హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ) : మేడిగడ్డ బరాజ్ కుంగుబాటుపై దాఖలైన ప్రైవేటు ఫిర్యాదుపై విచారణ చేపట్టాలని భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి తీసుకున్న నిర్ణయాన్ని నిలిపివేస్తూ గత నెల 24న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు మరోసారి పొడిగించింది. ఈ మేరకు జస్టిస్ కే లక్ష్మణ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కింది కోర్టులో ప్రైవేటు పిటిషన్ వేసిన సామాజిక కార్యకర్త నాగవల్లి రాజలింగమూర్తి తన వాదనలతో కౌంటర్ దాఖలు చేసేందుకు గడువు కావాలని ఆయన న్యాయవాది కోరడంతో తదుపరి విచారణ ఈ నెల 22కి వాయిదా పడింది.
కొత్తపల్లి, జనవరి 8: రాజకీయ కక్షసాధింపులో భాగంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు నమోదు చేస్తున్నదని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శించారు. బుధవారం ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడారు. అధికారం ఉన్నదని.. బీఆర్ఎస్ నాయకులపై అక్రమంగా కేసులు బనాయిస్తూ కాంగ్రెస్ భయాందోళనలకు గురిచేస్తున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమపై ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని అన్నారు. న్యాయస్థానాలపై తమకు అపారమైన నమ్మకం ఉన్నదని తెలిపారు. ఈ-కార్ రేసు కేసులో కేటీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఫార్ములా రేస్ ద్వారా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ని పెంచే విధంగా కేటీఆర్ కృషి చేసినట్టు తెలిపారు.