కొమురవెల్లి ఆలయ భూములకు ఎసరు!
కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవస్థాన భూములపై ప్రభుత్వం కన్నుపడింది. ఆలయ అభివృద్ధి కోసం గత కేసీఆర్ సర్కార్ 131.09 ఎకరాలను కేటాయించగా, అందులో కొంత స్థలాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇతర శాఖలకు వినియోగించాలని చూస్తున్నది.
- దేవుని భూములు అభివృద్ధికా? ఇతర శాఖలకా?
- నాడు 131 ఎకరాలు కేటాయించిన కేసీఆర్ సర్కార్
- తాజాగా ఇతర అవసరాలకు బదలాయిస్తున్న ప్రభుత్వం?
- ఆలయ అభివృద్ధిపై సందిగ్ధం.. భక్తుల్లో తీవ్ర ఆందోళన
సిద్దిపేట, జూలై 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవస్థాన భూములపై ప్రభుత్వం కన్నుపడింది. ఆలయ అభివృద్ధి కోసం గత కేసీఆర్ సర్కార్ 131.09 ఎకరాలను కేటాయించగా, అందులో కొంత స్థలాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇతర శాఖలకు వినియోగించాలని చూస్తున్నది. ఇప్పటికే సిద్దిపేట కలెక్టర్ హైమావతి మౌఖిక ఆదేశాల మేరకు కొమురవెల్లి తహసీల్దార్ రాజీవ్ రహదారి పక్కన ఐదెకరాలు చదును చేయించారు. దేవస్థాన అభివృద్ధి కోసం కేటాయించిన భూములను ఇతర ప్రయోజనాలకు మళ్లించడం వల్ల భవిష్యత్తులో ఆలయ విస్తరణకు ఆటంకం ఏర్పడుతుందని భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఏటా లక్షలాది మంది భక్తులు తరలివచ్చే ఈ ఆలయంలో వసతిగృహాలు, పారింగ్ స్థలాలు, వాణిజ్య సముదాయాలు, ఉద్యానవనాలు ఏర్పాటుచేయాలని నిర్ణయించి భవిష్యత్తు అవసరాల కోసం గత సర్కార్ ఈ భూములను కేటాయించింది. నాడు దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా అప్పగించిన భూములను కాంగ్రెస్ సర్కార్ ఇతర శాఖలకు బదలాయిస్తే ఆలయ అభివృద్ధి కుంటుపడుతుందని మల్లన్న భక్తులు మండిపడుతున్నారు.
131.09 ఎకరాలు కేటాయించిన కేసీఆర్ ప్రభుత్వం
రాష్ట్రంలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా వెలుగొందుతున్న కొమురవెల్లి ఆలయ అభివృద్ధి కోసం కొంత భూమిని కేటాయించాలని అర్చకులు, భక్తులు, స్థానిక ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు గత కేసీఆర్ సర్కార్ 2014 డిసెంబర్లో తొలుత 166 ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అందులో వివాదాలు లేనివి 131.09 ఎకరాలు ఉండటంతో ఆ భూమిని దేవస్థానం పేరున మార్పిడి చేసింది. మార్పు చేసిన ప్రకారం కొమురవెల్లిలో 76.28 ఎకరాలు, కిష్టంపేటలో 27.16 ఎకరాలు, రామ్సాగర్లో 11.01 ఎకరాలు, వేచరేణిలో 10.04 ఎకరాలు, గౌరాయపల్లిలో 6 ఎకరాల భూమి స్వామి వారి పేరిట ఉన్నది. ఈ భూముల దస్ర్తాలు భద్రంగా ఉన్నా, వాటికి హద్దులు నిర్ణయించడంలో రెవెన్యూ అధికారుల అలసత్వం వల్ల రోజురోజుకూ అన్యాక్రాంతం అవుతున్నాయి. దేవస్థానం పేరున పట్టా మార్పు చేయాలని దేవాలయ అధికారులు రెవెన్యూ అధికారులను పలుమార్లు కోరారు. ఇప్పటివరకు ఎలాంటి హద్దులు నిర్ణయించక పోవడంతో ఆలయ భూములు ఇతర ప్రభుత్వ అవసరాలతో పాటు పక్కన ఉన్న రియల్టర్ల పరమవుతున్నాయి.
రాజీవ్ రహదారిని ఆనుకొని 5 ఎకరాల భూమికి ఎసరు?
హైదరాబాద్-సిద్దిపేట-కరీంనగర్ రాజీవ్ రహదారిని ఆనుకొని కొమురవెల్లి కమాన్ వద్ద ఉన్న స్వామి వారి భూమిని ఇతర ప్రభుత్వ శాఖలకు కేటాయించేందుకు భూమిని చదును చేస్తున్నారు. కొమురవెల్లి గ్రామ సర్వే నెం.438/1లో కేటాయించిన 7 ఎకరాల భూమిని రెవెన్యూ శాఖ అధికారులు తిరిగి తీసుకోవడానికి చర్యలు చేపట్టారు. ఇప్పటికే 2 ఎకరాల విస్తీర్ణంలో కస్తూర్బా పాఠశాలను నిర్మించగా తాజాగా మరో 5 ఎకరాలను తీసుకుంటున్నది. ఆలయ భూములను ఇతర శాఖలకు కేటాయిస్తే, భవిష్యత్తు అవసరాలకు స్థలం ఉండదని భక్తులు ఆందోళన చెందుతున్నారు. వాటిని ఆలయ అభివృద్ధికి మాత్రమే వినియోగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై ఈవో సుధాకర్రెడ్డిని వివరణ కోరగా గత ప్రభుత్వం కేటాయించినప్పటి నుంచి ఆ భూమి దేవస్థాన పరిధిలోనే ఉన్నదని, ప్రత్యేక ఏజెన్సీ ద్వారా సర్వే చేయించి హద్దులు నిర్ణయించే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.
తహసీల్ కార్యాలయం కోసమే
సదరు భూమిని గతంలో ఆలయానికి ఇచ్చి ఉండవచ్చు. ఎండోమెంట్ గెజిట్లో గానీ, వారి జీవోల్లో గానీ ఆ వివరాలు లేవు. అది ప్రస్తుతం ప్రభుత్వ భూమి కిందనే ఉన్నది. ప్రస్తుతానికి ఆఫీస్ బిల్డింగ్స్ కోసం ఎకడా స్థలం అందుబాటులో లేదు. కొత్తగా మంజూరైన ఎంఆర్వో ఆఫీస్ బిల్డింగ్ కోసం ఒక ఎకరం 20 గుంటల భూమి అవసరం. అందుకే ఈ భూమిని ప్రపోజల్ కోసం ఎంపిక చేశాం.
– దివ్య, కొమురవెల్లి తహసీల్దార్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

