీఎంసీలు కావాలని రాస్తరు. అంటే ఏం కాబోతున్నది? ఎవల ఒత్తిడి ఉన్నది దీని వెనుక? ఏం కుట్ర దాగి ఉన్నది?
-కేసీఆర్
ఏకబిగిన నాలుగున్నర గంటలు
ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలోనూ, తర్వాత మీడియా భేటీలోనూ ఉల్లాసంగా నవ్వుతూ సహచరులను, సభికులను నవ్విస్తూ ప్రసంగిస్తున్న బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. సమావేశంలో ఆయన గంటన్నరసేపు నిలబడి నిరాఘాటంగా ప్రసంగించారు. మరో గంటన్నరసేపు సహచరులతో చర్చలు జరిపారు. మరో గంటన్నర సేపు విలేకరుల సమావేశం నిర్వహించారు.
తెలంగాణ జనం కసిగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. తెలంగాణ భవన్లో సింహం అడుగుపెట్టింది.
రేవంత్ సర్కారు మీద యుద్ధభేరి మోగించింది. కేసీఆర్ రెండేండ్ల వ్యూహాత్మక మౌనం ఆదివారంనాడు పెను విస్ఫోటమై.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కడిగి పారేసింది. సర్కారు విధానాలతో రాష్ట్ర ప్రయోజనాలకు గండి పడుతున్న తీరును కేసీఆర్ వివరిస్తుంటే గంటన్నరపాటు లక్షలమంది టీవీలకు అతుక్కుపోయారు.
కేసీఆర్‌ను చూస్తే.. తెలంగాణకు ఓ గుండెధైర్యం!
ఆయన చిరునవ్వు.. సమస్త జనావళికి ఓ భరోసా!
ఆయన మాట్లాడితే.. వెయ్యేనుగుల ఘీంకారం!
ఆయన ప్రశ్నిస్తే.. అది దద్దరిల్లే ధిక్కారం!
కేసీఆర్ పిడికిలెత్తితే.. మరోపోరుకు కదనశంఖం!
సుదీర్ఘ విరామం తర్వాత కేసీఆర్ మీడియా సమావేశం.. అనేక సందేహాలను పటాపంచలు చేసింది. ఆయన ఆరోగ్యంపై అసందర్భ ప్రేలాపనలను తుత్తునియలు చేసింది. నైరాశ్యంలో నిండిన రైతాంగానికి ఒక నమ్మికను ఇచ్చింది. హామీల అర్రాసుపాటకు మోసపోయి, వంచనకు గురైన ప్రజానీకానికి ఓ ధైర్యాన్ని కలిగించింది. ‘అడ్డెవరు? అడిగేవాళ్లెవరు?’ అన్నట్టు విర్రవీగుతున్న కాంగ్రెస్ పాలకులకు.. గులాబీ అధినేత హెచ్చరిక గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నది.
ట్రిబ్యునల్ డిపెండబుల్ వాటర్ కేటాయింపుల లెక్కల నుంచి, ఫార్మాసిటీ జీరో లిక్విడ్ డిశ్చార్జి టెక్నాలజీ వరకు.. సమగ్ర విషయ పరిజ్ఞానంతో, సాధికారతతో వివరించి చెప్పగలిగిన మరో నాయకుడు ఉన్నాడా? కేసీఆర్ తప్ప! ‘నల్లమల ఏ బేసిన్లో ఉన్నది’ అని అధికారులను అడిగి తెలుసుకునే సబ్జెక్ట్ లేని ముఖ్యమంత్రులు ఉన్నచోట.. ట్రిబ్యునళ్ల చరిత్రను, ప్రాజెక్టుల పంపకాలను, నీటి లెక్కల్ని, రాష్ర్టాల వాటాల్ని కేసీఆర్ నీళ్లు తాగినట్టు గడగడా చెప్పిపారేశారు. అదీ ముఖ్యమంత్రి పదవినుంచి దిగిన రెండేండ్ల తర్వాత కాగితం చూడకుండా, ఎవ్వరి సాయం లేకుండా! ఇలాంటి నేత తెలంగాణలో ఇంకొకరున్నరా? కేసీఆర్ తప్ప! అందుకే, అధికారంలో ఎవరున్నా.. కేసీఆర్ వైపే చూసింది తెలంగాణ!
