హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కానిస్టేబుల్ కిష్టయ్య ఆత్మార్పణ అజరామరఘట్టం. ఆయన ప్రాణత్యాగంతో ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబానికి తానున్నానని ఆనాడే మాట ఇచ్చిన కేసీఆర్ దానిని నిలుపుకొంటూ వస్తున్నారు. కిష్టయ్య మరణించే నాటికి ఆయన కొడుకు, కూతురు చిన్నపిల్లలు. వారి చదువు సహా ప్రతి కష్టకాలంలో కేసీఆర్ అండగా నిలిచారు. ఆ కుటుంబానికి గుండె ధైర్యమిస్తూ వారి బాగోగులు చూసుకుంటున్న కేసీఆర్, కిష్టయ్య బిడ్డ ప్రియాంక ఎంబీబీఎస్ చదువుకు అవసరమైన ఆర్థికసాయం అందించారు. తాజాగా ఎంబీబీఎస్ పూర్తిచేసిన ప్రియాంక ప్రస్తుతం పీజీ చదువుతున్నది. ఈ నేపథ్యంలో కాలేజీ ఫీజు నిమిత్తం రూ. 24 లక్షల ఫీజును ఆదివారం చెక్కు రూపంలో కేసీఆర్ ఆ కుటుంబానికి అందించారు. నందినగర్‌లోని తన ఇంటికి కిష్టయ్య కుటుంబాన్ని పిలిపించుకొని వారితో కలిసి భోజనం చేశారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు.
అమ్మకు కష్టం రాకుండా చూసుకోండి
‘రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేస్తూ నాయిన చనిపోయినప్పుడు మీరు చిన్న పిల్లలు. కష్టకాలంలోనూ అమ్మ మిమ్మల్ని ఎంతో కష్టపడి చదివించింది. ఇప్పుడు మీరు ప్రయోజకులయ్యారు. అమ్మకు ఏ కష్టం రాకుండా చూసుకోవాలి. మీకు ఏ సమయంలోనైనా నా సహకారం ఉంటుంది’ అని కేసీఆర్ భరోసా కల్పించి, వారి బాధ్యతలను గుర్తుచేశారు. ఈ సందర్భంగా తమ కుటుంబాన్ని ఇంటి పెద్దలా అదుకుంటున్న కేసీఆర్‌కు కిష్టయ్య కుటుంబం ధన్యవాదాలు తెలిపింది. తెలంగాణ కోసం త్యాగాలు చేసిన అమరులను తమ ప్రభుత్వంలో ఆదుకున్నామని, అదే స్ఫూర్తిని ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించాలని కేసీఆర్ సూచించారు.

తండ్రిలా అండగా నిలిచారు: కిష్టయ్య భార్య
‘నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరి పదేండ్లు పూర్తయింది. నా భర్త (పోలీస్ కిష్టయ్య) మా నుంచి దూరమై 15 ఏండ్లు గడిచిపోయినాయి. ఆనాడు చిన్న పిల్లలను పట్టుకొని తండ్రిలాంటి కేసీఆర్ సార్ దగ్గరకు వచ్చాను. ‘మీ కుటుంబానికి నేనున్నాను’ అని ఆనాడు కేసీఆర్ మాట ఇచ్చారు. ‘నువ్వు బాధపడకమ్మా. పిల్లలను నేను చూసుకుంటా’ అన్నరు. ఇచ్చిన మాట ప్రకారం నా పిల్లలకు, నా కుటుంబానికీ అన్ని విధాలా అండగా ఉన్నారు. నా బిడ్డ మెడికల్ కాలేజీలో చదువుకు డబ్బులు ఇస్తున్నారు. 6వ తరగతి నుంచి ఇప్పటి వరకు అన్ని విధాలా ఆసరా అందిస్తున్నారు’ అని కానిస్టేబుల్ కిష్టయ్య భార్య పేర్కొన్నారు.
కంటికి రెప్పలా చూసుకుంటున్నరు
‘మేము 6వ తరగతిలో ఉన్నప్పుడు మా నాన్న తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేశారు. మాకు ఊహ తెల్వని సమయంలోనే నాన్న చనిపోయారు. మీకు అన్ని విధాలుగా అండగా ఉంటానని ఆనాడు ఇచ్చిన మాటను కేసీఆర్ సార్ నిలబెట్టుకుంటూనే ఉన్నారు. చెల్లిని మెడిసిన్ చదివించారు. ఇవాళ పీజీ కోసం మళ్లీ డబ్బులు ఇచ్చారు. మా కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉండి, కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. మా నాన్న కల నెరవేరింది. కానీ, మా మధ్య మా నాన్న లేకపోవడం బాధగా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు పూర్తి కావడం సంతోషంగా ఉన్నది. మా నాన్న ఉంటే ఎంతో సంతోషించేవాడు’ అని కిష్టయ్య కొడుకు రాహుల్ పేర్కొన్నారు.