హైదరాబాద్, జూన్ 6(నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆత్మగౌరవమే కేసీఆర్.. ఆయనది గాంధీ, నెల్సన్ మండేలా అంతటి మహోన్నత వ్యక్తిత్వం.. ఆయన మనదేశంలోనే అరుదైన నాయకుడు.. అని ప్రజాకవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న కొనియాడారు. శాంతియుతంగా ప్రత్యేక రాష్ర్టోద్యమం చేయడమెలా అని ప్రపంచానికి పాఠాలు నేర్పిన గొప్ప దార్శినీకుడు అని ప్రస్తుతించారు. అటువంటి మహోతన్న వ్యక్తి తనను అవమానించారని సోషల్ మీడియాలో వార్త రాయడం హేయమైన, జుగుప్సాకరమైన చర్యగా గోరటి వెంకన్న అభివర్ణించారు. ఇటీవల ఓ యూట్యూట్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ తనను అవమానించినట్టు, తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని చెప్పానని ఒక వెబ్ ప్రతిక పేరుతో రాసిన కథనం అసహ్యమైన, అమానుషమైన దుష్ప్రచారమని, అది శుద్ధ అబద్ధమని ఆయన తీవ్రంగా ఖండించారు.
అమెరికాలోని డల్లాస్‌లో ఉన్న ఆయన శుక్రవారం ఇక్కడి మీడియా ప్రతినిధులతో వాట్సప్ కాల్లో మాట్లాడారు. తెలంగాణ జాతి ఆత్మగౌరవమే కేసీఆర్ అయినప్పుడు మరొకరి ఆత్మగౌరవాన్ని ఆయన దెబ్బతీశారనడం మూర్జత్వమేనని పేర్కొన్నారు. ఎవరినైనా తాను విమర్శించాలంటే పత్రికా ముఖంగానో, వేదికలపైనో నేరుగానే మాట్లాడగలనని స్పష్టంచేశారు. తనకు హాని తలపెట్టిన వారినే క్షమించే గొప్ప మనస్తత్వం ఆయనదని పేర్కొన్నారు. గోదావరికి నడక నేర్పి తెలంగాణకు నీళ్లను పొంగించిన గొప్ప దార్శనీకుడు కేసీఆర్ తనను అవమానించినట్టు ప్రచారం చేయడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు ఇటువంటి నీతిమాలిన తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని విజప్తి చేశారు. దీని వెనుక ఎవరు ఉండి రాయించారో బయటికి రావాల్సిన అవసరం ఉన్నదని స్పష్టంచేశారు.