న్యూఢిల్లీ : పాలపుంత కేంద్రంలో శాస్త్రవేత్తలు చక్కెర అణువులను కనుగొన్నారు. అంతరిక్షంలోని వాయుమేఘాలు భూమిపై జీవం వికసించడానికి అవసరమైన ఒక ముఖ్యమైన పదార్థాన్ని మోసుకొచ్చి ఉండవచ్చని ఇది సూచిస్తున్నది. అంతరిక్షంలో కనుగొనబడిన మొట్టమొదటి నిజమైన చక్కెర ‘ఎరిథ్రూలోస్’ గెలాక్సీ కేంద్రంలో లభ్యమైంది. స్పానిష్ ఆస్ట్రోబయాలజీ సెంటర్‌కు చెందిన కాస్మోకెమిస్ట్ ఇజాస్కున్ జిమెనెజ్ సెర్రా నేతృత్వంలోని పరిశోధకుల బృందం, అంతరిక్షంలోని ఈ ఎరిథ్రూలోస్ మన గ్రహంపై ప్రారంభ జీవక్రియ, పునరుత్పత్తి ప్రక్రియలకు అవసరమైన చక్కెర నిల్వలను అందించడంలో సహాయపడి ఉండవచ్చని విశ్వసిస్తున్నది. సుమారు నాలుగు బిలియన్ సంవత్సరాల క్రితం మన సౌరవ్యవస్థ ఇంకా ఏర్పడుతున్న సమయంలో ఇది జరిగింది. అంతరిక్షం నుంచి దాదాపు 50 మిలియన్ టన్నుల చక్కెర భూమిపై పడింది.
ఇది జీవానికి అవసరమైన ప్రాథమిక భాగాలను అందించింది. చక్కెరలు అనేవి కణాలకు శక్తినిచ్చే అణువులు, పెద్ద జీవ అణువులను నిర్మించడానికి అవసరమైన ముడి పదార్థాలు. ఇవి ఆర్ఎన్ఏ, డీఎన్ఏల నిర్మాణానికి వెన్నెముకలాంటివి. ఈ అంతరిక్ష మేఘాలు విశ్వంలోని ఇతర భాగాల్లో కూడా ఇదేవిధంగా జీవానికి బీజం వేసి ఉండవచ్చని ఈ అధ్యయనం సూచిస్తున్నది. దాదాపు 300 మిలియన్ సంవత్సరాలపాటు సౌరవ్యవస్థలోని ప్రతి గ్రహం గ్రహశకలాలు, ఉల్కల దాడికి గురైంది. మన చంద్రుడు ఏర్పడింది కూడా ఇలానే. ఇదే సమయంలో అంతరిక్ష ధూళి భూమికి చక్కెరను తీసుకువచ్చింది. జీవానికి పూర్వపు అణువులు ఉన్నట్టు గుర్తించిన ‘జి+0.693’ అనే మేఘాన్ని స్పెయిన్‌లోని రెండు రేడియో టెలిస్కోప్‌లు పరిశీలించాయి. ఈ బృందం మూడు కార్బన్ పరమాణువులు కలిగిన సాధారణ చక్కెరను కనుగొనవచ్చని ఆశించింది. అయితే వారు నాలుగు కార్బన్లు కలిగిన ఎరిథ్రూలోస్ను కనుగొని ఆశ్చర్యపోయారు. ఇది మూడు కార్బన్ల చక్కెర కంటే కనీసం 8 నుంచి 17 రెట్లు ఎక్కువగా ఉన్నది. గెలాక్సీ కేంద్రంలో ఇంత భారీ మొత్తంలో చక్కెర ఉండటం అంటే భూమికి కూడా దాని ప్రారంభ సంవత్సరాల్లో ఇది చాలా ఎక్కువ మొత్తంలో అందిందని అర్థం.
మాలిక్కులర్ క్లౌడ్‌లో కొలిచిన ఎరిథ్రూలోస్ పరిమాణాన్ని బట్టి భారీ ఉల్కల దాడి జరిగిన కాలంలో 0.5 నుంచి 50 మిలియన్ టన్నుల చక్కెర భూమి ఉపరితలానికి చేరుకుని ఉండవచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అంతరిక్షంలో చక్కెర ఎలా ఏర్పడుతుందో అర్థం చేసుకోవడానికి వారు ఈ డాటాను ఉపయోగించారు. రెండు కార్బన్ల అణువులైన ైగ్లెకోలాల్డిహైడ్, ఇథిలీన్ ైగ్లెకాల్ను మోసుకెళ్లే చిన్న ధూళికణాల మంచు ఉపరితలంపై ఇది ఏర్పడిందని విశ్లేషణలో తేలింది. రేడియేషన్ ద్వారా ఇవి ఉత్తేజితమైనప్పుడు, అవి కలిసి ఎరిథ్రూలోస్ను నిర్మించగలవు. అంతరిక్ష పరిస్థితుల్లో కూడా సంక్లిష్ట అణువులు ఏర్పడగలవని ఈ ఆవిష్కరణ చూపిస్తున్నది.“ఎరిథ్రూలోస్ను గుర్తించడం చాలా ఉత్తేజాన్ని ఇస్తున్నదని, ఎందుకంటే ఇది ఆర్ఎన్ఏలో భాగమైన రైబోస్ వంటి చక్కెరలను, జీవక్రియల పుట్టుకకు ముఖ్యమైన ఇతర అణువులను అంతరిక్షంలో కనుగొనే అవకాశాన్ని తెరుస్తుంది” అని సహ రచయిత కార్లోస్ బ్రియోన్స్ అన్నారు. ఈ చక్కెరలు విడిపోయినప్పుడు విశ్వంలో మరెక్కడైనా ల్యాండ్ అయి ఉండవచ్చని వారు నిర్ధారించారు.