హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): కేంద్రంలో రాబోయేది రైతు ప్రభుత్వమేనని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతిరాథోడ్ విశ్వాసం వ్యక్తంచేశారు. ఆ దిశగా సముజ్వల భారత్ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ బృహత్తర ప్రణాళికలను రూపొందిస్తున్నారని చెప్పారు. కర్ణాటక రాష్ట్రం కలబురిగి (గుల్బర్గా) జిల్లాలో జేడీఎస్ (జనతాదళ్ సెక్యులర్) పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలరాజ్ శివగుత్తేదార్ శనివారం నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్కు జేడీఎస్ పార్టీ మద్దతివ్వడం ఎంతో సంతోషకరమని చెప్పారు. వ్యవసాయం, నదీ జలాలు తదితర రంగాలకు కేసీఆర్ నూతన పాలసీలను రూపొందించారని గుర్తు చేశారు. వచ్చే కర్ణాటక ఎన్నికల్లో ముఖ్యమంత్రితో కలిసి తాము కూడా ప్రచారం చేస్తామని తెలిపారు. కుమారస్వామి కర్ణాటక ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. దేశంలో పరివర్తన కోసమే తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఏర్పాటు చేశారని వివరించారు.
ఎనిమిదేండ్ల స్వల్పకాలంలో దేశమంతా ఆశ్చర్యపోయేలా తెలంగాణలో ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతుబీమా వంటి అనేక పథకాలను అమలుచేస్తున్నామని వెల్లడించారు. కర్ణాటకలో అత్యధికంగా గిరిజనులు, వెనుకబడిన వర్గాలవారు ఉన్నారని, వారి అభివృద్ధికి బీజేపీ చేసిందేమీ లేదని విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతాయని వివరించారు. సంక్షేమాభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్న బీఆర్ఎస్కు మద్దతుగా నిలవాలని కోరారు. సమావేశంలో జేడీఎస్ పార్టీ ముఖ్యనేతలు తదితరులు పాల్గొన్నారు.