హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ)/దామరచర్ల: కేసీఆర్ దార్శనికతకు నిదర్శనంగా మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. తెలంగాణ విద్యుత్తు రంగంలో కేసీఆర్ స్వప్నం సాకారమైంది. ప్రతిష్ఠాత్మక యాదాద్రి పవర్‌ప్లాంట్ (వైటీపీఎస్) మరో మైలురాయిని అధిగమించింది. గురువారం ఈ ప్లాంట్‌లోని యూనిట్-4 కమర్షియల్ ఆపరేషన్ డేట్ (సీవోడీ) సక్సెస్ అయ్యింది. 72 గంటలపాటు ఈ ప్లాంట్ నిర్విరామంగా నడిచింది. 800 మెగావాట్ల ఈ ప్లాంట్ ఎలాంటి సమస్యలు, ఆటంకాల్లేకుండా నడువడంతో సీవోడీ సక్సెస్ అయినట్టు టీజీ జెన్కో ప్రకటించింది. 72 గంటల్లో అధికారులు 57.6 మిలియన్ యూని ట్ల లక్ష్యాన్ని నిర్దేశించగా, ఈ యూనిట్ 58 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తిచేసింది. ప్లాంట్ సామర్థ్యం 800 మెగావాట్లు కాగా, 825 మెగావాట్ల గరిష్ఠ సామర్థ్యంతో నడిపారు.
అయినా ఎలాంటి సమస్యలు ఉత్పన్నంకాకపోవడం గమనార్హం. ఈ నెల 5న మధ్యాహ్నం 3:30 గంటల తర్వాత ఈ యూనిట్ సీవోడీని ప్రారంభించగా, గురువారం మధ్యాహ్నం 3:30 గంటలకు సీవోడీ ముగిసింది. వైటీపీఎస్‌లో 800 మెగావాట్ల సామర్థ్యం గల ఐదు యూనిట్లున్నాయి. స్టేజ్-1లో రెండు, స్టేజ్-2లో మూడు యూనిట్లున్నాయి. స్టేజ్-1లోని రెండు యూనిట్లలో ఇప్పటికే కమర్షియల్ ఆపరేషన్స్ ప్రా రంభమయ్యాయి. స్టేజ్-2లో ప్రస్తుతం యూనిట్-4 సీవోడీ విజయవంతమైంది. యూనిట్ -3 సీవోడీని వచ్చే నెలలో చేపట్టాలన్న ఆలోచనలో అధికారులున్నారు. యూనిట్-5 సీవోడీకి మూడు నెలలు పట్టే అవకాశం ఉన్నదని ఇంజినీర్లు చెప్తున్నారు. సీవోడీ విజయవంతం కావడంతో యాదాద్రి ద్వారా మొత్తంగా 2,400 మెగావాట్ల విద్యుత్తు అందుబాటులోకి వచ్చినట్టవుతుంది.
సమైక్య పాలకుల శాపనార్థాలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ వస్తే రాష్ట్రం అంధకారమవుతుందని శాపనార్థాలు పెట్టారు. తెలంగాణ ఏర్పడితే విపరీతమైన సంక్షోభం తలెత్తుతుందంటూ రాష్ట్ర విభజనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. స్వరాష్ట్రం సిద్ధించిన తరువాత కూడా పుట్టిన పసిగుడ్డు పీక నులిమేయాలన్నట్టుగా టీడీపీ-బీజేపీ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా వ్యవహరించింది. సీలేరు ప్రాజెక్ట్‌ను ఏపీ లాక్కుంది. దీంతో 500 మెగావాట్ల విద్యుత్తు నిలిచిపోయింది. అంతేకాకుండా కృష్ణపట్నం ప్లాంట్‌లో తెలంగాణ వాటాగా రావాల్సిన 500 మెగావాట్ల పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లను ఉల్లంఘించారు. ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు.
తెలంగాణను ఒక విఫల రాష్ట్రంగా ప్రపంచం ముందుంచేందుకు సీమాంధ్ర పాలకులు అనేక కుట్రలకు తెరలేపారు. రాష్ట్ర అవసరాలు తీర్చాలంటే బయటి నుంచి విద్యుత్తు కొనుక్కోవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్.. విద్యుత్తు కోసం ఒకరి మీద ఆధారపడే పరిస్థితి నుంచి బయటపడి, తెలంగాణను స్వయం సమృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ముందుకు కదిలారు. కొత్త థర్మల్ప్లాంట్లను ఏర్పాటుచేయడమే ఇందుకు పరిష్కారమన్న నిర్ణయానికి వచ్చారు. 1,080 మెగావాట్ల భద్రాద్రి పవర్‌ప్లాంట్‌ను నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇదే వరుసలో నాలుగు వేల మెగావాట్ల సామర్థ్యంతో యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణానికి అంకురార్పణ చేశారు.
