హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 21 (నమస్తే తెలంగాణ): ఇంద్రావతి నీళ్లను వాడుకుంటామని ఛత్తీస్‌గఢ్ ప్రకటించడం తెలంగాణకు నష్టదాయకమే అయినప్పటికీ అది నగ్న సత్యాన్ని కూడా మన ముందుకు తెచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం తమ్మడిహెట్టి బదులు మేడిగడ్డను బరాజ్ నిర్మాణానికి ఎంపిక చేయడం ఎంత కరెక్టో అది రుజవు చేసింది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డీపీఆర్‌లో తమ్మిడిహట్టి దగ్గర 165 టీఎంసీల నీటి లభ్యత ఉంటే అందులో 160 టీఎంసీలు మళ్లించుకుంటామని వైఎస్ ప్రభుత్వం డిజైన్ రూపొందించింది. కానీ కేంద్ర జల సంఘం అన్ని లెక్కలు తీసి 165 టీఎంసీల లభ్యత నిజమే అయినప్పటికీ ఎగువన మహారాష్ట్రకు హక్కుభుక్తంగా కేటాయించిన 63 టీఎంసీలు ఇంకా వాడుకోవడం లేదు.
ఇకముందు వాళ్లు వాడుకుంటే ఇందులో లోటు ఏర్పడుతుందని స్పష్టంగా 2015లోనే తన లేఖలో చెప్పింది. తద్వారా 102 టీఎంసీల నీటి లభ్యతనే ఉన్నదని, అందునా తమ్మిడిహట్టి దగ్గర బరాజ్‌ను 152 మీటర్ల ఎత్తులో నిర్మిస్తేనే సుమా! అని కూడా హెచ్చరించింది. అందుకే కేసీఆర్ ప్రభుత్వం వ్యాప్కోస్ నివేదిక ప్రకారం దిగువ న మేడిగడ్డ దగ్గర ప్రధాన బరాజ్ నిర్మాణాన్ని చేపట్టింది. ఇక్కడ 284.3 టీఎంసీల నీటి లభ్యత ఉందని కేంద్ర జల సంఘం నిర్ధారించి హైడ్రాలజికల్ అనుమతులు కూడా ఇచ్చింది.
కేంద్ర జల సంఘం హెచ్చరికను విస్మరించినట్లయితే ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌పై ఇంద్రావతి ప్రాజెక్టు కడుతున్నట్టు రేపు ప్రాణహిత ఉపనదులపై మహారాష్ట్ర ప్రాజెక్టులు కట్టి 63 టీఎంసీలు వాడుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారేది. అంటే, ఎగువ రాష్ర్టాలు తమ కేటాయింపుల్ని ఏదో ఒకరోజు వాడుకుంటాయనేది వాస్తవం. అందుకు నిదర్శనమే ఛత్తీస్‌గఢ్. ఆ రాష్ట్రం తన 147.86 టీఎంసీలను వాడుకోనందున ఆ నీటిని కావేరీకి పట్టుకుపోతామని కేంద్రం నివేదికలో చె ప్పింది. కానీ అదే కేంద్రం ఇప్పుడు ఛత్తీస్‌గఢ్ రూ.49 వేల కోట్లతో చేపట్టే రెండు ప్రాజెక్టులకు అనుమతినిచ్చింది. అంటే తన కేటాయింపును వాడుకోనుంది.
గోదావరిలో ఛత్తీస్‌గఢ్ వినియోగించుకోలేకపోతున్న 147.86 టీఎంసీల మిగులు జలాలను గోదావరి-కావేరీ అనుసంధానం కింద తమిళనాడుకు తరలిస్తామని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) జీసీ లింకు ప్రాజెక్టు నివేదికలో స్పష్టం చేసింది. దీంతో వెంటనే అప్రమత్తమైన ఛత్తీస్‌గఢ్.. ‘మా నీళ్లు మేం వాడుకోకపోవడమేంది?!’ అని ఇంద్రావతి (గోదావరి సబ్‌బేసిన్)పై రెండు ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. రూ. 29వేల కోట్లతో బోధ్‌ఘాట్ ఆనకట్ట, రూ.20వేల కోట్లతో మహానది-ఇంద్రావత్తి లింకు ప్రాజెక్టుల్ని తయారుచేసింది. 359 గ్రామాల పరిధిలోని 9.45 లక్షల ఎకరాలకు తాగు, సాగునీటితో పాటు పారిశ్రామిక అవసరాలకు 140 టీఎంసీల వరకు వినియోగించుంటామని కేంద్రం ముందు ప్రతిపాదనలు ఉంచింది. కేంద్ర ప్రభుత్వం సైతం అనుమతినిచ్చిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ప్రకటించారు.
