హైదరాబాద్/ఆదిలాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పశ్చిమ ప్రాంతం… అందులోనూ అత్యంత వెనకబడిన బేల, జైనాథ్, ఆదిలాబాద్, తాంసీ, భీంపూర్ మండలాలు… ఎటుచూసినా బంగారు పంటలు పండించగలిగిన నల్లరేగడి భూములు… చుట్టూ గుట్టలు… బోరువేద్దామన్నా, బావి తవ్వుదామన్నా అడ్డంకిగా రాతిపొరలు… ఎవుసానికి ప్రధాన ఆధారం వర్షాధారం… కేవలం 5 టీఎంసీలు అందిస్తే, దాదాపు 50వేల ఎకరాలకు సాగునీరు పారించుకుని జీవితాన్ని గడపాలనేది అక్కడి రైతుల ఆకాంక్ష. ఆ ఆశలతోనే ఉమ్మడి పాలకులు దశాబ్దాలుగా ఆడుకున్నారు. లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టు పేరిట ఓట్లు దండుకున్నారు. స్వరాష్ట్రం ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రిగా కేసీఆర్ పెన్‌గంగపై ప్రతిపాదించిన పెండింగ్ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించారు. పెన్‌గంగపై గతంలో ప్రతిపాదించిన అన్ని ప్రాజెక్టులకు సంబంధించి మహారాష్ట్రతో మరోసారి సమగ్రమైన ఒప్పందం చేసుకున్నారు. లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టు పూర్తయ్యేవరకూ చనాక-కొరాట బరాజ్ నుంచి నీటిని వినియోగించుకునేందుకు మహారాష్ట్రను ఒప్పించారు. అక్కడితో ఆగకుండా ఒప్పందంలో భాగంగా నిర్మించాల్సిన చనాక-కొరాట బరాజ్ నిర్మాణానికి రూ.368 కోట్లు, లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టు పనులకు సంబంధించి రూ.1,227 కోట్లతో పరిపాలన అనుమతులు మంజూరు చేశారు. ఉమ్మడి పాలకులు నాలుగు దశాబ్దాలుగా పూర్తిచేయలేని కలను కేసీఆర్ సాకారం చేశారు.
చనాక-కొరాటతో పెన్‌గంగ ఆయకట్టుకూ మోక్షం
మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. గోదావరి సబ్‌బేసిన్ జీ-7లో పెన్‌గంగ నదిపై మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా ఘటాంజీ తాలుకాలోని తడనవాలి గ్రామం వద్ద 42.67 టీఎంసీల సామర్థ్యంతో లోయర్ పెన్‌గంగ డ్యామ్ నిర్మాణం చేపట్టాలి. దానినుంచి వచ్చే కుడికాలువ ద్వారా మహారాష్ట్ర నీటిని వినియోగించుకోవాలి. మొత్తంగా 89 కిలోమీటర్ల పొడవు ఉంటే ఎడమ కాలువ ద్వారా తెలంగాణ ప్రాంతంలో 47,520 ఎకరాలకు సాగునీరించాలి. దశాబ్దాలుగా ఈ ప్రాజెక్టు ముందుకు సాగడంలేదు. డ్యామ్ నిర్మాణం పూర్తికావడం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే కేసీఆర్.. తాత్కాలికంగా ఎల్‌పీపీ కింద ఉన్న ఆయకట్టుకు సైతం చనాక- కొరాట బరాజ్ (సీకేబీ) ద్వారా సాగునీటిని అందించేందుకు ప్రణాళికలు రూపొందించారు.
సీకేబీ ఆయకట్టుకు, ఎల్‌పీపీ ఆయకట్టు కోసం వేర్వేరుగా హత్తీఘాట్ వద్ద పంప్‌హౌస్‌లో మోటర్లు ఏర్పాటుచేశారు. పంప్‌హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసి ఎల్‌పీపీ కెనాల్లో పోయనున్నారు. తొలిదశలో 5.5 మెగావాట్ల పంపులతో నీటిని తోడి 44 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోయర్ పెన్‌గంగ కెనాల్లో 44వ కిలోమీటర్ పాయింట్ వద్ద పోయనున్నారు. అక్కడినుంచి దిగువన 89వ కిలోమీటర్ వరకు ఉన్న 37,520 ఎకరాల ఆయకట్టుకు నీరందించనున్నారు. అందుకోసం పిప్పల్‌కోట్ వద్ద రిజర్వాయర్ నిర్మించారు. రెండో దశలో గోమూత్రి వద్ద రిజర్వాయర్‌ను నిర్మించి కెనాల్లో 44-0 కిలోమీటర్ వరకు ఉన్న 10వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని ప్రణాళికలు రూపొందించడంతోపాటు పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు. పనులు సైతం ప్రారంభించారు. దీంతో మొత్తంగా లోయర్ పెన్‌గంగ డ్యాం పూర్తయ్యేంతవరకు దాని కింద ఉన్న మొత్తం 47,520 ఎకరాలకు సీకేబీ ద్వారా సాగునీరందించేలా ప్రణాళికలు సిద్ధంచేశారు. 12 మెగావాట్ల మోటర్లతో నీటిని 115 మీటర్లకు ఎత్తి సీకేబీ కాలువలో ఎత్తిపోయనున్నారు. 19 కిలోమీటర్ల మేర ఉన్న ఈ కాలువల కింద మొత్తంగా 13,500 ఎకరాలకు సాగునీరందించనున్నారు. మొత్తంగా సీకేబీ ద్వారా 61,020 ఎకరాలకు నీరందించడంతోపాటు బేల, జైనాథ్, ఆదిలాబాద్, తాంసీ మండలాల పరిధిలోని 38 గ్రామాలకు తాగునీరందించేలా కూడా నాడు కేసీఆర్ ప్రణాళికలు రూపొందించారు.
