హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): పంటలెండి గుండెచెదిరిన రైతన్నకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భరోసా ఇచ్చారు. సర్కారు మెడలు వంచుదామని పిడికిలెత్తారు. మండుటెండను లెక్కచేయక ఎండిన వరిపొలాలను పరిశీలించారు. రైతు భుజంతట్టి అభయమిచ్చారు. పార్టీ అధినేత తమ ప్రాంతానికి వస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరికి వారు దారిపొడవునా స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులు పట్టారు. ఆదివారం కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం నుంచి బయలుదేరి జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో పంటపొలాలను పరిశీలించారు. రైతులను కలిసి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. దుఃఖంలో ఉన్న రైతులను ఓదార్చి ధైర్యం చెప్పారు.
దారిపొడవునా గులాబీ నీరాజనం
ఎర్రవెల్లి నివాసం నుంచి బయలుదేరిన అధినేతకు అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు. ఎర్రటి ఎండను లెక్కచేయక రోడ్డుకు ఇరువైపులా నిలబడి జై తెలంగాణ.. జై కేసీఆర్ అంటూ పార్టీ కార్యకర్తలే కాకుండా సామాన్యప్రజలు తమ అభిమానాన్ని చాటుకున్నారు.యాదాద్రి-భువనగిరి, జనగామ జిల్లాల సరిహద్దు అయిన పెంబర్తిలో, జనగామ, సూర్యాపేట జిల్లాల సరిహద్దు అయిన తిరుమలగిరిలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడి కేసీఆర్‌పై పూలవర్షం కురిపించారు.
ఎర్రవల్లి నుంచి తోడ్కొని..
కేసీఆర్ తమ ప్రాంతంలోని రైతులకు బాసటగా నిలిచేందుకు వస్తున్న నేపథ్యంలో జనగామ జిల్లా నేతలు కేసీఆర్‌ను స్వాగతం పలికేందుకు నేరుగా ఎర్రవెల్లిలోని వారి వ్యవసాయక్షేత్రానికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా నేతలు వెళ్లి ఆహ్వానించారు. కేసీఆర్‌తోనే వారు పయనమయ్యారు. అక్కడి నుంచి ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి, జనగామ నియోజకవర్గంలోని పెంబర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని లింగాలఘనపురం, దేవరుప్పుల మీదుగా సూర్యాపేట జిల్లాకు సరిహద్దుకు చేరుకోగానే మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ తదితరులు కేసీఆర్‌కు స్వాగతం పలికారు. తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని అర్వపల్లి, వెలుగుపల్లి గ్రామాల్లో ఎండిన పంటలను పరిశీలించారు. ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ మధ్యాహ్న భోజనం చేశారు. అక్కడి నుంచి సూర్యాపేట పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అక్కడి నుంచి తిరిగి ఎర్రవెల్లికి చేరుకున్నారు.
మిన్నంటిన జై తెలంగాణ.. జై కేసీఆర్ నినాదాలు
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని ధరావత్‌తండాలో కేసీఆర్ పర్యటిస్తుండగా, జై తెలంగాణ.. జై కేసీఆర్ అని ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్ర సర్కారు తీరుపై విమర్శనాస్ర్తాలు సంధిస్తూ రైతులు ప్లకార్డులు ప్రదర్శించారు. ‘తక్షణమే కాల్వల ద్వారా చెరువులు నింపాలి, రూ.2 లక్షల రుణమాఫీ చేయాలి, రాజకీయాలు మనకు వద్దు.. రైతులను ఆదుకోవడమే ముద్దు, 24 గంటలు కరెంట్ ఇవ్వాలి’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుబంధు రాలేదని ఆవేదన చెందారు. పంటకు సరిపడా నీళ్లు ఇస్తామంటేనే వరినాట్లు వేశామని, లేదంటే మక్కజొన్నో, పజ్జోన్నో వేసేవాళ్లమని రైతులు, చివరికి కౌలు రైతులు కూడా తమ గోడును వెల్లబోసుకున్నారు. నీళ్లు లేక ఎండినోరు తెరచిన తమ పొలాన్ని, వాలిపోయి పేలిపోయిన వరిగొలుసులను కేసీఆర్‌కు చూపించి రైతులు విలపించారు.