ఐదు దశాబ్దాల క్రితం.. రగల్‌జెండా నీడలో లక్షలాది రైతుకూలీల జైత్రయాత్రతో జంగ్ నడిపింది జగిత్యాల. అరుణారుణ అరణ్య భారతానికి దిక్సూచిగా నిలిచింది. పాతికేండ్ల క్రితం.. తెలంగాణ ఇగ రాదనుకొని నిస్పృహ మేఘం కమ్మినప్పుడు, సింహగర్జన సభతో పర్జన్యశంఖం పూరించింది కరీంనగర్ గడ్డ. గల్లీ నుంచి ఢిల్లీదాకా కాంగ్రెస్ కుట్రలపై కత్తిమొనై మెరిసింది. ఉద్యమమైనా, ఉపఎన్నికైనా ‘దేఖ్లేంగే’ అని బరిగీసి కొట్లాడింది. ఎన్నిక ఏదైనా గుండెను చీల్చి, ప్రజాకాంక్షను పట్టి చూపించింది. ఆత్మగౌరవ పతాకను ఆకాశమంత ఎత్తున నిలిపింది. ఇప్పుడు అదే ఆత్మగౌరవం కోసం మరోసారి తొడగొడుతున్నది జగిత్యాల. కాంగ్రెస్ దుష్టపాలనకు చరమగీతం పాడేందుకు దగాపడిన జనమంతా దండు కడ్తున్నరు. ‘అధికార’ అణచివేతలను దాటుకొని, రాజకీయ రణగర్జనకు రంగం సిద్ధమైంది. నేడు జగిత్యాలలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ. కేసీఆర్ రాక కోసం, మాట కోసం ఎదురుచూస్తున్నది తెలంగాణ.
కరీంనగర్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ జగిత్యాల: జగిత్యాల గడ్డపై బీఆర్ఎస్ పార్టీ సోమవారం సమరశంఖం పూరించబోతున్నది. కాంగ్రెస్ పాలనపై మరో పోరుకు సిద్ధమవుతున్నది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించేందుకు పార్టీ అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే జగిత్యాల గులాబీ మయమైంది. సభకు వచ్చిన వారికి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు పార్టీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఈ సభా వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏమి మాట్లాడుతారన్న ఆసక్తి ప్రజల్లో నెలకొన్నది. గత సంవత్సరం ఏప్రిల్ 27న వరంగల్‌లో బీఆర్ఎస్ రజతోత్సవ ప్లీనరీ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్.. తదుపరి రాజకీయ పరంగా నిర్వహిస్తున్న సభలో సోమవారం పాల్గొంటున్నారు. దీంతో కేసీఆర్ ఇచ్చే దిశానిర్దేశం కోసం పార్టీ శ్రేణులు వేచి చూస్తున్నాయి. ఆయన చేయబోయే ప్రసంగంపై అన్ని వర్గాల్లో ఉత్కంఠ నెలకొన్నది.

ఎన్నో విప్లవాత్మక ఉద్యమాలకు వేదికైన జగిత్యాల గడ్డ నుంచి మరో నినాదం మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనుసరిస్తున్న తీరు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను సహించలేక సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ఇటీవల ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. సోమవారం బీఆర్ఎస్లో చేరుతున్నారు. ఈ సందర్భంగా ఆయన ఇప్పటికే ‘కేసీఆర్ రావాలి.. రేవంత్‌రెడ్డి పోవాలి’ అనే నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఇప్పుడదే నినాదం ఊరూవాడల్లో మార్మోగుతున్నది. పల్లేపట్నం అన్న తేడా లేకుండా సభ కోసం తరలివచ్చేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకుంటున్న సమావేశాల్లో ఇదే నినాదం అందరి నోట వినిపిస్తున్నది. లెక్కకు మించిన హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ వైఫల్యాలపై సమరశంఖం పూరించడానికి జగిత్యాల సభ ఒక వేదిక అవుతుందని చెప్తున్నారు.
