Medical Colleges | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): 1963లో నాగాలాండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యింది. గడిచిన 60 ఏండ్లలో ఆ రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ కూడా ప్రారంభంకాలేదు. ఘనచరిత్ర ఉందని చెప్పుకొనే కాంగ్రెస్, తమకు తిరుగేలేదని గప్పాలకుపోయే ఎన్డీయేలు ఆ రాష్ట్రంలో ఏండ్లపాటు అధికారం వెలగబెట్టాయి. అయినప్పటికీ, ఇప్పటివరకూ ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీని తీసుకురాలేకపోయాయి. హక్కుల కార్యకర్తలు, స్థానికుల డిమాండ్‌తో ఎట్టకేలకు రాజధాని కోహిమాలో 100 ఎంబీబీఎస్ సీట్లతో తొలి మెడికల్ కాలేజీ.. నాగాలాండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రిసెర్చ్ (ఎన్ఐఎంఎస్ఆర్) ఇటీవల ప్రారంభమైంది. అయితే, 60 ఏండ్లలో నాగాలాండ్‌లో ఒక్క మెడికల్ కాలేజీ ప్రారంభమవ్వగా, రాష్ట్రం ఏర్పడిన తొమ్మిది ఏండ్లలోనే తెలంగాణలో 21 మెడికల్ కాలేజీలు ప్రారంభంకావడం ప్రస్తుతం చర్చనీయాంశమవుతున్నది.
తెలంగాణ ఏర్పడేనాటికి 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. దీంతో సీఎం కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలోనే నాలుగు మెడికల్ కాలేజీలను స్థాపించారు. కిందటేడాది 8, ఇటీవల మరో తొమ్మిది కాలేజీలను ప్రారంభించారు. మొత్తంగా తొమ్మిదేండ్లలో 21 మెడికల్ కాలేజీల ప్రారంభంతో వీటి సంఖ్య 26కు చేరింది. తొమ్మిదేండ్లలో ఇన్ని మెడికల్ కాలేజీలు తెలంగాణ మినహా దేశంలో మరే రాష్ట్రంలో ప్రారంభం కాకపోవడం గమనార్హం. వచ్చే ఏడాది మరో 8 మెడికల్ కాలేజీలు ప్రారంభం కానున్నాయి. వీటికి సంబంధించి ఇప్పటికే అనుమతులు మంజూరయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు కలిపితే 2014కు ముందు తెలంగాణలో 20 మెడికల్ కాలేజీలు, 2,850 సీట్లు మాత్రమే ఉండేవి. ఈ ఏడాది ఆ సంఖ్య 56కు పెరిగింది. సీట్లు 8,340కు చేరాయి. వచ్చే ఏడాది కోసం ప్రభుత్వం ఇప్పటికే మరో 8 మెడికల్ కాలేజీలను మంజూరు చేసింది. అవి కూడా కలిపితే, సీట్ల సంఖ్య 9,140కి (192 శాతం) చేరుతుంది. వచ్చే ఏడాది అందుబాటులోకి వచ్చే ప్రైవేటు కాలేజీలను కూడా కలిపితే రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య పదివేలు దాటనున్నది.
2014 5 మెడికల్ కాలేజీలు
2023 26 మెడికల్ కాలేజీలు
పెరుగుదల: 420 శాతం
1946-47 ఉస్మానియా, హైదరాబాద్
1954-55 గాంధీ, హైదరాబాద్
2022-23 మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి
2023-24 కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయంశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగామ.
1959-50 కాకతీయ మెడికల్ కాలేజీ, వరంగల్
2016-17 మహబూబ్‌నగర్, సిద్దిపేట
2018-19 నల్లగొండ, సూర్యాపేట
2024-25 (రాబోయే కాలేజీలు) జోగులాంబ గద్వాల, నారాయణపేట, ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి.