న్యూఢిల్లీ, జూలై 17 : జాతీయ గేయం వందేమాతరాన్ని అవమానించినా, ఆలాపనను అడ్డుకున్నా ఇకపై వాటిని శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు. ఈ మేరకు పార్లమెంట్లో కేంద్రం ఒక బిల్లును ప్రవేశపెట్టనుంది. అలా చేస్తే మూడేండ్ల శిక్ష, జరిమానా లేదా రెండూ విధించేలా జాతీయ గౌరవ చట్టం 1971ను సవరించనుంది. ఈ చట్టం జాతీయ గీతానికి, జాతీయ జెండాకు, రాజ్యాంగానికి ఉన్నత స్థాయి హోదా ఏ విధంగా ఇస్తుందో, జాతీయ గేయానికి కూడా చట్టపరంగా అటువంటి హోదానే కల్పిస్తుంది. ఈ నెల 20 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో దీనిని ప్రవేశపెడతారు. ఉభయ సభల ఆమోదం పొందితే, జాతీయ గేయాన్ని అవమానపర్చడాన్ని ఇకపై నేరంగా పరిగణిస్తారు.
ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఐదు కొత్త బిల్లులతో పాటు రెండు పెండింగ్ బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లుల గురించి ప్రభుత్వం అఖిలపక్ష సమావేశంలో వివరిస్తుందని భావిస్తున్నారు. కాగా, ఇటీవల పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టి అభాసుపాలైన మోదీ ప్రభుత్వం ఈసారి చాలా గుంభనంగా, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది. ఈ సమావేశాల్లో ప్రవేశపెడతారని భావిస్తున్న ఎంతో ముఖ్యమైన రాజ్యాంగ సవరణ బిల్లు సమావేశాల తాత్కాలిక జాబితాలో లేదు. అందరూ ఎదురు చూస్తున్న మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన కోసం ప్రవేశపెట్టే రాజ్యాంగ సవరణ బిల్లులను సభలో తమకు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీని సాధించగలమని ప్రభుత్వం నమ్మిన తర్వాతే ప్రవేశపెడతారని భావిస్తున్నారు.
ఏదైనా నేరంలో నెల రోజలు అంతకు మించి అరస్టై జ్యుడీషియల్ కస్టడీలో ఉంటే ప్రధాని, ముఖ్యమంత్రులు సహా ఇతర మంత్రులను పదవి నుంచి తొలగించేందుకు ఉద్దేశించిన మూడు బిల్లులను జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలించింది. క్రిమినల్ కేసులో అరెస్టయ్యి 30 రోజులు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నేతలు 31వ రోజు పదవికి రాజీనామా చేయాలి. లేకపోతే 31 రోజు నుంచి పదవిని కోల్పోతారని ఈ బిల్లులో ప్రతిపాదించారు.
పలువురు విపక్ష ఎంపీలు అధికార బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏలో చేరినప్పటికీ వచ్చే వారం నుండి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఒక దేశం, ఒక ఎన్నిక బిల్లును తీసుకువచ్చే ఉద్దేశమేదీ ప్రభుత్వానికి ఉన్నట్లు కనపడడం లేదు. అదే విధంగా నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్) బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా వచ్చే సమావేశాల్లో ప్రవేశపెట్టడంపై కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టత లేదని అధికార వర్గాలు తెలిపాయి. కాగా, ఆ రెండు బిల్లులను ఈసారి పలువురు విపక్ష ఎంపీలు బలపరుస్తారని, దీంతో కాంగ్రెస్ ఒంటరి అవుతుందని ప్రభుత్వం భావిస్తోందని వర్గాలు తెలిపాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల గరిష్ఠ సంఖ్యను 33 నుంచి 37కి పెంచడానికి ఉద్దేశించిన సుప్రీంకోర్టు(న్యాయమూర్తుల సంఖ్య) సవరణ బిల్లు, 2026తో సహా పెండింగ్‌లో ఉన్న ఆర్డినెన్స్‌లను ఆమోదించపచేసుకోవడమే ప్రభుత్వానికి ప్రస్తుతం తక్షణ ప్రాధాన్యతని వారు వివరించారు. గత ఏడాది శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఒక దేశం, ఒక ఎన్నిక బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. బీజేపీ ఎంపీ ఆర్పీ చౌదరి నేతృత్వంలోని సంయుక్త పార్లమెంటరీ కమిటీకి(జేపీసీ) కాల పరిమితిని ఆగస్టు 10 వరకు ప్రభుత్వం పొడిగించింది. అయితే ఈ బిల్లును ప్రభుత్వం హడావుడిగా తీసుకురావడానికి ప్రయత్నిస్తోందని చెబుతున్న విపక్ష నాయకులు తమ మద్దతు లేకుండా ఇది పార్లమెంట్లో ఆమోదం పొందలేదని వాదిస్తున్నారు. ప్రతిపక్షం మద్దతు లేకుండా బిల్లును ఎలా తీసుకువస్తారు?ముందుగా ప్రతిపక్షంతో వారు చర్చించాలి. అందులో ఏముందో మాకు తెలియాలి కదా. ఆ తర్వాత మా అభిప్రాయం చెబుతాం అని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ గురువారం చెప్పారు.
మహిళా రిజర్వేషన్‌తో ముడిపడిన రాజ్యాంగ(131వ సవరణ) బిల్లు, 2026 గత పార్లమెంట్ సమావేశాల్లో లోక్‌సభలో వీగిపోయింది. అనుకూలంగా 298, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. లోక్‌సభలో ఆమోదం పొందాలంటే మూడింట రెండు వంతుల మెజారిటీ ఓట్లను సాధించాల్సి ఉంటుంది. తాము మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం కామని, అయితే దీన్ని డీలిమిటేషన్‌తో ముడిపెట్టడాన్నే తాము వ్యతిరేకిస్తున్నామని ప్రతిపక్షం తెలిపింది. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ర్టాలు పార్లమెంట్లో ప్రాతినిధ్యాన్ని కోల్పోతాయని ప్రతిపక్షాలు వాదించగా ప్రభుత్వం మాత్రం డీలిమిటేషన్ బిల్లును గట్టిగా సమర్థిస్తూ దక్షిణాది రాష్ర్టాల ప్రాతినిధ్యం తగ్గబోదని హామీ ఇచ్చింది.