రాష్ట్రంలో 9 మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం పండుగ వాతావరణంలో సాగింది. కరీంనగర్, కామారెడ్డి, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగామ జిల్లాల్లోని నూతన మెడికల్ కాలేజీల్లో తరగతులను సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కాలేజీలకు వెళ్లి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించారు.
దేశంలో వైద్య విద్యకు తెలంగాణ కేరాఫ్‌గా మారిం ది. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు మూలంగానే ఇది సాధ్యమైంది. సీఎం కేసీఆర్ దూరదృష్టితో తీసుకున్న ఈ విప్లవాత్మకమైన నిర్ణయంతో రాష్ట్రంలో పేదింటి బిడ్డలు సైతం ఉచితంగా వైద్యవిద్యను అందుకునే అవకాశం దక్కింది. కేసీఆర్ పరిపాలన యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది. మెడికల్ కాలేజీ ద్వారా కేవలం వైద్య కళాశాల ఒక్కటే కాకుండా 330 పడకలతో దవాఖాన కూడా వస్తుంది. పేదవారికి మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం రూ.50 లక్షలు, పీజీ విద్యను అభ్యసించే వారిపై రూ.75 లక్షలు, సూపర్‌స్పెషాలిటీ వైద్య విద్య నేర్చుకునే వారికి రూ.90లక్షల మేర వ్యయాన్ని భరిస్తున్నది.
– శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి
నిర్మల్ జిల్లా ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నిర్మల్‌లో మెడికల్ కాలేజీ వస్తుందని ఎవరూ ఊహించలేదు. సీఎం కేసీఆర్ వల్లే ఇది సాధ్యమైంది. రూ.45 కోట్లతో నిర్మించుకున్న ఇక్కడి మెడికల్ కాలేజీ భవనంలోనే 300 పడకల దవాఖాన కూడా త్వరలో ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. వచ్చే రెండేళ్లలో ఈ ప్రాంతమంతా ఒక మెడికల్ హబ్‌గా మారుతుంది.
– మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
వైద్య విద్యలో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. అందని ద్రాక్షలా ఉన్న వైద్య విద్యను పేదింటి బిడ్డకు సీఎం కేసీఆర్ చేరువ చేశారు. స్వరాష్ట్రంలో పదేండ్లలో 21 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసి ఏడాదికి 10వేల మంది డాక్టర్లను తయారు చేస్తున్నారు. ప్రతీ లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. వడ్లు పండించడంలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. అలాగే ఇప్పుడు వైద్యులను తయారు చేయడంలోనూ దేశంలో ముందంజలోనే ముందంజలో ఉన్నాం.
– మంత్రి సత్యవతి రాథోడ్
దేశంలో ఎక్కడాలేని విధంగా జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. ఒకేసారి 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించడం కూడా దేశంలోనే ఇదే మొదటిసారి. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 26కు పెరిగింది. రానున్న ఐదేళ్లలో ప్రతీ ఏటా 10 వేల మంది వైద్యులు తెలంగాణ నుంచి వస్తారు. దీంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుంది.
– మంత్రి పట్నం మహేందర్ రెడ్డి
ఒకే రోజు 9 వైద్య కళాశాలలను ప్రారంభించుకున్న ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుంది. గతంలో మన పిల్లలకు వైద్య విద్య అందని ద్రాక్షగా ఉండేది. ఇక్కడ సీటు దొరకకుంటే చైనా, ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు వెళ్లి చదువుకోవాల్సి వచ్చేది. తెలంగాణ రాక ముందు రాష్ట్రంలో ఐదు మెడికల్ కళాశాలలు మాత్రమే ఉండేవి. ప్రతి పేదింటి బిడ్డ డాక్టర్ కావాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ జిల్లాకో వైద్య కళాశాల స్థాపించారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు రాష్ట్రం నుంచి ప్రతి ఏడాది 850 మంది మాత్రమే వైద్య విద్యను అభ్యసించే అవకాశం ఉండేది. ఇప్పుడా సంఖ్య 4,490కి పెరిగింది. రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతున్నది. దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగింది. భవిష్యత్తులో దేశప్రజలందరికీ వైద్యం అందించే స్థాయికి ఎదుగుతుంది. గతంలో ఎంబీబీఎస్ చదవాలంటే ఎన్నో అడ్డంకులు ఎదురయ్యేవి. సీఎం కేసీఆర్ ఆలోచనతో ఇప్పుడు వైద్యవిద్యఎంతో సులభతరమైంది.
