పరకాల, ఫిబ్రవరి 7: తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పదేండ్లలో రాష్ట్రంలో సంపదను సృష్టిస్తే, మాయమాటలతో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి దీన్ని కొల్లగుడుతున్నాడని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. శనివారం హనుమకొండ జిల్లా పరకాలలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. గ్రామాలు, పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా కేసీఆర్ పాలన అందించారని గుర్తుచేశారు.
రాష్ర్టాన్ని దేశానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దితే రెండేండ్లలో రేవంత్‌రెడ్డి అవినీతి, అసమర్థపాలన కొనసాగిస్తున్నాడని విమర్శించారు. రాష్ట్ర సాధనకు ప్రాణ త్యాగాన్ని సైతం లెక్కచేయకుండా పోరాడిన మహానేత కేసీఆర్ అని కొనియాడారు.
కానీ ‘జై తెలంగాణ’ అన్న వ్యక్తిపై గన్ ఎక్కుపెట్టిన చరిత్ర రేవంత్‌రెడ్డిదని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి 26 నెలలు గడిచినా రాష్ట్రంలో ఏ ఒక్క శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నదని దుయ్యబట్టారు. ఆరు గ్యారెంటీల అమలుపై రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి లేదని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బూతులు మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు ఏ మైందని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కర్రుకాల్చి వాత పెడితేనే వాళ్లకు సోయి వస్తుందని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారీటీతో గెలిపించాలని సిరికొండ కోరారు.