నిజామాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావుకు నిజమైన రాజకీయ వారసుడు సీఎం కేసీఆర్ మాత్రమేనని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అలాంటి గొప్ప లక్షణాలు, సమర్థత కేవలం కేసీఆర్‌కు మాత్రమే ఉన్నాయని తెలిపారు. ఆర్నెళ్లకో ముఖ్యమంత్రి మారుతున్న నేపథ్యంలో ప్రజలకు సుస్థిర పాలన అందించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారని చెప్పారు. ఎన్టీఆర్‌కు వారసుడిగా ప్రజలకు సుస్థిరమైన, సంక్షేమ పాలన సీఎం కేసీఆర్ అందిస్తున్నారని కొనియాడారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని స్పీకర్ పోచారం శనివారం ఆవిష్కరించారు.
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా కమ్మ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు మండవ వెంకటేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులను ఉద్దేశించి స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. ఎలాంటి వ్యక్తులతోనైనా ఎన్టీఆర్ మర్యాదగా, గౌరవంగా మాట్లాడే వారని అన్నారు.
1978లో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం లేక ఇబ్బందులు ఎదురయ్యాయని, ఐదేండ్లలో నలుగురు ముఖ్యమంత్రులను మార్చి రాష్ర్టాన్ని ఆగమాగం చేశారని గుర్తుచేశారు. ఈ పరిస్థితుల్లో తెలుగు జాతిని రక్షించడానికి ఎన్టీఆరే పార్టీని స్థాపించారని తెలిపారు. దేశంలో సంక్షేమ రంగాలకు ఆద్యుడు ఎన్టీఆరేనని పేర్కొన్నారు. ఎన్టీఆర్ మార్గదర్శకంలో నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. 1987లో ఎన్టీఆర్ ఆశీర్వాదంతోనే తాను డీసీసీబీ చైర్మన్ పదవి చేపట్టానని, ఆయన ఆశీస్సులతోనే 1994లో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో బాన్సువాడ నుంచి ఎమ్మెల్యే అయ్యానంటూ వివరించారు. నిరుపేదల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేసిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని ఆయన తనయుడు రామకృష్ణ అన్నారు.