హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలపై ఇతర రాష్ర్టాల్లోనూ అవగాహన పెంచేందుకు దక్షిణ భారత రైతు సంఘాల సమాఖ్య వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఆదివారం తమిళనాడులోని నమకల్ జిల్లా కేంద్రంలో కేసీఆర్ జాబ్‌మేళాను నిర్వహించింది. తమిళ రైతు సంఘం అధ్యక్షుడు దైవశిగామని, వ్యవసాయ మున్నేట్ర కళగం అధ్యక్షుడు బాలసుబ్రహ్మణ్యం సహకారంతో నిర్వహించిన కార్యక్రమానికి దక్షిణ భారత రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షుడు కోటపాటి నరసింహంనాయుడు హాజరై మాట్లాడారు.
జాబ్‌మేళాకు 1,000 మందికిపైగా నిరుద్యోగులు హాజరు కాగా సుమారు 800 మందికి ఉద్యోగావకాశాలు కల్పించినట్టు తెలిపారు. మేళాలో ఆదిత్య బిర్లా, ఎయిర్టెల్, రిలయన్స్, జియోమార్ట్ వంటి 42 పెద్ద కంపెనీలు పాల్గొన్నాయని వివరించారు. తమిళనాడు వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ కేసీఆర్ జాబ్‌మేళాలు కొనసాగుతాయని తెలిపారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ప్రచారం చేయడంతోపాటు,వాటి అమలుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు జాబ్ మేళాలను నిర్వహిస్తామని పేర్కొన్నారు.