కేసీఆర్ కలల ప్రాజెక్ట్
రాష్ట్రంలో భద్రాద్రితో కలుపుకొంటే 11 ధర్మల్ ప్లాంట్లు ఉన్నాయి. దాదాపు అన్నీ చిన్న చిన్న ప్లాంట్లే. రాష్ట్రం ఏర్పడేనాటికి థర్మల్ స్థాపిత విద్యుత్తు సామర్థ్యం 4,780 మెగావాట్లు మాత్రమే. విద్యుత్తు రంగంలో రాష్ట్రం స్వయం సమృద్ధి సాధించాలంటే, భవిష్యత్తు అవసరాలు తీర్చాలంటే చిన్న చిన్న విద్యుత్తు ప్లాంట్లు నిర్మిస్తే సరిపోదన్న నిర్ణయానికి కేసీఆర్ వచ్చారు. మెగా ప్రాజెక్ట్‌ను నిర్మించాలన్న లక్ష్యంతో నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో రూ.35 వేల కోట్లతో యాదాద్రి పవర్ ప్లాంట్‌కు శ్రీకారం చుట్టారు. నాలుగువేల మెగావాట్ల సామర్థ్యంతో కూడిన ఈ థర్మల్‌ప్లాంట్‌ను టీజీ జెన్కో ద్వారా చేపట్టారు. పనులు ప్రారంభించిన తర్వాత అనేక అవాంతరాలు ఎదురయ్యాయి. కరోనా దెబ్బతీసింది.
అయినా బీహార్, ఒడిశా రాష్ర్టాల నుంచి కార్మికులను రప్పించి పనులు చేపట్టారు. మొత్తం ఒక్కో దశను దాటుకుంటూ మూడు యూనిట్లు అందుబాటులోకి వచ్చాయి. మరో రెండు యూనిట్లు కూడా అందుబాటులోకి రావడం లాంఛనమే. 800 మెగావాట్ల కెపాసిటీతో మొత్తం 5 ప్లాంట్లు ఏర్పాటు చేయగా, తొలుత రెండో యూనిట్‌ను 2024 డిసెంబర్ 7వ తేదీన, మొదటి యూనిట్‌ను 2025 అగస్టు 1న ప్రభుత్వం ప్రారంభించింది. ప్రస్తుతం రెండు యూనిట్ల ద్వారా 1,600 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతున్నది. నాల్గవ యూనిట్ కూడా ప్రారంభమైతే మొత్తం 2,400 యూనిట్ల విద్యుత్తును రాష్ర్టానికి అందించనున్నది. మిగతా మూడు, అయిదు యూనిట్ల పనులు కూడా పూర్తిదశకు చేరుకొని సీవోడీ సిద్ధమవుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌పై, కేసీఆర్‌పై గతంలో విమర్శలు గుప్పించిన ప్రస్తుత మంత్రులు ఇదే ప్రాజెక్ట్‌ను కీర్తిస్తుండటం గమనార్హం. ఈ ప్లాంట్‌లో ఏ ప్రారంభోత్సవం జరిగినా.. అంతా క్యూ కడుతుండటం విశేషం.
తెలంగాణ చరిత్రపై కేసీఆర్ చెరగని సంతకం : హరీశ్‌రావు
సమైక్య పాలనలో అంధకారంలో మగ్గిన తెలంగాణలో వెలుగులు నింపిన ఘనత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కే దక్కిందని మాజీ మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. యాదాద్రి ప్లాంట్ నాలుగో యూనిట్ సీవోడీ పూర్తిచేసుకోవడంపై గురువారం ఆయన ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ‘కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తానని అడ్డగోలు కూతలు కూసే నాయకులకు చెబుతున్నా.. తెలంగాణ చరిత్రపై కేసీఆర్ చెరగని సంతకం ఈ ప్లాంట్’ అని స్పష్టంచేశారు. 4వేల యూనిట్ల సామర్థ్యం కలిగిన ఈ పవర్‌ప్లాంట్ నిర్మాణానికి పూనుకున్న ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. కేసీఆర్‌కు ఎక్కడ పేరుస్తుందోననే కురుచబుద్ధిని పక్కనబెట్టి మిగిలిన రెండు యూనిట్ల నిర్మాణాన్ని పూర్తిచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కేసీఆర్ కృషితోనే విద్యుత్తు విజయం
యాదాద్రి ప్లాంట్ సక్సెస్ పై కేటీఆర్ హర్షం
దశాబ్దాల నాటి కరంట్ కష్టాలు తొలగిపోయి తెలంగాణలో వెలుగు ప్రస్థానం సాగాలని కేసీఆర్ ముందుచూపుతో వేసిన పునాది, విశేష కృషి వల్లే ఇవాళ విద్యుత్తు విషయంలో మరో విజయం సాధ్యమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లోని సూపర్ క్రిటికల్ 4వ యూనిట్ విజయవంతం కావడం సంతోషకరమని గురువారం ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తంచేశారు. 800 మెగావాట్ల కమర్షియల్ ఆపరేషన్‌లో యాదాద్రి నాలుగో యూనిట్ సీవోడీ పూర్తిచేసుకోవడం తెలంగాణ ప్రజలకు గర్వకారణమని, ఫలితంగా ప్లాంట్‌లో 3200 మెగావాట్ల విద్యుదుత్పత్తి అందుబాటులోకి రావడం శుభపరిణామమని పేర్కొన్నారు. కేసీఆర్ కలను సాకారం చేసిన విద్యుత్తు శాఖ ఇంజినీర్లతోపా టు భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా అభినందనలు, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.