హైదకాబాద్, జూలై 17( నమస్తే తెలంగాణ): ఒక తప్పును సరిదిద్దుకోవడం కోసం ఎక్సైజ్ శాఖ తప్పు మీద తప్పు చేస్తున్నది. ఎక్సైజ్ శాఖలో అతి సాధారణ ఒక సెక్షన్ అధికారి రూపొందించిన 8-ఎఫ్ నిబంధన మీద ఎటువంటి కసరత్తు చేయకుండా యథాతథంగా ఆమోదించిన ప్రభుత్వం ఇప్పుడు ఆ పొరపాటును సరిదిద్దుకోవడం కోసం తప్పుల మీద తప్పులు చేస్తున్నది. తాజాగా జోన్-6 పరిధిలో 50 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఇచ్చిన పోస్టింగ్‌లు ఎక్సైజ్ శాఖలో కొత్త వివాదానికి దారితీశాయి. సాధారణ బదిలీల సమయంలో అమలుచేసిన సీనియారిటీ, 8-ఎఫ్, ఫోకల్-నాన్ ఫోకల్ నిబంధనలను ఈ పోస్టింగ్‌ల్లో పకనపెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎక్సైజ్ శాఖ కమిషనర్, రాష్ట్ర ప్రభుత్వం కలిసి కొన్ని నిబంధనలు రూపొందించి అమలుచేసిన తరువాత, మళ్లీ వారే ఏకపక్షంగా నిబంధనలు పక్కనపెట్టడం ఏమిటి? అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీని వెనుక భారీ వ్యూహామే ఉన్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమిషనర్ కార్యాలయానికి అనుకూలంగా ఉన్న కొంతమందికి ఫోకల్ పోస్టులు ఇవ్వడంతోపాటు రెండు మూడు రోజుల్లో చేపట్టనున్న ఎస్ఐ, సీఐ, ఏఈఎస్ స్థాయి అధికారుల బదిలీలకు ముందు.. శాఖలో అసంతృప్తిని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నారనే ప్రచారం జరుగుతున్నది. కొందరిని సంతృప్తిపరిచి, మిగిలిన వారిలో వ్యతిరేకతను తగ్గించే వ్యూహంలో భాగంగానే ఈ పోస్టింగ్‌లు ఇచ్చారనే చర్చ నడుస్తున్నది.
పోస్టింగ్‌లపై వివాదం
కోర్టు కేసులు, వాయిదాల కారణంగా నిలిచిపోయిన 50 మంది హెడ్ కానిస్టేబుళ్ల ప్రమోషన్లకు సంబంధించిన పోస్టింగ్‌ల ప్రక్రియను ఇటీవల ఎక్సైజ్ శాఖ కమిషనర్ చేపట్టారు. ప్రమోషన్లు పొందిన ఉద్యోగులకు పోస్టింగ్‌లు రావడం స్వాగతించదగిన పరిణామమే అయినప్పటికీ, వారికి స్టేషన్ల కేటాయింపు విధానమే ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. శాఖ ఉద్యోగుల ఆరోపణల ప్రకారం.. ఈ 50 మంది సాధారణ బదిలీలకు ముందే హెడ్ కానిస్టేబుళ్లుగా ప్రమోషన్ ఉత్తర్వులు అందుకున్నారు. అయినప్పటికీ, సాధారణ బదిలీల సమయంలో వారిని హెడ్ కానిస్టేబుళ్లుగా కాకుండా కానిస్టేబుళ్లుగానే పరిగణించి బదిలీలు చేపట్టారు. దీంతో వారు తమ సీనియారిటీ ఆధారంగా అనుకూల స్థానాలకు వెళ్లే అవకాశం పొందారని, అదే సమయంలో వారి తర్వాతి సీనియర్లు 8-ఎఫ్ నిబంధన కారణంగా వందల కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాలకు బదిలీ అయ్యారని సమాచారం. సాధారణ బదిలీల సమయంలో సీనియారిటీ ఆధారంగా భర్తీ చేయాల్సిన కొన్ని కీలక పోస్టులను ఉద్దేశపూర్వకంగానే హైడ్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనంతరం అదే పోస్టులను ప్రమోషన్లు పొందిన 50 మందికి కేటాయించారని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ విధానం వల్ల సాధారణ బదిలీల్లో అవకాశాలు కోల్పోయిన వారికి అన్యాయం జరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
వాట్సాప్ గ్రూప్‌ల్లో చర్చ
పోస్టింగ్‌లు పొందిన వారిలో అధిక శాతం మంది గతంలో కానిస్టేబుళ్లుగా పనిచేసిన అదే యూనిట్, జిల్లా లేదా ప్రాంతాల్లోనే హెడ్ కానిస్టేబుళ్లుగా నియమితులయ్యారని శాఖలో చర్చ జరుగుతున్నది. సాధారణ బదిలీల్లో ఫోకల్-నాన్ ఫోకల్, స్థానిక-స్థానికేతర, 8-ఎఫ్ వంటి నిబంధనలను కచ్చితంగా అమలు చేసిన అధికారులు, ఈ పోస్టింగ్‌ల్లో మాత్రం వాటిని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదంతా ఎక్సైజ్ ఉద్యోగులు, అధికారుల వాట్సాప్ గ్రూపుల్లో తిరుగుతున్నది. పోస్టింగ్‌ల కేటాయింపులో ఏ ప్రమాణాలు అనుసరించారు? సాధారణ బదిలీల సమయంలో దాచిపెట్టిన పోస్టులనే ఇప్పుడు భర్తీ చేశారా? ప్రమోషన్లు పొందిన వారిని అప్పుడే హెడ్ కానిస్టేబుళ్లుగా ఎందుకు పరిగణించలేదు? వంటి ప్రశ్నలకు శాఖ స్పష్టమైన వివరణ ఇవ్వాలని ఉద్యోగ వర్గాలు కోరుతున్నాయి.