హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని రిటైర్ట్ సీపీఎస్ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఇప్పటికే పెన్షన్ కోల్పోయిన వీరు తాజాగా హెల్త్‌కార్డు హక్కునూ కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 9,600 మంది సీపీఎస్ ఉద్యోగులు రిటైర్ అయ్యారు. వీరికి రూ.2-3 వేలలోపే పెన్షన్ వస్తున్నదని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. ఇది ఆసరా పెన్షన్ కంటే తక్కువే. రిటైర్డ్ ఓపీఎస్ ఉద్యోగుల పెన్షన్ నుంచి 1.5% ప్రీమియం కట్‌చేసి హెల్త్కార్డులిస్తున్న ప్రభుత్వం.. సీపీఎస్ ఉద్యోగుల పెన్షన్ నుంచి 1.5% ప్రీమియం కట్‌చేసే పరిస్థితి లేదు. ఫలితంగా వారికి హెల్త్‌కార్డులు జారీ చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అటు పెన్షన్, ఇటు హెల్త్‌కార్డు లేకుండా తీవ్ర వివక్షకు గురవుతున్నామని సీపీఎస్ రిటైర్డ్ ఉద్యోగులు మండిపడుతున్నారు.
ఉద్యోగం ఉన్నంత వరకే..
రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులున్నారు. ప్రస్తుతం వీరంతా వర్కింగ్ ఎంప్లాయిస్ కావడంతో హెల్త్‌కార్డు కోసం వారి మూలవేతనం నుంచి 1.5% కట్ చేస్తున్నారు. భవిష్యత్తులో వీరంతా ఏదో రోజు రిటైర్డ్ కావాల్సిందే. ఆ తర్వాత వచ్చే పించన్ అతి స్వల్పంగా ఉంటుంది. దీంతో ఈహెచ్ఎస్ ప్రీమియం చెల్లించలేని పరిస్థితులుంటాయి. అంటే సీపీఎస్ ఉద్యోగులు ఉద్యోగంలో ఉన్నంత వరకే హెల్త్‌కార్డు వర్తిస్తుంది. ఈ మాత్రం దానికే హెల్త్‌కార్డు దేనికని సీపీఎస్ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఓపీఎస్ ఉద్యోగులు, పెన్షనర్లకు మాత్రమే చోటు కల్పించారు. దీంతో మొత్తం ఉద్యోగుల్లో 70% మేరకు ఉన్న సీపీఎస్ ఉద్యోగులకు ట్రస్టు బోర్డులో చోటు కల్పించరా? అని ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈహెచ్ఎస్ అమలులో తమ భాగస్వామ్యం లేకపోవడంతో సీపీఎస్, రిటైర్డ్ సీపీఎస్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాల్లేవని వారు వాపోతున్నారు.
వృద్ధాప్యంలో ఆర్థిక, ఆరోగ్య భద్రత ఏదీ?
సీపీఎస్ ఉద్యోగుల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించింది. 2004 సెప్టెంబర్ 1 తర్వాత నియమితులైన వారంతా ఉద్యోగ విరమణ తర్వాత పెన్షన్ సౌకర్యానికి దూరమవుతారు. ఫలితంగా వారికి హెల్త్‌కార్డులు వర్తించే పరిస్థితి లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం సీపీఎస్‌ను రద్దుచేసి, పాత పెన్షన్‌ను అమలు చేయాలి. అప్పటిదాకా రిటైర్డ్ సీపీఎస్ ఉద్యోగులకు నగదు రహిత వైద్యాన్ని కొనసాగించాలి. ఈహెచ్ఎస్ ట్రస్టు బోర్డులో సీపీఎస్ ఉద్యోగ సంఘాలకు ప్రాతినిథ్యం కల్పించాలి.
– లింగమొల్ల దర్శన్‌గౌడ్, తెలంగాణ సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు