BRS | హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన త్వరలో కీలక సమావేశం జరుగనున్నది. రుణమాఫీ, రైతు భరోసా, పంట పరిహారం ప్రశ్నార్థకమైన వేళ.. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
మరోవైపు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసేలా హైడ్రా పేరుతో కొనసాగుతున్న విధ్వంసం.. కాంగ్రెస్ పార్టీ కుట్ర వ్యూహాలతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. సర్కారు శాఖల మధ్య, మంత్రుల మధ్య సమన్వయం కొరవడి పాలన అస్తవ్యవస్థమైందనే ఆందోళన వ్యక్తం అవుతున్నది.
పుట్టెడు కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలబడాల్సిన అనివార్యత నెలకొన్న నేపథ్యంలో బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులతో కేసీఆర్ వారం పది రోజుల్లో కీలక సమావేశాన్ని నిర్వహించి దిశానిర్దేశం చేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం.