KTR | బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎంతో ముందు చూపుతో అంబేద్కర్ గారు పెట్టిన ఆ ఆర్టికల్ కారణంగానే తెలంగాణ కల సాకారమైందని తెలిపారు. బోధించు, సమీకరించు, పోరాడు, అన్న బాబాసాహెబ్ బాటలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ ఉద్యమించారని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేటలో నిర్వహించిన ఆత్మగౌరవ గర్జన సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
లక్షలాది మందిని సమీకరించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని వాళ్లకు బోధించి, ఎత్తిన జెండా దించకుండా 14 ఏళ్ల పాటు కేసీఆర్ కొట్లాడితే బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ఆధారంగా తెలంగాణ వచ్చిందని కేటీఆర్ తెలిపారు. ఆ మహనీయున్ని గౌరవించుకోవడానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా 125 అడుగుల విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున ప్రతిష్టించుకున్నామని.జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సమున్నతంగా గౌరవించుకున్నామని తెలిపారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును సెక్రటేరియట్ కు పెట్టిన ఒకే ఒక ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ ఒక్కరే అని కొనియాడారు. అంబేద్కర్ను అంత గొప్పగా గౌరవించుకున్న ముఖ్యమంత్రి దేశంలో ఇంకెవరూ లేరని అన్నారు.
దళితుల జీవితాల్లో అద్భుతమైన మార్పు తీసుకురావాలన్న లక్ష్యంతో లక్షలాది దళితులకు మేలు చేయాలన్న సంకల్పంతో దళిత బంధు పథకాన్ని కేసీఆర్ తీసుకొచ్చారని కేటీఆర్ తెలిపారు. దళిత బంధు పేరుమీద కేసీఆర్ రూ.10 లక్షల మాత్రమే ఇస్తున్నారని.. తాము అధికారంలోకి వస్తే రూ.12 లక్షలు ఇస్తామని చేవెళ్లలో ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ను రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలు ప్రకటించారని గుర్తుచేశారు. అన్ని ప్రభుత్వ పనుల్లో 26% శాతం ఎస్సీ, ఎస్టీలకు ఇస్తామన్నారని.. దళిత, గిరిజనులు ఇండ్లు నిర్మించుకుంటే ఆరు లక్షలు ఇస్తామని ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ లో చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చాక ఆరు పైసలు కూడా ఇవ్వని సిగ్గులేని ప్రభుత్వం రేవంత్ రెడ్డిది అని విమర్శించారు.
ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో
ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో అని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో అన్ని వర్గాల ప్రజలు దారుణంగా మోసపోయారని అన్నారు. రెండుసార్లు రైతుబంధును ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయన్న కారణంగా మొన్న రైతుబంధు వేశాడని అన్నారు. అరకొరగా రైతుబంధు వేసి సంబరాలు చేసుకోమంటున్న దిక్కుమాలిన ప్రభుత్వం ఇది అని విమర్శించారు. కేసీఆర్ రైతులకు రూ.10,000 ఇస్తే తాము రూ.15000 ఇస్తామన్నారని.. ముసలి వాళ్లకు ఇస్తున్న 2 వేల పెన్షన్ ను రూ.4000 చేస్తామన్నారని గుర్తుచేశారు. కేసీఆర్ ఇంట్లో ఒకరికి మాత్రమే పెన్షన్ ఇస్తున్నాడు తాము అధికారంలోకి వస్తే ఇద్దరికీ ఇస్తామన్నారన్నారు. అత్తకు 4,000, కోడలు 20,000 ఇస్తామన్నారు. కాని అధికారంలో వచ్చాక ఈ హామీల్లో ఒక్కదాన్ని కూడా అమలుచేయడం లేదని విమర్శించారు. రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు.. 50 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేయాల్సి ఉంటే దాన్ని చివరకు రూ.12 వేల కోట్లకు కుదించి అది కూడా సగమే చేశారని అన్నారు. ఆడబిడ్డలకు తులం బంగారం, నెలకు 2,500 రూపాయలు ఇవ్వడం లేదు. వడ్లకు బోనస్ ఇస్తామని అన్ని బోగస్ మాటలు చెప్పారని మండిపడ్డారు.
మంది పిల్లలను నా పిల్లలు అని చెప్పుకుంటున్నారు
రేవంత్ రెడ్డి అపరిచితుడు సినిమాలో రాము, రెమో లాగా ప్రవర్తిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ ప్రభుత్వ అరాచకాలు, దారుణాల నుంచి తెలంగాణ ప్రజలను రక్షించేది ఒక్క కేసీఆర్ నాయకత్వమే అని తెలిపారు. కేసీఆర్, కేటీఆర్ ఇద్దరి ఉద్యోగాలు ఊడగొడితే మొదటి సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. కానీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు.. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పూర్తైన నియామకాలకు సిగ్గు లేకుండా ఆఫర్ లెటర్లు ఇస్తూ తామే ఇచ్చామని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నాడు. మంది పిల్లల్ని నా పిల్లలని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు.
ప్రభుత్వాన్ని నడిపే వారికే.. ఆదాయం తెచ్చే దమ్ము ఉంటుంది
కేసీఆర్ అప్పులపాలు చేశారని కాంగ్రెస్ వాళ్లు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. కరోనా లాంటి కష్టకాలంలో కూడా కేసీఆర్ గారు ఆపకుండా రైతుబంధు, కేసీఆర్ కిట్లు, పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, గురుకులాల్లో సన్న బియ్యం పెట్టారని గుర్తుచేశారు. ప్రభుత్వాన్ని నడిపే దమ్ము ఉన్నవారికే ఆదాయాన్ని తెచ్చే సత్తా ఉంటుంది. సంపద పెంచి పేదలకు పంచే తెలివి ఉంటుందని అన్నారు. రాహుల్ గాంధీ ఖాతాలో మాత్రమే టకీ టకీమని డబ్బులు పడుతున్నాయని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఓటే తూటా. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటి బీఆర్ఎస్ ను గెలిపించుకుంటేనే అహంకారంతో విర్రవీగుతున్న రేవంత్ రెడ్డి, ఆయన తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులకు బుద్ది వస్తుందని అన్నారు.
తెలంగాణను బాగుచేసుకోవాలంటే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవ్వాల్సిందే
గురుకులాల్లో పిల్లలకు విషం పెడుతున్నారని.. రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇప్పటికే వంద మంది పిల్లలు బలి అయ్యారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. వేములవాడకు వచ్చిన రేవంత్ రెడ్డి తిన్న భోజనం ఖరీదు ఒక ప్లేటుకు లక్ష 35 వేల రూపాయలు. అందాల పోటీల్లో ఒక్క ప్లేట్ భోజనానికి లక్ష రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వానికి కనీసం వంద రూపాయలతో గురుకులాల పిల్లలకు మంచి భోజనం పెట్టాలన్న సోయి లేదని మండిపడ్డారు. కేసీఆర్ నాయకత్వంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో తెలంగాణ గురుకులాలు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అద్భుతంగా పనిచేశాయని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో తెర్లు అయిన తెలంగాణలో మళ్లీ బాగు చేసుకోవాలంటే కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాల్సిందే అని వ్యాఖ్యానించారు.