హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): మైనారిటీ గురుకుల విద్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందిపై కాంగ్రెస్ సర్కార్ కత్తిగట్టింది. పనిభారం తక్కువగా ఉన్నదనే నెపంతో మైనారిటీ గురుకుల జూనియర్ కాలేజీల్లో డిప్యూటీ వార్డెన్, డాటా ఎంట్రీ ఆపరేటర్ల పోస్టులను రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గత గురువారం మైనారిటీ గురుకుల సొసైటీ సెక్రటరీ షఫీఉల్లా బాబా సర్క్యూలర్ జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఉన్న డిప్యూటీ వార్డెన్లు తమ రెగ్యులర్ విధులతోపాటు డాటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈవో) విధులను సైతం నిర్వర్తించాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టంచేసింది. సాంకేతిక పరిజ్ఞానం ఉన్న డిప్యూటీ వార్డెన్లను కొనసాగిస్తామని, లేదంటే వారి స్థానంలో డీఈవోలకు డిప్యూటీ వార్డెన్ బాధ్యతలు అప్పగిస్తామని తేల్చిచెప్పింది. డిప్యూటీ వార్డెన్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను రద్దుచేస్తూ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం మైనార్టీ గురుకులాల సిబ్బందికి శాపంగా మారింది.
60 మైనారిటీ గురుకుల కాలేజీల్లో పనిచేస్తున్న సుమారు 100 మందికిపైగా ఉద్యోగుల కుటుంబాలు రోడ్డుపై పడనున్నాయి. పనిభారం తక్కువగా ఉన్నదనేది సాకు మాత్రమేనని ఉద్యోగ, మైనారిటీ సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఇంతకాలం అవే ఉద్యోగాలను నమ్ముకొని అరకొర వేతనాలతో పనిచేస్తున్న వారి బతుకులను రోడ్డున పడేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. పనిలేకుంటే ఇంతకాలం విధుల్లో ఎందుకు కొనసాగించారని నిలదీస్తున్నారు. ఉన్నపళంగా విధుల నుంచి తప్పిస్తే వారి కుటుంబాల పరిస్థితి ఏం కావాలని, పిల్లల చదువుల ఖర్చులు ఎవరు భరిస్తారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఆందోళనలకు వెనుకాడబోమని హెచ్చరిస్తున్నారు.
రద్దు దిశగా ప్రభుత్వం అడుగులు
ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పేరిట గురుకులాలను రద్దుచేసే కుట్రలకు సర్కార్ తెరలేపిందని, ఇందులో భాగంగానే మైనారిటీ గురుకులాల సిబ్బంది తొలగింపునకు ఉపక్రమించిందని పలువురు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గురుకుల విద్యాసంస్థలను నిర్లక్ష్యం చేస్తున్నదని మండిపడుతున్నారు. కేసీఆర్ ఏర్పాటు చేశారనే సాకుతో నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తున్నట్టు విమర్శలున్నాయి. కనీస వసతులు కల్పించకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని విద్యారంగ నిపుణులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉద్యోగసంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వంపై కక్షతో గురుకుల విద్యావ్యవస్థపై కత్తిగట్టడం, పేద, మధ్యతరగతి విద్యార్థులను ఇబ్బందులు పెట్టడంపై మండిపడుతున్నారు.
ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి: యాకూబ్‌పాషా
మైనారిటీ గురుకులాల్లో పనిచేస్తున్న డీఈ వో, డిప్యూటీ వార్డెన్లపై వేటు వేయాలని నిర్ణయించడం అన్యాయమని మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాకుబ్‌పాషా పేర్కొన్నారు. గత ప్రభుత్వంపై కక్షతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అర్థమవుతున్నదని తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నదని ఆరోపించారు. ఉద్యోగాలపై ఆధారపడిన సిబ్బందిని తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే సహించబోమని, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిస్తామని హెచ్చరించారు.