సత్తుపల్లి, మే 15: ఖమ్మం డీసీఎంఎస్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రాయల వెంకట శేషగిరిరావు (70) కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్లోని యశోద దవాఖానలో చేరిన ఆయన బుధవారం మరణించారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లికి చెందిన ఆయన 1978లో యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1982లో ఎన్టీఆర్ పిలుపు మేరకు అప్పట్లో టీడీపీలో చేరారు. 1987లో తల్లాడ మండల తొలి ఎంపీపీగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత తల్లాడ మండలం గంగదేవిపాడు సహకార సొసైటీ అధ్యక్షుడిగా మూడుసార్లు, 2014 నుంచి 2019 వరకు డీసీసీబీ డైరెక్టర్గా, 2019 నుంచి 2023 వరకు డీసీఎంఎస్ చైర్మన్గా పనిచేశారు. 2018లో అప్పటి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వెంట బీఆర్ఎస్లో చేరారు. పార్టీ బలోపేతానికి ఎంతో కృషిచేశారు. రాయల వెంకట శేషగిరిరావుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన అంత్యక్రియలు గురువారం తల్లాడ మండలంలోని మిట్టపల్లిలో జరుగుతాయని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. రాయల మృతి పట్ల బీఆర్ఎస్ సహా పలు పార్టీల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
రాయల వెంకటశేషగిరిరావు మృతిపట్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. దశాబ్దాలకాలంగా ఆయనతో తనకున్న రాజకీయ అనుబంధంతోపాటు రైతాంగం, ప్రజలు, పార్టీ కోసం శేషగిరిరావు చేసిన కృషిని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వెంకటశేషగిరిరావు మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సంతాపం తెలిపారు.