నిధుల సద్వినియోగం
ఉమ్మడి ప్రభుత్వం లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టు, కాలువ నిర్మాణానికి సంబంధించి సర్వేల కోసం రూ.62 లక్షలకుపైగా ఖర్చుచేసింది. కేసీఆర్ రూపొందించిన ప్రణాళికతో ఆ నిధులన్నీ సద్వినియోగమయ్యాయి. మరోవైపు, దుమ్ముగూడెం టెయిల్‌పాండ్ కోసం ఉమ్మడి ప్రభుత్వం దాదాపు రూ.100 కోట్లకుపైగా నిధులు వెచ్చించి బ్రెజిల్ నుంచి మోటర్లను 2006లో దిగుమతి చేసుకున్నది. అయితే, ఆ మోటర్లు నిరుపయోగంగా పడిఉన్నాయి. ఇది గమనించిన కేసీఆర్.. ఆ మోటర్లనే లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టులో అమర్చారు. ఆ విధంగానూ కేసీఆర్ ప్రభుత్వం నిధులు మిగిల్చింది. సద్వినియోగం చేసింది.
అనుమతుల సాధనకూ అవిశ్రాంత కృషి
చనాక-కొరాట ప్రాజెక్టు పూర్తి చేయడమేకాదు అనుమతుల సాధనకూ కేసీఆర్ ప్రభుత్వం ఆవిశ్రాంతంగా కృషి చేసింది. ప్రాజెక్టు డీపీఆర్‌లను 2022 సెప్టెంబర్‌లో కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ)కు సమర్పించింది. సీడబ్ల్యూసీ నుంచి అదే ఏడాది నవంబర్‌లో కీలకమైన టీఏసీని సాధించింది. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నుంచి పర్యావరణ అనుమతులు సాధించడం పెద్ద సవాల్‌గా నిలిచింది. సీకేబీ తెలంగాణ, మహారాష్ట్ర ఉమ్మడి ప్రాజెక్టు కావడంతో ఉమ్మడిగానే పర్యావరణ అనుమతులు తీసుకోవాలని కేంద్రం షరతులు విధించింది. ఒప్పందంలో భాగంగా పర్యావరణ అనుమతులకు సంబంధించి అన్ని ప్రక్రియలు పూర్తిచేయడంతోపాటు, తెలంగాణ ప్రభుత్వం బరాజ్ నిర్మాణం సైతం అప్పటికే పూర్తిచేసింది. కానీ, మహారాష్ట్ర మాత్రం ఒప్పందంలో భాగంగా తన పోర్షన్‌కు సంబంధించిన పనులకు ఇప్పటికీ కనీసం పరిపాలనా అనుమతులు కూడా మంజూరు చేయలేదు.
అదీగాక 0.5 హెక్టార్ల అటవీ భూమికి అనుమతులు కూడా తీసుకోవడం లేదు. దీంతో ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు పొందడానికి అడ్డంకిగా మారింది. దీంతో అప్పటి సీఎం కేసీఆర్ మార్గదర్శకాల మేరకు ఇంజినీర్లు మహారాష్ట్రతో సంబంధం లేకుండా తాము చేపట్టిన 80% పనులకు పర్యావరణ అనుమతులు మంజూరుచేయాలని కేంద్రానికి విన్నవిస్తూ వచ్చారు. గతంలోనూ తెలంగాణ, మహారాష్ట్ర చేపట్టిన ఉమ్మడి ప్రాజెక్టులకు వేర్వేరుగా పర్యావరణ అనుమతులు మంజూరు చేసిన సందర్భాలు ఉన్నాయని, అందుకు లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టే నిదర్శనమని సోదాహరణంగా వినిపించారు. తెలంగాణ వాదనలతో ఏకీభవించిన కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వశాఖ సైతం పర్యావరణ అనుమతులు మంజూరు చేయడం నాటి కేసీఆర్ సర్కార్ చేసిన కృషికి నిదర్శనం.