-మంత్రి గంగుల కమలాకర్
తెలంగాణలో ఆరోగ్య విప్లవం మొదలైంది. జిల్లాకో మెడికల్ కాలేజీతో వైద్యుల తయారీ కర్మాగారంగా మారింది. రాష్ర్టాన్ని సీఎం ఓ ప్రత్యే విజన్‌తో అభివృద్ధి చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్రంలో 5 మెడికల్ కాలేజీలే ఉండేవి. నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 5 మెడికల్ కాలేజీలు, దవాఖానాలు ఉన్నాయి. వీటితో వరంగల్ మెడికల్ హబ్‌గా మారింది. వరంగల్‌లో రూ.11వందల కోట్లతో అంతర్జాతీయస్థాయిలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ దవాఖాన దేశ వైద్య రంగంలో మూడోస్థానంలో నిలుస్తుంది. ఒకప్పుడు జనగామ జిల్లానే ఊహించలేకపోయాం. ఇప్పుడు ఏకంగా మెడికల్ కళాశాల, అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ దవాఖాన రావడం ఆనందంగా ఉంది.
– మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
దేశాన్ని 75 ఏండ్లు పాలించిన కాంగ్రెస్, బీజేపీ తెలంగాణ అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత మన సీఎం కేసీఆర్‌దే. తెలంగాణలో చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక ప్రజలు బీఆర్ఎస్ పాలనను కోరుకుంటున్నారు. గతంలో బెంగళూరు ఐటీకి అగ్రగామిగా నిలిస్తే, ప్రస్తుతం మంత్రి కేటీఆర్ సారథ్యంలో తెలంగాణ ఐటీలో అగ్రగామిగా వెలుగొందుతున్నది. దేశంలో ఐటీ పేరు ఎత్తితే హైదరాబాదే గుర్తుకు వస్తున్నది. 9 లక్షల మంది ఐటీలో పనిచేస్తున్నారు.
-కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి
రాష్ట్రంలో ఒకేసారి 9 మెడికల్ కళాశాలలను సీఎం కేసీఆర్ ప్రారంభించడం వైద్య చరిత్రలో సువర్ణాధ్యాయం. నేను ఖమ్మం ఎమ్మెల్యేగా, మంత్రిగా కొనసాగుతున్న సమయంలో మెడికల్ కళాశాలను ప్రారంభించుకోవడం ఆనందంగా ఉంది. గతంలో పేదింటి పిల్లలు మెడిసిన్ చదవాలంటే ఇబ్బంది పడేవారు. సీఎం కేసీఆర్ కృషితో ఇప్పుడు తక్కువ ఖర్చుతోనే మెడిసిన్ చదివే అవకాశం వచ్చింది. అసెంబ్లీ సాక్షిగా జిల్లాకో మెడికల్ కళాశాల ఇస్తామని సీఎం హామీ ఇచ్చి, దానిని ఆచరించి చూపించారు. ఖమ్మం జిల్లా సార్వజనీన దవాఖానలో ఇకనుంచి 24 గంటలపాటు నాణ్యమైన వైద్యసేవలు లభిస్తాయి. అడిగిన వెంటనే ఖమ్మానికి మెడికల్ కాలేజీని కేటాయించిన ముఖ్యమంత్రికి, మంత్రి హరీశ్‌రావుకు ధన్యవాదాలు.
– మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్