కుర్చీలో కాంగ్రెస్ కూర్చున్నా..
తెలంగాణకు దిక్సూచి కేసీఆరే!
ఫైళ్లు ప్రభుత్వం దగ్గరున్నా..
ఫైర్ ఉన్నది కేసీఆర్ వద్దే!
పాలమూరుపై ప్రశ్నించే హక్కు కేసీఆర్కుగాక, ఇంకెవరికున్నది? రాజోలిబండ నుంచి రాళ్లురప్పల తొవ్వల కాలినడకన నడిచిండు కేసీఆర్! గంజి కేంద్రాలకు అంగలార్చిన నేలన.. పుట్లకొద్దీ ధాన్యపు పుటలు లిఖించిండు కేసీఆర్! వలస బాటపట్టిన పల్లెలకు.. ఉన్న ఊర్లనే ఎవుసం పండుగజేసిండు కేసీఆర్! పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్‌లోకి తెచ్చి, కరువు నేలకు నీళ్లుతాపిండు కేసీఆర్! అదే పాలమూరునుంచి ప్రారంభించి, ప్రజాక్షేత్రంలో సర్కారు మీద ఉద్యమిస్తామని కేసీఆర్ చేసిన ప్రకటన తెలంగాణ నలుదిక్కులా ప్రతిధ్వనిస్తున్నది.
ఏ నీటికోసం ప్రజలు ఉద్యమించి తెలంగాణ తెచ్చుకున్నారో ఆ నీరే దారి మళ్లుతుంటే కేసీఆర్ చేతులు ముడుచుకొని కూర్చోడని ప్రజలకూ తెలుసు. మిన్నూ మన్నూ ఏకం చేసైనా తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది కేసీఆర్ మాత్రమేననీ వారికి తెలుసు.
ప్రాజెక్టు ఆగిపోతే రైతు అడుగుతడో లేదోగని, కేసీఆర్ అడుగుతడు. నీళ్లు రాకపోతే ఎండిన పొలం ప్రశ్నిస్తదో లేదోగని, కేసీఆర్ నిలదీస్తడు. అందుకే కేంద్రం-ఏపీ కలిసి ఆడుతున్న కపట నాటకంలో చేవలేక, చేతగాక నీళ్లునములుతున్న కాంగ్రెస్ పాలనలో.. కేసీఆర్ వచ్చిండు! ప్రశ్నించిండు! మళ్లీ ఉద్యమిస్తున్నడు! ఆయనే స్వయంగా చెప్పినట్టు..
ఇప్పటిదాక ఒక లెక్క. ఇక నుంచి ఒక లెక్క!
సర్వభ్రష్ట పాలనకు వచ్చే మూడేండ్లు.. ముచ్చెమటలే!
రెండేండ్లలో కాంగ్రెస్ తట్టెడు మట్టి తియ్యలె!
పాలమూరుకు కృష్ణా జలాల్లో జరిగిన అన్యాయాన్ని సవరించేందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు 2015 జూన్ 11న శ్రీకారం చుట్టింది కేసీఆర్ ప్రభుత్వం. 2023 సెప్టెంబర్ 16న ఎత్తిపోతల స్టేజ్-1 ట్రయల్న్‌న్రు ప్రారంభించింది. నార్లాపూర్ పంప్‌హౌస్ వద్ద బటన్ నొక్కగానే కండ్ల ముందు కృష్ణమ్మ ఉవ్వెత్తున ఎగిసిపడ్డ దృశ్యమిది. మరి, రెండేండ్లలో ఏమైంది? కాంగ్రెస్ ప్రభుత్వం తట్టెడు మట్టి కూడా తీయలేదు! గజం పని కూడా చేపట్టలేదు!