రెండేండ్లుగా కాలయాపన
సీకేబీకి సంబంధించిన ప్రధాన నీటి పంపిణీ వ్యవస్థ పనులన్నీ కేసీఆర్ సర్కార్ హయాంలోనే పూర్తయ్యాయి. బరాజ్ నిర్మాణం, గేట్ల నిర్మాణం పూర్తయ్యింది. సైడ్‌వాల్స్ నిర్మాణ పనులు సైతం పూర్తయ్యాయి. హత్తీఘాట్ వద్ద పంప్‌హౌస్ నిర్మాణ పనులు కూడా పూర్తయ్యాయి. ఇప్పటికే మొత్తంగా మూడు 5.5 మెగావాట్ల మోటర్లు, మూడు 12 మెగావాట్ల మోటర్లు ఏర్పాటుచేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే 2023 సెప్టెంబర్ 28న హత్తిఘాట్ పంప్‌హౌస్‌లోని మోటర్లను ఆన్‌చేసిన అధికారులు విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించారు. కేసీఆర్ ప్రభుత్వమే కాలువల నిర్మాణ పనులు సైతం ప్రారంభించింది. అయితే, కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీకేబీ పనులను పూర్తిగా పక్కనపెట్టింది. సీకేబీ ద్వారా ఆయకట్టుకు నీరివ్వాలంటే 650 ఎకరాలు సేకరించాల్సి ఉన్నది. అదేవిధంగా ఆర్‌అండ్‌ఆర్‌కు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తంగా రూ.188 కోట్లకు అంచనాలను సవరించి అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు. కానీ, రేవంత్ సర్కార్ మాత్రం ఆమోదించకుండా రెండేండ్లుగా పెండింగ్‌లో పెట్టింది. వెరసి ఆయకట్టు కాల్వల పనులు ముందుకుసాగడం లేదు. నిధులివ్వని రేవంత్ సర్కార్ తాజాగా ప్రాజెక్టును ప్రారంభించి హడావుడి చేయడం విశేషం.
ఒప్పందం 1: తేదీ: 1978, ఆగస్టు 7
అంశం: పెనుగంగ నదిలో లభ్యమయ్యే మొత్తం నీటిలో 80.31 టీఎంసీలను మినహాయించగా, దిగువకు వచ్చే 42.67 టీఎంసీలను ఉమ్మడిగా వినియోగించుకునేందుకు మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు తొలిసారిగా అంగీకారానికి వచ్చాయి. ఈ మేరకు ఒప్పందం చేసుకున్నాయి.
ఫలితం: అటు తరువాత ఇరు రాష్ర్టాలు చొరవ చూపకపోవడంతో ప్రాజెక్టు అటకెక్కింది.
ఒప్పందం 2: తేదీ: 1998, డిసెంబర్ 10. మహారాష్ట్రలో..
అంశం: పెన్‌గంగ నదిపై యవత్మాల్ జిల్లా ఘటాంజీ తాలుకా వద్ద తడనవాలీ గ్రామం వద్ద 42.66 టీఎంసీల సామర్థ్యంతో ఉమ్మడిగా డ్యామ్ నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు. 88ః12 నిష్పత్తిలో అంటే మహారాష్ట్ర 37.55 టీఎంసీలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 5.12 టీఎంసీల జలాలను వినియోగించుకోవడంతోపాటు ఖర్చు భరించేందుకు మరోసారి ఇరు రాష్ర్టాల మధ్య ఒప్పందం కుదిరింది.
ఫలితం: శూన్యం. కాగితాలకే పరిమితమైంది. కానీ, సర్వేల కోసం రూ.62 లక్షల నిధులు ఖర్చుచేశారు.
ఒప్పందం 3: తేదీ: 2012, డిసెంబర్ 1
అంశం: లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టు ముందుకుసాగని నేపథ్యంలో దానికి దిగువన మొత్తంగా 3.70 టీఎంసీల సామర్థ్యంతో మూడు బరాజ్‌లను నిర్మించాలని మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు మరో ఒప్పందం చేసుకున్నాయి.
ఫలితం: తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకూ ఆ ఒప్పందం కార్యరూపం దాల్చలేదు.
ఒప్పందం-4: తేదీః 2016, మార్చి 8(తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత)
అంశం: పెన్‌గంగపై గతంలో ప్రతిపాదించిన అన్ని లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టులతోపాటు దాని దిగువన నాలుగు బరాజ్‌ల నిర్మాణానికి మహారాష్ట్రతో కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నది. దీని ప్రకారం మూడు బరాజ్‌లను మహారాష్ట్ర, ఒక బరాజ్‌ను తెలంగాణ నిర్మించాలి.
ఫలితం: ఒప్పందంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చనాక- కొరాట బరాజ్ నిర్మాణాన్ని పూర్తి చేసింది. ప్రారంభానికి సిద్ధంచేసింది. అంతేకాదు, కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులన్నీ సాధించింది
చనాక- కొరాట ప్రాజెక్టు వివరాలు
నిర్మాణ ప్రదేశం పెన్‌గంగ నదిపై కొరాట వద్ద
మొత్తం ఆయకట్టు