KTR | హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణ బలం, దళం, గళం బీఆర్ఎస్ పార్టీయేనని, ఢిల్లీలో తెలంగాణ మాట వినిపించింది, వినిపించేది భారత రాష్ట్ర సమితి పార్టీ ఎంపీలేనని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు అన్నారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడేది, తెలంగాణ ప్రయోజనాలకు శ్రీరామ రక్ష లాంటిది బీఆర్ఎస్ పార్టీ అని నొక్కిచెప్పారు. తెలంగాణ హకులు, నిధులు, నీళ్లు, ఇతర సమస్యలపైన బలంగా పోరాడగలిగేది బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. అందుకే రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు కేటీఆర్ విజ్ఞప్తి చేశా రు. బుధవారం తెలంగాణభవన్‌లో ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశం కేటీఆర్ అధ్యక్షతన జరిగింది. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రయోజనాల కో సం, కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడేందుకు బీఆర్ఎస్ ఎంపీలను గెలిపించాలని కోరారు. ప దేండ్లలో పార్లమెంటులో తెలంగాణ మాట వినిపించిందంటే దానికి కారణం బీఆరెస్సేనని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఏనాడూ తె లంగాణ పదం మాట్లాడలేదని మండిపడ్డారు.
దేశంలో అనేక రాష్ట్రాల పేర్లు చెబితే కొం దరు నాయకులు గుర్తుకొస్తారని, వారిలో బెం గాల్‌కు మమత బెనర్జీ, తమిళనాడుకు స్టాలిన్, డీఎంకే, అన్నాడీఎంకే, ఏపీకి జగన్, చంద్రబా బు, బీహార్‌కు నితీశ్‌కుమార్, తేజస్వీ యాదవ్, ఒడిశాకు నవీన్ పట్నాయక్ మాదిరిగా తెలంగాణ అంటే గుర్తుకొచ్చే నాయకుడు కేసీఆర్ మాత్రమేనని పేర్కొన్నారు. కేసీఆర్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఒక అస్తిత్వం, గౌరవం వచ్చాయని అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం అం టే ఎన్టీఆర్ గుర్తుకొచ్చినట్టు, తెలంగాణ అంటే కేసీఆర్ గుర్తుకొస్తారని చెప్పారు. తెలంగాణ ప్రయోజనాల గురించి ఢిల్లీలో బలంగా వినిపించాలంటే బీఆర్ఎస్ దండు పార్లమెంటులో ఉండాల్సిందేనని అన్నారు. తెలంగాణ ‘కోసం కాంగ్రెస్ నేత రాహుల్, బీజేపీ జాతీయ నేతలు పార్లమెంటులో ఏనాడైనా మాట్లాడారా? పార్లమెంటులో తెలంగాణ దళం లేకుంటే ఢిల్లీలో తెలంగాణ ఉనికి ఉంటుందా?’ అని ప్రశ్నించారు. గతంలో అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని నిషేధించినట్టే బీఆర్ఎస్ ఎంపీలు లేకుంటే పార్లమెంటులో తెలంగాణ నిషేధించబడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ‘తమిళనాడు మాదిరి రాజకీయ వైరుధ్యాలకు అతీతంగా ఇకడి కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు తెలంగాణ కో సం ఏనాడూ కలిసి రాలేదు. తెలంగాణకు నష్టం జరిగినా పట్టించుకోలేదు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. మత విద్వేషం తప్ప రాష్ట్రానికి బీజేపీ చేసిన పనిలేదని దుయ్యబట్టారు. మో దీకి వ్యతిరేకంగా పోరాడే దమ్మున్న నేత కేసీఆర్ అని, యూనిఫాం సివిల్ కోడ్‌ను తీవ్రంగా వ్యతిరేకించింది బీఆర్ఎస్ అని గుర్తు చేశారు.
గత లోక్‌సభ ఎన్నికల్లో మాదిరిగానే కాం గ్రెస్, బీజేపీ మరోసారి అంతర్గతంగా అవగాహనకు వచ్చారని, అందుకే బీజేపీ ఎంపీ బండి సంజయ్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని పొగుడుతున్నారని కేటీఆర్ అనుమానం వ్యక్తంచేశారు. తెలంగాణలో రెండు జాతీయ పార్టీలు తమ స్వప్రయోజనాల కోసం పనిచేయడం ప్రారంభించాయని ఆరోపించారు. తెలంగాణ ఆస్తిత్వం కోసం లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని బలపరచాలని ప్రజలను కోరారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరిగిన చిన్నచిన్న పొరపాట్లను సరిదిద్దుకొని ఆత్మ పరిశీలన చేసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా, ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చిందని చెప్పారు. ఇప్పుడు హామీలు ఎత్తగొట్టేందుకు శ్వేత పత్రాల పేరుతో ప్రజల దృష్టి మళ్లించే దిగజారుడు రాజకీయాలు చేస్తున్నదని విమర్శించారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నేతలిచ్చిన 420 హామీలను పకనపెట్టి డ్రామాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ రైతుబంధు డబ్బులు విడుదలచేయకపోవటంతో రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, గతంలో డిసెంబర్ నుంచి మార్చి వరకు రైతుబంధు వేశారని సీఎం చెప్పటం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ని దెబ్బతీసేలా కాంగ్రెస్ వ్యవహరిస్తున్నదని విమర్శించారు. అబద్ధాలతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ, అదే ప్రచారాన్ని మరోసారి తెలంగాణపై ప్రయోగించాలని చూస్తుందని, వాటిని తిప్పికొడదామని కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు మరో 70 రోజులే సమయం ఉన్నదని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ గోబెల్స్ ప్రచారాన్ని తెప్పికొట్టి ప్రజలను ఓటు అడుగుతామని, లోక్‌సభ మాత్రమే కాకుండా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా పార్టీని సమాయత్తం చేస్తామని ఆయన తెలిపారు.
