Singareni | ఇల్లెందు, సెప్టెంబర్ 21: సింగరేణి లాభాల వాటా 16 నుంచి 32 శాతానికి పెంచింది తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ అని టీబీజీకేఎస్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ఎస్ రంగనాథ్, జాఫర్ హుస్సేన్లు స్పష్టం చేశారు. ఇల్లెందు పట్టణం జగదాంబ సెంటర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఆర్ధిక సంవత్సరం ముగిసి నెలలు గడుస్తున్నా వాస్తవ లాభాలు ప్రకటించకుండా సింగరేణి యాజమాన్యం గందరగోళం సృష్టిస్తుంది. కార్మికులు రక్త మాoసాలు చెమటగా మార్చి సింగరేణిని లాభాలలోకి తెచ్చి లాభాలలో నడిపించటాన్ని గుర్తించి సింగరేణి కార్మికులకు లాభాలలో వాట ఇవ్వటం జరిగింది. పది శాతంతో మొదలైన లాభాల వాట 33 శాతం వరకు వచ్చింది. 16 శాతం ఉన్నదానిని 32 శాతం వరకు పెంచిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుంది.
బతకమ్మ మొదలై దసరా వస్తున్నా లాభాలు ప్రకటించకుండా కార్మికులను గందరగోళంలోకి నెట్టు తున్నారు. ఒక వైపు సింగరేణి నిధులను రాష్ట్రంలోని పాఠశాలల కోసం, సివిల్ అభ్యర్థుల కోసం మళ్ళించి లాభాలు తక్కువగా చూపి కార్మికుల పొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు మాటలతో కాలం వెల్లబుచ్చటమే తప్ప ప్రభుత్వం మీద వత్తిడి తేవటంలో విఫలం అవుతున్నారు. ప్రభుత్వం కూడా లాభాలు ప్రకటించకుండా మీనా మేషాలు లెక్కించటం కార్మిక విద్రోహమే ఇప్పటికైనా వెంటనే లాభాలతో పాటు లాభాల వాట ఇచ్చే తేదీని ప్రకటించాలని TBGKS డిప్యూటీ జనరల్ సెక్రటరీ రంగనాథ్, వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ జాఫర్, TBGKS నాయకుడు గిన్నారపు మహేందర్ డిమాండ్ చేశారు.