కూసుమంచి, జూలై 21 : సమైక్య పాలనలో ఒక్క పంటకే సాగునీరు అందక పంటలు ఎండి పోయేవి. అలాంటి పరిస్థితి నుంచి స్వరాష్ట్రంలో రెండు పంటలకు పుష్కలంగా సాగునీటిని అందించే విధంగా వ్యవసాయ రంగంపై విజన్ కలిగిన ఏకైక సీఎం కేసీఆర్ అని రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు.
గురువారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు జలాశయం నుంచి స్థానిక ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డితో కలిసి ఆయకట్టు రైతులకు సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత సకాలంలో వర్షాలు పడి పంటలు పడుతున్నాయని అన్నారు.
నాటి పాలకుల హయాంలో సాగర్‌కు నీరు రావాలంటే ఎగువన అన్ని ప్రాజక్టులు నిండి ఆంధ్రాకు నీరు వదిలిన తరువాత తెలంగాణాకు నీరు విడదల చేసేవారన్నారు. ఖమ్మం జిల్లాలో 2.5 లక్షల ఎకరాలకు సాగర్ జలాలు అందిస్తామని, రైతులు నీటిని వృథా చేయకుండా పంటలకు వినియోగించుకోవాలన్నారు.
ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా ఉన్నందున నెల రోజులు ముందుగానే నీటిని విడుదల చేస్తున్నామన్నారు. అధికారులు రైతులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్యెల్యే ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, సీఈ శకంర్ నాయక్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, జిల్లా రైతుబంధు సమితి కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.