జగిత్యాలలో సోమవారం సాయంత్రం జరిగే ప్రజా ఆశీర్వాద సభకు బీఆర్ఎస్ భారీ ఏర్పాట్లు చేసింది. సభ నిర్వహణ, జన సమీకరణ వంటి అంశాలను నియోజకవర్గాల్లో పర్యవేక్షించడానికి ఎక్కడికక్కడ ఇన్చార్జులను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించారు. మరోవైపు వేదిక వద్ద ఏర్పాట్లు, సభా స్థలి వద్ద ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు పలువురు నాయకులకు బాధ్యతలు అప్పగించారు. జగిత్యాల సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొన్న బీఆర్ఎస్ నాయకులు వారం రోజులుగా శ్రమిస్తూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పది ఎకరాల విస్తీర్ణంలో షామియానాలు, సభా ప్రాంగణంలో కుర్చీలు ఏర్పాటు చేశారు.
సభ జరిగే మినీ స్టేడియంలో అతి పెద్ద వేదిక ఏర్పాటు చేశారు. మినీ స్టేడియం ప్రహరీకి ఐదువైపులా దారులను ఏర్పాటు చేశారు. ఒక దారిని వీఐపీలు, మరోదారిని మీడియా, మిగిలిన మూడు దారులను కార్యకర్తలు, ప్రజల కోసం కేటాయించారు. సభికులకు పంపిణీ చేసేందుకు మూడు లక్షల మంచినీటి ప్యాకెట్లు, రెండు లక్షల మజ్జిగ ప్యాకెట్లు సిద్ధం చేశారు. పట్టణంలోని వివిధ రోడ్లపై భారీ స్థాయిలో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చేవారి కోసం ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు.
ఆదివారం సాయంత్రానికే జగిత్యాల పూర్తిగా గులాబీ మయమైంది. కరీంనగర్ రోడ్డులో ధరూర్ గ్రామం నుంచి మినీస్టేడియం వరకు ఐదు కిలోమీటర్ల దారిపొడవున అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తిమ్మాపూర్ చౌరస్తా నుంచి మినీస్టేడియం వరకు, ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కాలేజీ నుంచి మినీస్టేడియం వరకు, డి మార్ట్ నుంచి మినీస్టేడియం వరకు ఆరు కిలోమీటర్ల పొడవున అభిమానుల ఫ్లెక్సీలు అడుగడుగున ఏర్పాటు చేశారు.
జగిత్యాల జిల్లాలో మొదటి నుంచి తెలంగాణ ఉద్యమం బలంగానే ఉన్నది. జగిత్యాలలో కేసీఆర్ బహిరంగ సభలు నిర్వహించిన పలు సందర్భాల్లో విప్లవాత్మకమైన మార్పులు, ఫలితాలు నమోదు కావడం గమనార్హం. 2001లో పార్టీ ఆవిర్భావం అనంతరం కేసీఆర్ జగిత్యాల మినీ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. కేసీఆర్‌తోపాటు పలువురు ఉద్యమకారులు ఈ తొలి బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆనాడు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఈ సభ ఉమ్మడి జిల్లాలో గొప్ప ప్రభావాన్ని చూపించింది. తొలి ప్రయత్నంలోనే బీఆర్ఎస్ పార్టీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించింది. ఆనాడు మెట్పల్లి జడ్పీటీసీ సభ్యుడిగా పోటీ చేసిన కేవీ రాజేశ్వర్‌రావు జిల్లా పరిషత్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.
అటు తర్వాత 2003లో జరిగిన గోదావరి పుష్కరాల సందర్భంలో ధర్మపురిలో కేసీఆర్ సభ ఏర్పాటు చేశారు. గోదావరి పుష్కరాలు పవిత్ర ధర్మపురిలోనూ జరుగుతాయని, సీమాంధ్ర నాయకులు ఈ విషయాన్ని దాచిపెడుతున్నారని నాడు ఆయన చేసిన సింహగర్జన ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాన్ని భయపెట్టింది. విధి లేని పరిస్థితుల్లో అప్పటి సీఎం చంద్రబాబు తొలిసారిగా ధర్మపురికి వచ్చి పుష్కర స్నానం చేయడంతోపాటు పుష్కరాలకు మొదటిసారి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారు. కేసీఆర్ బహిరంగ సభ తెలంగాణ సాంస్కృతిక ఉద్యమానికి, ఆధ్యాత్మిక గొప్పదానికి ప్రతీకగా నిలిచిపోయింది.
