నాగర్‌కర్నూల్, మే 4 (నమస్తే తెలంగాణ): నాగర్‌కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గం సస్యశ్యామలం కానున్నది. జిల్లాకు మరో ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు చేశారు. అచ్చంపేట లిఫ్టు ఇరిగేషన్ స్కీంకు ప్రభుత్వం రూ.1,534 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన పరిపాలనా అనుమతులను బుధవారం రాత్రి జారీ చేసింది. నల్లమల ప్రాంతం ఎత్తుగా ఉండటంతో ప్రాజెక్టు నిర్మాణం అత్యంత క్లిష్టంగా మారింది. ప్రజల ఆకాంక్షను, పరిస్థితులను ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా.. స్పందించిన సీఎం రిజర్వాయర్ నిర్మించాలని నిర్ణయించారు. రెండ్రోజుల కిందట అచ్చంపేట లిఫ్టు ఇరిగేషన్ స్కీంలో భాగంగా స్టేజ్ -1 పనులను చేపట్టేందుకు ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో 2.5 టీఎంసీల సామ ర్థ్యం కలిగిన రిజర్వాయర్‌ను నిర్మించనున్నా రు. అప్రోచ్ కెనాల్, కెనాల్ లింకింగ్, పంప్‌హౌస్, ఇతర పనులు చేపట్టనున్నారు. కృష్ణా జలాల ఆధారంగా పాలమూరు ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన వనపర్తి జిల్లా ఏదుల రిజర్వాయర్ నుంచి దాదాపు 25 కిలోమీటర్ల పొ డవైన కాల్వ ద్వారా లింగాల మండలం సూరారంలో నిర్మించనున్న 2.5 టీఎంసీల సామ ర్థ్యం ఉన్న ఉమామహేశ్వర రిజర్వాయర్‌కు నీటిని తరలిస్తారు.
ఈ నీటిని బల్మూర్, కొండనాగుల, మైలారం గ్రామాల పరిధిలో నిర్మించే లిఫ్టుతో ఆయకట్టుకు ఎత్తిపోస్తారు. దీంతో అచ్చంపేట, ఉప్పునుంతల, బల్మూర్ మండలాల్లోని 57,200 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనున్నది. ఇప్పటి వరకు మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ (ఎంజీకేఎల్ఐ) పరిధిలో అచ్చంపేటలో కేవ లం 3 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతున్నది. ఇక స్టేజ్-2 పనుల్లో భాగంగా మున్ననూర్ వద్ద నిర్మించనున్న ప్రతిపాదిత చెన్నకేశవ రిజర్వాయర్‌తో అమ్రాబాద్, పదరకు సాగునీరు అందనున్నది. ఈ పనులకూ త్వరలోనే పరిపాలనా అనుమతులు రానున్నాయి. ఈ రిజర్వాయర్ పూర్తయితే మరో 20 వేల ఎకరాలు సాగులోకి రానున్నాయి. రెండు లిఫ్టులు పూర్తయితే నియోజకవ్గంలో మొత్తం 70 వేల ఎకరాలకుపైగా సాగునీరు అందనున్నది. లిఫ్టు రానుండటంతో అచ్చంపేట నియోజకవర్గ ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికతకు ప్రాధాన్యతనిస్తూ సీఎం కేసీఆర్ సూచన మేరకు అచ్చంపేట నియోజకవర్గంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఉమామహేశ్వరుని పేరును ఈ రిజర్వాయర్‌కు పెట్టారు. త్వరలోనే లిఫ్ట్ పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. పరిపాలనా అనుతులు రావడంతో అచ్చంపేట ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. ప్రభుత్వ విప్ గువ్వలకు ప్రజల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. గువ్వల ఆధ్వర్యంలో రెండ్రోజుల్లో నియోజకవర్గంలో సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతగా ర్యాలీ, సభ నిర్వహించనున్నారు.