హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనలో అన్నదాతలను ఆదుకునే నాథుడేలేడని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పార్టీ నాయకుల ఎదుట ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రేవంత్‌రెడ్డి పాలనలో అన్ని వర్గాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, పాలన పూర్తిగా అదుపుతప్పిందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. గత గురువారం స్వల్ప అస్వస్థతతో సోమాజిగూడ యశోద దవాఖానలో అడ్మిట్ అయిన కేసీఆర్.. రెండు రోజులపాటు వైద్య పరీక్షలు చేయించుకొని వైద్యుల సూచన మేరకు డిశ్చార్జి అయిన సంగతి తెలిసిందే. గత శనివారం నుంచి నందినగర్ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్ ఆరోగ్యం కుదుటపడింది.
తనను పరామర్శించడానికి వచ్చిన పార్టీ సీనియర్లతో ఐదు రోజులుగా సుదీర్ఘ చర్చలు చేస్తున్నారు. నాటి తెలంగాణ ఉద్యమకారులతో రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, పలు అంశాల మీద మాట్లాడుతున్నారు. ఉద్యమకాలం నాటి అనుభవాలను స్మరించుకుంటున్నారు. ‘ఉద్యమ సమయంలో తెలంగాణ పరిస్థితి ఎట్లుండే.. అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంత గొప్పగా రాష్ట్రం ప్రగతిని సాధించింది..’ అనే విషయాలను పార్టీ నేతలు అధినేతతో గుర్తుచేసుకుంటున్నారు. నేటి కాంగ్రెస్ పాలనతో పోల్చి చూసుకుంటూ ఎట్ల ఉన్న తెలంగాణ ఎట్లయి పోతున్నదని ఆవేదన చెందుతున్నారు.
కాంగ్రెస్ పాలన పూర్తిగా గాడితప్పింది
కాంగ్రెస్ పాలనలో ప్రజలు అన్ని రంగాల్లో అనేక కష్టాలను ఎదురొంటున్నారని, పాలన పూర్తిగా అదుపుతప్పిందని పార్టీ అధినేత కేసీఆర్‌తో నాయకులు చెప్తున్నారు. రాష్ట్రంలో మళ్లీ ఉమ్మడి రాష్ట్ర పాలన మాదిరి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయనే విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకొస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వరినాట్లకు సిద్ధమైన రైతాంగాన్ని ఆదుకునే నాథుడేలేడని పార్టీ నేతలు వాపోతున్నారు. సమయానికి యూరియా, సాగునీరు అందక రైతాంగం పడుతున్న బాధలపై కేసీఆర్ ఆరా తీస్తున్నారు. నిధుల లేమితో, అస్తవ్యస్త పాలనలో గ్రామాల్లో పరిస్థితి దారుణంగా మారిందని, కనీస సదుపాయాలు అందక సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్తున్నారు. హైడ్రా పేరుతో పేదల ఇండ్లను కూల్చివేయడంతో రోడ్డున పడుతున్న పేద కుటుంబాల మనోవేదనను పార్టీ నేతలు కేసీఆర్‌కు వివరిస్తున్నారు. వారం రోజుల చర్చల్లో క్షేత్రస్థాయి అనుభవాలు, వాస్తవాలు, ప్రజల అభిప్రాయాలను అధినేత ముందు ఏకరవు పెడుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కల్లబొల్లి హామీలిచ్చి మోసం చేశారనే భావన రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఉన్నదని చెప్తున్నారు. ప్రభుత్వం మీద ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు కనిపిస్తే తరిమికొట్టేందుకు తెలంగాణ పల్లెలు సిద్ధంగా ఉన్నాయని అధినేత కేసీఆర్‌కు వివరిస్తున్నారు.
పోరాట కార్యాచరణకు వ్యూహాలు
ఐదు రోజులుగా సాగిన చర్చల్లో ప్రధానంగా నదీజలాల పంపిణీ, సాగునీరు, రైతాంగం సమస్యల మీద కేసీఆర్ దృష్టి సారించారు. తెలంగాణలోని గోదావరి పరీవాహక ప్రాంతాన్ని ఎడారిగా మార్చే, ఏపీ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణంపై కేసీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. బనకచర్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు పకడ్బందీ పోరాట కార్యాచరణ కోసం అనుసరించిన వ్యూహాలు, ఎత్తుగడలను అధినేత పార్టీ శ్రేణులకు వివరించారు. ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా పార్టీ ముఖ్య నేతలకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజల ఆదరణ పొందేందుకు క్షేత్రస్థాయిలో కార్యకర్తలను ఎప్పటికప్పుడు సమాయత్తం చేయాలని దిశా నిర్దేశం చేశారు. వారం రోజులుగా యశోద దవాఖాన, నందినగర్ నివాసం కేంద్రంగా కొనసాగుతున్న చర్చల్లో అధినేత కేసీఆర్ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటుండటంపై పార్టీ నేతలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో తిరిగి బీఆర్ఎస్ను గెలిపించే దిశగా అధినేత ఆదేశాలతో ముందుకు సాగుతామని ధీమా వ్యక్తంచేస్తున్నారు. కాగా, వైద్యుల సూచనల మేరకు మరోసారి వైద్యపరీక్షల కోసం గురువారం యశోద దవాఖానకు కేసీఆర్ వెళ్లనున్నారు.