2004 ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తు పెట్టుకొన్నాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్ ఎంపీగా కేసీఆర్, జగిత్యాల ఎమ్మెల్యేగా జీవన్‌రెడ్డి పోటీ చేశారు. నామినేషన్ల సందర్భంగా జగిత్యాలలో భారీ బహిరంగ సభ ఏర్పాటుచేశారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ లక్షన్నర ఓట్లు, జీవన్‌రెడ్డి 8వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2006లో తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రతిష్టంభన ఏర్పడటంతో కేసీఆర్ కేంద్ర మంత్రి పదవికి, ఎంపీ పదవికి రాజీనామా చేసి, కరీంనగర్ ఉపఎన్నికకు వెళ్లారు. ఆ సమయంలో కేసీఆర్ వెంట ఉద్యమ సంఘాలన్నీ కదిలిన విషయం తెలిసిందే.
గద్దర్, రసమయి నేతృత్వంలోని ధూంధాం కళాకారులు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జగిత్యాల మినీస్టేడియంలో సభ పెడుతామని ప్రకటించగా, గద్దర్‌ను హతమారుస్తామంటూ బ్లాక్ టైగర్స్ పేరిట హెచ్చరికలు వెలువడ్డాయి. దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ పార్టీ గద్దర్, రసమయి నేతృత్వంలో జగిత్యాల మినీస్టేడియంలో భారీ ధూంధాం కార్యక్రమాన్ని నిర్వహించింది. సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు జరిగిన సభ తెలంగాణ దశాదిశను మార్చివేసింది. ఈ సభ జరిగిన కొద్ది రోజులకే కేసీఆర్ అదే మినీస్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించి రికార్డు సృష్టించారు. ఇలా జగిత్యాలలో కేసీఆర్ ఎప్పుడు బహిరంగ సభలు నిర్వహించినా విపరీత ప్రజాదరణకు సంచలనాలకు కారణమవుతూ వచ్చాయి.

ప్రస్తుతం అందిరి చూపు కేసీఆర్‌పైనే ఉన్నది. జీవన్‌రెడ్డి ఇదే సభా వేదిక మీద కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ సభనుద్దేశించి ఏమి మాట్లాడుతారన్నదానిపై విస్తృత చర్చలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కటీ పూర్తిస్థాయిలో నెరవేర్చలేదన్న అసంతృప్తి ప్రజల్లో వ్యక్తమవుతున్నది.
రాష్ట్రంలో అనేక సమస్యలు ఏకరువు పెడుతున్నాయి. ప్రధానంగా ఎరువుల కొరత అన్నదాతలను పట్టిపీడిస్తున్నది. రైతుభరోసా విషయంలో మాట తప్పింది. ఉద్యోగాల భర్తీ, నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్లు లేకపోవడంతో నిరుద్యోగుల్లో అసంతృప్తి పెరుగుతున్నది. పెన్షన్ల పెంపు లేకుండా పోయింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లు నిర్వీర్యమయ్యాయి. ఒక్కపైసా కేటాయింపులు లేకపోవడంతో బడుగు, బలహీవర్గాల సంక్షేమ పథకాలు అటకెక్కుతున్నాయి. ఉద్యోగులకు పీఆర్సీ ఊసే లేదు. తులం బంగారం కట్టు కథలుగా మారిపోయింది. మళ్లీ కరెంటు కోతలు, నీటికష్టాలు మొదలయ్యాయి.. ఒక్క మాటలో చెప్పాలంటే మళ్లీ సమైక్య రాష్ట్ర కష్టాలే కండ్ల ముందు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటన్నింటిపై కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉన్నదని పార్టీవర్గాలు చెప్తున్నాయి.
కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తరువాత పార్టీ ప్లీనరీ సమావేశంలో తప్ప బయట ఎక్కడా భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొనలేదు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి హామీలు నెరవేర్చేందుకు కేసీఆర్ తగిన సమయం ఇచ్చారు. నిరుడు ఏప్రిల్ 27న వరంగల్‌లో బీఆర్ఎస్ రజతోత్సవ ప్లీనరీలో మాత్రమే కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొన్నారు. అయితే రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనపై రైతుల నుంచి మొదలుకొని అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నది. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ ఏమి మాట్లాడుతారన్నదానిపై ఉత్కంఠ నెలకొన్నది.