BRS | (సోలాపూర్ నుంచి నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి) : బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ రెండ్రోజుల పర్యటన మహారాష్ట్ర ప్రజల జీవితంలో మరపురాని ఘట్టంగా నిలిచిపోయింది. 600 కార్లతో.. ఆరు కిలోమీటర్ల పొడవైన భారీ కాన్వాయ్‌తో ప్రగతి భవన్ నుంచి సోలాపూర్ వరకు బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన మహాయాత్ర మహాచరిత్రగా మిగిలిపోనున్నది. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి తన మంత్రి వర్గ సహచరులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులతో మరో రాష్ర్టానికి పయనమవ్వడం, అక్కడ రెండు రోజులపాటు బస చేయడం, రోడ్డుమార్గాన ప్రజలకు అభివాదం చేస్తూ వారి నుంచి సాదర స్వాగతాన్ని స్వీకరిస్తూ ముందుకు సాగడమనేది ఇటీవలి భారత రాజకీయ చరిత్రలో సరికొత్త సన్నివేశాన్ని ఆవిష్కరించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 5న నాందేడ్‌తో మొదలైన కేసీఆర్ పర్యటన తాజాగా సోలాపూర్, దారాశివ్ జిల్లాలతో అటు విదర్భ, ఇటు పశ్చిమ మహారాష్ట్ర, మరఠ్వాడాను ఆయన చుట్టిరావడం మహారాష్ట్ర రాజకీయ కురువృద్ధులను సైతం కలవరపాటుకు గురిచేసింది.
సీఎం కేసీఆర్ ‘మహా’యాత్రకు ప్రజలు బ్రహ్మరథంపట్టారు. హైదరాబాద్ టూ సోలాపూర్ జాతీయ రహదారి మొదలు సోలాపూర్, దారాశివ్ జిల్లాల్లో ఊరున్న ప్రతీ చోట జనం స్వచ్ఛందంగా ఇండ్ల నుంచి బయటకు వచ్చి కేసీఆర్‌కు అభివాదం చేశారు. విఠలేశ్వరుడి సన్నిధిలో అధినేత కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ మంగళవారం ఉదయం నేరుగా పండరిపురానికి చేరుకొన్నారు. శ్రీ విఠల్ రుక్మిణీ ఆలయాన్ని సందర్శించారు. శ్రీ విఠలేశ్వరస్వామికి, రుక్మిణీ అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. అనంతరం అమ్మవారి పాదాలను పసుపు కుంకుమలతో అలంకరించి, మొక్కుకొన్నారు. ఆలయ అర్చకులు సీఎం కేసీఆర్ మెడలో తులసిమాల వేసి, వేదమంత్రాలతో ఆశీర్వచనం అందజేశారు. శ్రీ విఠలేశ్వరస్వా మి, రుక్మిణీ అమ్మవారి చిత్రపటాన్ని సీఎం కేసీఆర్‌కు బహూకరించారు. అనంతరం తుల్జాపూర్‌లోని తుల్జా భవానీ అమ్మవారి ఆలయానికి చేరుకొని భవానీ అమ్మవారిని దర్శించుకొని, కేసీఆర్ మొకులు చెల్లించారు. కేసీఆర్ పేరుమీద మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆమె కుమారుడు కార్తీక్‌రెడ్డి ప్రత్యేక పూజలు జరిపించారు. ఆలయ అధికారులు కేసీఆర్‌కు సంప్రదాయబద్ధంగా తలపాగాను ధరింపజేసి, శాలువాతో సతరించారు. అమ్మవారిని ప్రతిమను అందజేశారు.
ఉదయం విఠలేశ్వరుడు, సాయంత్రం తుల్జాభవానీ దర్శనం తమకు దకిన అదృష్టమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణతోపాటు దేశప్రజలు సుభిక్షంగా, సుఖ సంతోషాలతో వర్ధిల్లేలా చూడాలని ప్రార్థించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ దేశంలో ప్రకృతి వనరులు, సకల సంపదలు ఉన్నా తాగు, సాగునీరు, 24 గంటల విద్యుత్తు వంటి మౌలిక సదుపాయాలు లేక ప్రజలు కష్టాలు పడుతున్నారని అన్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు తెచ్చేందుకే బీఆర్ఎస్ పుట్టిందని పునరుద్ఘాటించారు. దేశంలోనే మొదటిసారిగా రైతురాజ్య స్థాపన నినాదాన్ని ఇచ్చామని గుర్తు చేశారు. మహారాష్ట్ర వ్యాప్తంగా పల్లె పల్లెనా ప్రజలు బీఆర్ఎస్కు మద్ధతు పలుకుతున్నారని చెప్పారు. గ్రామీణ కమిటీల్లో ఇప్పటికే 11 లక్షల మంది సభ్యులుగా చేరారని, భవిష్యత్తులో ఆ సంఖ్య 35 లక్షలకు పైగా చేరుకొంటుందని తెలిపారు. మహారాష్ట్రలోని ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ విస్తరిస్తుందని, గ్రామానికి 9 కమిటీలను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. దేశంలోని ప్రజలు, రైతులు తమ అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొనే దిశగా ఆలోచన చేస్తున్నారని, ఈ మేరకు బీఆర్ఎస్ను ఎన్నుకొని కిసాన్ సరారును స్థాపించుకుంటారనే విశ్వాసం తనకున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు.
మహారాష్ట్రలోని పండరిపురంలో మంగళవారం జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సమక్షంలో పండరిపూర్ ఎన్సీపీ నేత భగీరథ్ బాలేతోపాటు పలువురు ముఖ్యనేతలు పార్టీలో చేరారు. బాల్కేతోపాటు అదితి యాదవ్, ప్రశాంత్ షిండే, సామధాన్ పాటే, నితిన్ భగేల్, మేజర్ విలాస్ భోస్లే, తానాజీ చవాన్, బిబిషన్ జాదవ్, వెంకటన్న బాలే, అనంత్ భోస్లే, సంతోష్ భోస్లేకు కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
సీఎం కేసీఆర్ రెండ్రోజుల మహారాష్ట్ర పర్యటనను విజయవంతంగా ముగించుకొని మంగళవారం రాత్రి హైదరాబాద్ తిరుగుపయనమయ్యారు. రోడ్డు మార్గం ద్వారా భారీ కాన్వాయ్‌తో మహారాష్ట్ర నుంచి సంగారెడ్డి జిల్లా మీదుగా హైదరాబాద్‌కు బయలుదేరారు. కాన్వాయ్ రాత్రి 9 గంటలకు తెలంగాణ సరిహద్దు గ్రామమైన చెరాగ్పల్లిలోకి ప్రవేశించగానే జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు, బీఆర్ఎస్ నాయకులు స్వాగతం పలికారు. రాత్రి 11 గంటలకు సీఎం కాన్వాయ్ హైదరాబాద్‌కు చేరుకున్నది.