న్యూఢిల్లీ, జూలై 17 : ప్రతిష్టాత్మక ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రెయిన్ ప్రాజెక్టులో జాప్యానికి ఒక భారతీయ మంత్రి, అధికారులు బాధ్యులని జపాన్‌కు చెందిన ఒక మాజీ మంత్రి నిందించారు. షింకన్సన్ ప్రాజెక్టుపై చర్చల సందర్భంగా అధికారులు పదేపదే తమ వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో విఫలమై స్వప్రయోజనాల కోసం పనిచేశారని జపాన్ మాజీ న్యాయశాఖ మంత్రి హిడెకి మకిహారా ఆరోపించారు. వారిది(అధికారులు) పూర్తి నిర్లక్ష్యమని ఆయన విమర్శించారు. ఈ ప్రాజెక్టు అసలు షింకన్సన్ నమూనా నుండి వేరుపడిందని జపాన్ వార్తా సంస్థ ఒకటి కథనాన్ని ప్రచురించిన తర్వాత మకిహారా ఈ వ్యాఖ్యలు చేశారు. భారతదేశపు ప్రతిష్టాత్మక హైస్పీడ్ రైల్ కారిడార్ పనుల్లో పురోగతి లేకపోవడానికి కారణం పూర్తిగా భారత్ వైపు నుండే అని ఎక్స్ పోస్టులో మకిహారా పేర్కొన్నారు. భారతదేశపు మొట్టమొదటి హైస్పీడ్ రైలు కారిడార్ ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు(ఎంఏహెచ్ఎస్ఆర్) మార్గంలో ప్రయాణికుల రాకపోకల సేవలు దశలవారీగా 2027 ఆగస్టు 15న ప్రారంభమవుతాయని అంచనా. ముంబై-అహ్మదాబాద్ కారిడార్ జపనీస్ షింకన్సెన్ సాంకేతికతను ఉపయోగిస్తుంది. దీనికి జపాన్ ప్రభుత్వానికి చెందిన జపాన్ అంతర్జాతీయ సహకారం సంస్థ(జేఐసీఏ) పాక్షికంగా నిధులు సమకూరుస్తుంది.
ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టులో తీవ్ర జాప్యంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేందుకు జపాన్ మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్షం అనుకూలంగా మలుచుకుంది. మకిహారా వ్యాఖ్యలను ఎక్స్ వేదికగా కాంగ్రెస్ నేత పవన్ ఖేరా పంచుకుంటూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ, ‘రీల్ మంత్రి’ ఖాతాలో మరో ఘనత అంటూ ఆయన ఎద్దేవా చేశారు. భారతదేశపు అత్యంత కీలకమైన వ్యూహాత్మక మౌలిక సదుపాయాల భాగస్వామ్యాలలో ఒకదానిని ప్రభుత్వం ఇంత అధ్వానంగా నిర్వహించిందంటే ఇప్పుడు విదేశీ అధికారులు కూడా ప్రభుత్వ అసమర్థతను విమర్శించే దుస్థితి దాపురించిందని, ఇది సిగ్గుచేటని ఆయన ఆరోపించారు.
ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్టులో జాప్యానికి భారతీయ అధికారులే కారణమంటూ జపాన్‌కు చెందిన మాజీ మంత్రి చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈ ప్రాజెక్టు విషయంలో జపాన్‌తో విభేదాలు నెలకొన్నట్లు వచ్చిన వార్తలను భారత్ శుక్రవారం తోసిపుచ్చింది. ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై ద్వైపాక్షిక చర్చలు కొనసాగుతున్నాయని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. జపాన్ మాజీ న్యాయ శాఖ మంత్రి హిడెకి మకిహారా చేసిన వ్యాఖ్యలపై విదేశీ వ్యవహారాల శాఖ స్పందిస్తూ అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని, ఆయన ఆరోపణలు సత్యదూరమని పేర్కొంది.