జల సంరక్షణకు తెలంగాణ చేస్తున్న కృషి అద్భుతం. నీటి నిర్వహణపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు తెలంగాణలో ‘వాటర్ యూనివర్సిటీ’ని నెలకొల్పాలి.
-వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్
హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): గత ఏడేండ్లుగా జల సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి అద్భుతమని వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఖ్యాతి గడించిన రాజేంద్రసింగ్ అన్నారు. మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టులతో తెలంగాణను జీరో నుంచి హీరోను చేశారని కేసీఆర్‌ను కొనియాడారు. యావత్ దేశానికి తెలంగాణ రోల్ మోడల్ అన్న రాజేందర్‌సింగ్.. కేసీఆర్‌ను చూసి దేశ నేతలు నేర్చుకోవాలని సూచించారు. జల నిర్వహణపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ‘వాటర్ యూనివర్సిటీ’ని నెలకొల్పాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తిచేశారు. తెలంగాణ రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ, ఇండియన్ పెనిన్సులర్ రివర్ బేసిన్ కౌన్సిల్ చైర్మన్ వీ ప్రకాశ్ ఆధ్వర్యంలో జలసౌధలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాల నీటి హక్కులను కాలరాయడమే కాకుండా, నీటి ప్రైవేటీకరణకు కుట్రలు పన్నుతున్నదని ధ్వజమెత్తారు. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో జాతీయస్థాయిలో జల సత్యాగ్రహం చేపడతామని ప్రకటించారు. దేశంలో జలవనరులకు ప్రధాన ఆధారం నదులేనని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కేంద్రీకరణ విధానాలతో జలావరణం తీవ్రంగా దెబ్బతింటున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. నీటిని వాణిజ్య సరుకుగా మార్చి, ప్రైవేటీకరించేందుకు బీజేపీ ప్రభుత్వం పన్నాగాలు పన్నుతున్నదని మండిపడ్డారు. జల సత్యాగ్రహ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై, నదుల పరిరక్షణకు నడుం బిగించాలని పిలుపునిచ్చారు.
26, 27 తేదీల్లో జాతీయ సదస్సు
నదుల పరిరక్షణపై దేశంలోని జల సంరక్షణ ఉద్యమకారులందరితో (వాటర్ వారియర్స్) ఈ నెల 26, 27 తేదీల్లో జాతీయ సదస్సు నిర్వహించనున్నామని వెల్లడించారు. వీ ప్రకాశ్ అధ్యక్షత వహించే ఈ సదస్సులో దేశంలోని నీటి సంరక్షకులు, పర్యావరణవేత్తలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు 200 మంది పాల్గొంటారని చెప్పారు. నదుల పరిరక్షణకు, ప్రజలను నీటి సంరక్షణ దిశగా చైతన్యవంతం చేసేందుకు ఇప్పటికే మ్యానిఫెస్టో రూపొందించామని, దానిపై సదస్సులో చర్చించి విడుదల చేస్తామని వెల్లడించారు. రెండో రోజు కార్యక్రమంలో కృష్ణా, కావేరి, గోదావరి తదితర 11 నదుల పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తామని తెలిపారు. సమావేశంలో వాటర్ వారియర్స్ గురుమూర్తి, బొల్లిశెట్టి సత్యనారాయణ, విశ్రాంత ఇంజినీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్‌రెడ్డి, ఐఈఐ చైర్మన్ రమణానాయక్ తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి అద్భుతం
యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామిని రాజేంద్రసింగ్ మంగళవారం దర్శించుకొన్నారు. వీ ప్రకాశ్, జల్ బిర్డర్ జాతీయ కన్వీనర్ బొల్లిశెట్టి సత్యనారాయణ, సీనియర్ న్యాయవాది గురుస్వామితో కలిసి బాలాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన ఆలయాన్ని పరిశీలించారు. సీఎం కేసీఆర్ ఈ ఆలయం చరిత్రలో నిలిచిపోయేలా అద్భుతంగా నిర్మిస్తున్నారని ప్రశంసించారు. హైదరాబాద్‌కు అతి చేరువలో ఉన్న యాదాద్రి భవిష్యత్తులో గొప్ప పర్యాటక ప్రాంతంగా అవతరిస్తుందని వీ ప్రకాశ్ అన్నారు.