KCR | హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి దాతృత్వం చాటుకున్నారు. ప్రమాదవశాత్తు తండ్రులను కోల్పోయిన ఇద్దరు బడుగుల బిడ్డల చదువులకు భరోసానిచ్చారు. వారు బీటెక్ పూర్తిచేసేందుకు అవసరమైన ఫీజులు చెల్లించేందుకు ముందుకొచ్చారు. గురువారం ఎర్రవల్లిలోని తన నివాసంలో ఇద్దరు పిల్లలకు విడివిడిగా చెక్కులు అందజేశారు. ఎర్రవల్లికి చెందిన పేద రైతు చిన్నరాజు సత్తయ్య ఇటీవల విద్యుత్తు ప్రమాదంలో మరణించగా, అదే గ్రామానికి చెందిన మరో పేద రైతు పెద్దోళ్ల సాయిలు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు.
ఈ నేపథ్యంలో సత్తయ్య కొడు కు నవీన్, సాయిలు కొడుకు అజయ్‌ను కేసీఆర్ చేరదీశారు. వారి బీటెక్ చదువులకయ్యే పూర్తికాలపు ఫీజులకు సంబంధించిన చెక్కులు అందజేశారు. ‘కష్టపడి మంచిగా చదువుకోండి బిడ్డ.. గొప్ప స్థాయికి చేరుకోవాలి’ అంటూ ఆశీర్వదించారు. విద్యుత్తు ప్రమాదంలో మరణించిన చిన్నరాజు సత్తయ్య కుటుంబానికి ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా పర్యవేక్షించాలని కేసీఆర్ తన వ్యక్తిగత కార్యదర్శి నాగేందర్‌కు సూచించారు. కాగా, కుటుంబ పెద్దలను కోల్పోయిన తమను ఆదరించి, చదువులు కొనసాగించేందుకు ఆర్థిక చేయూతనందించిన కేసీఆర్‌కు పిల్లలు, వారి తల్లులు చేతులెత్తి నమస్కరించారు. జీవితాంతం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని చెప్పారు.