KTR | కేసీఆర్ ముఖ్యమంత్రిగా లేరనే విషయాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని జిల్లాల నేతలు చెబుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ తెలంగాణ భవన్లో ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ సమీక్ష సమావేశం జరిగింది. సమావేశం అనంతరం కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, జోగు రామన్నతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సరిగ్గా నెల రోజుల కిందట డిసెంబర్ 3న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. నెల రోజుల్లోనే మాకు మా శ్రేయోభిలాషులు, మా పార్టీ నాయకులు, కార్యకర్తలు గత నెల రోజుల్లో నియోజకవర్గాలకు, జిల్లాలకు వెళ్లినప్పుడు కానీ, హైదరాబాద్‌లో తెలంగాణ భవన్‌లోని కేంద్ర కార్యాలయంలో వివిధ సందర్భాల్లో కలిసిన సమయంలో చాలా విషయాలు చెబుతూ వచ్చారు’ అన్నారు.
‘పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు ఆదిలాబాద్ నుంచి ప్రారంభించాం. సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో మళ్లీ తమ అభిప్రాయాలను నిక్కచ్చిగా, కుండబద్దలు కొట్టినట్లుగా, నిర్మొహమాటంగా మా అందరి దృష్టికి తీసుకురావడం జరిగింది. గ్రామాల్లో అనుకుంటూ ఉన్నరు. బీఆర్ఎస్ ఓడిపోతది అనుకోలేదు. కేసీఆర్ సీఎంగా దిగిపోతరనే మాట అస్సలు అనుకోలేదు. పోతేపోతే మా ఎమ్మెల్యే ఓడిపోతడేమో కానీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండడు అని మేం కలలో కూడా అనుకోలేదు అనే మాట. అయ్యయ్యో గిట్లెట్ల జరిగిందనే భావన ఉన్నది. దాంతో పాటు ప్రతి గ్రామంలో ప్రతి జరుగుతున్న చర్చని మా దృష్టికి మా నాయకులు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వచ్చిన నాయకులు చాలా మంది తీసుకువచ్చారు. గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు తీసుకువచ్చిన కొన్ని కార్యక్రమాలు, పెట్టిన పథకాల్లో కొన్ని సవరణలు చేస్తే బాగుండేది. కొన్ని లోటుపాట్లుండే.. వాటిని కూడా సవరిస్తే బాగుండేదని అభిప్రాయాన్ని చాలా నిక్కచ్చిగా చెప్పడం జరిగింది’ అని కేటీఆర్ తెలిపారు.
‘ఇవాళ 11.30 గంటలకు సమావేశం ప్రారంభిస్తే.. దాదాపు 5.30 గంటల వరకు సుదీర్ఘంగా భేటీ జరిగింది. సమావేశానికి వచ్చిన నాయకుల్లో పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వాళ్లు, కీలక నేతలు సైతం అభిప్రాయాలను చెప్పారు. వారందరికీ ధన్యవాదాలు. ఈ రోజు ఆ నేతలు చెప్పిన ప్రతిమాట.. ప్రజల నుంచి వస్తున్న గొంతుగా, అభిప్రాయంగా పరిగణిస్తున్నాం. పదేళ్ల పాలన, జరిగిన అభివృద్ధి ఎవరూ కాదనలేని, కళ్లకు కొట్టొచ్చినట్లు కనబడుతున్న వైనాన్ని అందరూ ప్రస్తావించారు. అభివృద్ధి విషయంలో ఎలాంటి ఫిర్యాదులు లేవు. కరెంటు విషయంలో కంప్లయింట్ లేదు. సాగు, తాగునీరు.. రోడ్ల విషయంలో ఎవరూ వేలెత్తి చూపించలేదు. జిల్లాకో మెడికల్ కాలేజీ పెట్టినా ఎవరూ వేలెత్తి చూపించలేదు. ఆసుపత్రులు కట్టారు.. బాగా చేశారు. ఎలాంటి కంప్లయింట్స్ లేవు. కానీ, కొన్ని విషయాలున్నాయి. ఓడిపోయింది 1.88శాతం, 5లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయాం. చిన్నచిన్న లోటుపాట్లు సవరించుకుంటే బాగుండేది అనే మాట చెప్పారు. ఎప్పటికప్పుడు మాపై జరిగిన దుష్ప్రచారాన్ని సరిగా ఖండించలేదు. పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. పదేళ్లు పార్టీ నిర్మాణం ఇంకా సుదృడం చేసి ఉంటే బాగుండేది. కార్యకర్తల్లో నిస్తేజం ఉండేది కాదు అనే మాట నిక్కచ్చిగా చెప్పారు’ అన్నారు.
‘అవతలివాళ్లు చెప్పిన అబద్ధాలు.. ఇంటికో ఉద్యోగం ఇస్తామని మేం అన్నట్లు.. అనని మాటను అన్నట్లు ప్రచారాన్ని సరైన సమయంలో ఖండించలేదు. భారతదేశంలో అత్యధికంగా ప్రభుత్వ నియామకాలు చేసి కూడా సమర్థవంతంగా చెప్పుకోలేకపోయాం. సోషల్ మీడియాలో కూడా ఇంకా బాగా చెప్పాల్సింది. దుష్ప్రచారంతో ఎంత ఓట్లు దూరమయ్యాయి. భారతదేశంలో అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చి.. వారిలో రిజిస్టర్ చేయడంలో చిన్నచిన్న లోటుపాట్లు ఉంటే వాటిని సరిగా అడ్రస్ చేయలేదని.. ఇతర, పార్టీ సంస్థాగత విషయాలపై చెప్పారు. గతంలో అభివృద్ధి జరిగింది అనే విషయంలో ఎలాంటి రెండో అభిప్రాయం ప్రజల్లో లేదు. పార్టీ కార్యకర్తల్లో లేదు. చిన్న చిన్న లోపాలు సవరించుకుంటే బాగుండేదోమో అనే మాట చెప్పారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా లేరని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్, బీజేపీకి ఓట్లేసిన ప్రజలు తాము ఇలా జరుగుతుందని అనుకోలేదని.. లోకల్ అభ్యర్థి మీద వ్యతిరేకతతో ఓటేశాం కానీ.. కేసీఆర్ ముఖ్యమంత్రిగా లేరనే మాటనే జీర్ణించుకోలేకపోతున్నారనే మాటను నేతలు చెప్పారు’ అని కేటీఆర్ అన్నారు.