బీఆర్ఎస్కు ఉద్యమాలు, పోరాటాలు కొత్త కాదని, ప్రతిపక్షం అంటే ఎలా ఉంటుందో చూపిస్తామని మాజీ మంత్రి టీ హరీశ్‌రావు అన్నారు. అవసరమైతే జైలుకు వెళ్లడానికి సిద్ధమన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన రూ.2 లక్షల రైతు రుణమాఫీ హామీని అమలు చేసి లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు అడగాలని సవాల్ విసిరారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. ఓటమితో కార్యకర్తలు నిరాశకు లోనుకావద్దని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసినా, బిల్లుల విడుదలో జాప్యం చేసినా హైకోర్టుకు వెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని ప్రకటించారు. కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన పనులను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేస్తే ఆ పనుల దగ్గర ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే కేశవరావు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసుకొనే అంశంపై ముందుముందు చర్చిస్తామని తెలిపారు. అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికలను చాలెంజ్‌గా తీసుకోవాలని పార్టీ క్యాడర్‌కు సూచించారు. మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడుతూ ప్రభుత్వ ద్రోహాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ ఎంపీ వినోద్‌కుమార్, అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి, వేణుగోపాలాచారి, ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవా లక్ష్మి, ఎమ్మెల్సీ విఠల్, మాజీ ఎమ్మెల్యేలు కొనేరు కోనప్ప, విఠల్‌రెడ్డి, అత్రం సక్కు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ విజయాలను వైఫల్యాలుగా చిత్రీకరించేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తున్నదని కేటీఆర్ విమర్శించారు. వ్యవసాయానికి వెన్నుదన్నుగా నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టును కూడా విఫల ప్రాజెక్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ పుట్టుకను కూడా అవమానించిన నరేంద్రమోదీని, బీజేపీని లోక్‌సభ ఎన్నికల్లో అడ్డుకుంటామని ప్రకటించారు. మత విద్వేషం తప్ప ఒక మంచి పని చేయని బీజేపీతో పోరాడాలంటే కేసీఆర్ లాంటి బలమైన నాయకుడు కావాలని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అనేక స్థానాల్లో ఓడించింది బీఆర్ఎస్ మాత్రమేనని తెలిపారు. బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్, సోయం బాపురావును ఓడగొట్టింది బీఆర్ఎస్ అనే విషయాన్ని కాంగ్రెస్ గుర్తించుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ దెబ్బకు అంబర్‌పేటలో కిషన్‌రెడ్డి పోటీ చేయకుండా తప్పించుకున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ముస్లింలు గందరగోళపడకుండా బీజేపీని ఎదుర్కొనేది బీఆర్ఎస్ అనే విషయాన్ని గుర్తించి అదిరించాలని కోరారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటామని కేటీఆర్ తెలిపారు. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సమావేశాల అనంతరం అసెంబ్లీ నియోజకవర్గ సమావేశాలు ఉంటాయని చెప్పారు. లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక ఏకపక్షంగా ఉండదని, అందరి అభిప్రాయాలు తీసుకొని చేస్తామని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తర్వాత బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల నుంచి అనేక అభిప్రాయాలు వచ్చాయని తెలిపారు. కేసీఆర్ సీఎం పదవి నుంచి దిగిపోతారని, ఓడిపోతారని కలలో కూడా అనుకోలేదని గ్రామాల్లో ప్రజలు చర్చించుకుంటున్నారని చెప్పారు. ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గ సమీక్షలో పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తల సూచనలను తీసుకున్నామని, వీటిని పార్టీ అభిప్రాయంగా కాకుండా ప్రజల అభిప్రాయంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ప్రభుత్వంపై, పార్టీపై జరిగిన దుష్ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టలేకపోయామని కార్యకర్తలు తమ దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని సూచించారని తెలిపారు. కాంగ్రెస్ దాడులను ప్రజాస్వామికంగా ఎదురొంటామని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు మోసపూరితమైనవని విమర్శిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఒక పుస్తకాన్ని విడుదల చేసింది. కాంగ్రెస్ హామీల్లోని డొల్లతనాన్ని వివరిస్తూ.. ప్రతీ హామీకి ఒక నంబర్ ఇస్తూ ప్రత్యేకంగా పుస్తకాన్ని రూపొందించారు. వరుస క్రమంలో హామీలను రాయగా.. అవి మొత్తం 420 అయ్యాయి. దీనికి సంబంధించిన పుస్తకాన్ని బుధవారం తెలంగాణభవన్‌లో కేటీఆర్ విడుదల చేశారు. వందలకొద్ది హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడేమో ఆరు హామీలు అని మాత్రమే చెప్తున్నదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ వివిధ డిక్లరేషన్ల పేరుతో ఇచ్చిన హామీలను కూడా ఒక్కచోట చేర్చి పుస్తకాన్ని రూపొందించామని చెప్పారు. కాంగ్రెస్ హామీల సంఖ్య మోసానికి మారుపేరుగా ఉండే 420గా ఉన్నదని, వాళ్ల హామీలు కూడా 420 హామీలలాగే ఉన్నాయని ఎద్దేవా చేశారు.