– గోదావరి బేసిన్లో తెలంగాణకు ఎగువన ఉన్నది ఛత్తీస్‌గఢ్.
బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం గోదావరిలో ఆంధ్రప్రదేశ్‌కు సంక్రమించిన నీటి కేటాయింపులు 518 టీఎంసీలు. ఇప్పటికే ఆ రాష్ట్రం ధవళేశ్వరం, పోలవరంతో పాటు ఇతర ప్రాజెక్టుల కింద కేటాయింపుల కంటే ఎక్కువ నీటిని వాడుకుంటున్నది. అయినప్పటికీ కేంద్రంలోని బీజేపీ తమిళనాడుకు గోదావరి జలాలను తరలిస్తామని అనడంతో వెంటనే పోలవరం నుంచి 200 టీఎంసీల గోదావరి జలాలతో బనకచర్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ఇతర బేసిన్లలోని ప్రతి మూలకు గోదావరిని తరలించి తాగు, సాగునీటిని అందించేందుకు రూ. 80వేల కోట్లతో బనకచర్ల ప్రాజెక్టు నివేదికను ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా ఢిల్లీ వెళ్లి కేంద్రానికి సమర్పించారు. ఈ మేరకు ఇప్పటికే కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ టీవోఆర్‌ను ఖరారు చేసి సూత్రప్రాయంగా ప్రాజెక్టుకు అనుమతినిచ్చింది.
– గోదావరి బేసిన్లో తెలంగాణకు దిగువన ఉన్నది ఆంధ్రప్రదేశ్.
ఎగువన ఛత్తీస్‌గఢ్ తన హక్కుని కాపాడుకునేందుకు వెంటనే రంగంలోకి దిగింది. దిగువన ఆంధ్రప్రదేశ్ సందట్లో సడేమియాలో తన వాటా కంటే ఎక్కువ నీటిని వాడుకునేందుకు సిద్ధమైంది. అంటే నడుమన ఉన్న తెలంగాణ నోట్లోనే మట్టి!! అందరినీ మభ్య పెట్టి సముద్రంలో కలిసే వృథాజలాలే అని ఏపీ సీఎం చంద్రబాబు సూత్రీకరిస్తున్నారు. కానీ అసలు గోదావరిలో 3 వేల టీఎంసీల వృథా అనేదే ఒట్టి బూటకం. ఇందులో సింహభాగం బేసిన్‌లోని రాష్ర్టాలు వాడుకోకుండా ఉన్న నీళ్లే దిగువకు వెళ్లి సముద్రంలో కలుస్తున్నాయి. అంతమాత్రాన అవి వృథా, మిగులు జలాలు కావు. ఎగువన రాష్ర్టాలు వాడుకోకపోవడంతో వరద రూపంలో సముద్రంలోకి పోతున్నాయంతే. ఈ క్రమంలో ఒక రాష్ట్ర ప్రభుత్వంగా రేవంత్ సర్కారు లోతుగా అధ్యయనం చేసి రాబోయే ముప్పును నివారించాల్సిందిపోయి కావేరీకి గోదావరిజలాల తరలింపుపై నేటికీ పల్లెత్తు మాట్లాడటం లేదు. ఏపీ బనకచర్లపై ఏకంగా తానే ఒకడుగు ముందుకేసి చర్చలకు ఆహ్వానిస్తాననడం తెలంగాణ రైతాంగంలో ఆందోళన కలిగిస్తున్నది.