హైదరాబాద్: ఫార్ములా-ఈ కారు రేసు కేసులో విచారణ నిమిత్తం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఏసీబీ ఆఫీస్‌కు చేరుకున్నారు. అయితే న్యాయవాదులతో కలిసి విచారణకు రావడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏసీబీ ఆఫీస్ ప్రధాన గేటు వద్దే కేటీఆర్ కారును అడ్డుకున్నారు. దీంతో సుమారు 45 నిమిషాలపాటు అక్కడే వేచి ఉన్నారు. తనను అడ్వొకేట్ల సమక్షంలోనే విచారించాలని పట్టుబట్టారు. పోలీసులు అనుమతించకపోవడంతో విచారణకు హాజరు కాకుండా అక్కడి నుంచి వెనుతిరిగారు. అయితే ఈ క్రమంలో తన లిఖితపూర్వక స్టేట్మెంట్ను ఏసీబీ డీఎస్పీకి అందించారు. అందులో ఏముందంటే..
ఏసీబీ తనపై నమోదు చేసిన కేసులో తాను తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన విషయాన్ని అందులో ప్రస్తావించారు. అలాగే ‘తనకు పంపిన నోటీసులు కేసుకు సంబంధించి తన నుంచి సమాచారంతోపాటు సంబంధిత పత్రాలను ఏసీబీ కోరింది. అయితే అవి ఎలాంటి పత్రాలో స్పష్టత ఇవ్వలేదు. అవి ఎలాంటి పత్రాలో స్పష్టత ఇచ్చి.. తనకు కొంత సమయం ఇవ్వాలని అందులో కోరారు. అదేవిధంగా రాజ్యాంగం, చట్టం తనకు కల్పించిన హక్కులను వినియోగించుకుంటూనే.. కేసు దర్యాప్తునకు హాజరై సహరిస్తానని తెలిపారు. అయితే హైకోర్టులో తాను వేసిన క్వాష్ పిటిషన్ తీర్పు రిజర్వులో ఉందని, తీర్పు వచ్చేదాకా తనకు గడువు ఇచ్చే అవకాశం పరిశీలించాలని’ ఏసీబీ డీఎస్పీ మజిద్ ఖాన్ని కోరారు.
కాగా, ఏసీబీ ప్రధాన కార్యాలయం వద్ద తన న్యాయవాదిని పోలీసులు అడ్డుకోవడంపై కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఏసీబీ కార్యాలయానికి రమ్మన్నారు. అడుగుతున్న సమాచారం మొత్తం ప్రభుత్వం వద్దే ఉంది. గతంలో ఒక మంత్రిగా, ప్రభుత్వంలో నేను నిర్ణయం తీసుకున్నా. నా వద్ద సమాచారం ఉందని అపోహ పడుతున్నారు. నా వాదనను ఇప్పటికే హైకోర్టులో చెప్పా. న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. హైకోర్టు, చట్టాలు, రాజ్యాంగంపై గౌరవంతో ఏసీబీ ఆఫీస్‌కు వచ్చా.
నా లాయర్‌ను నాతో రావొద్దని చెబుతున్నారు. రాజమౌళి కంటే మంచి కథలు రాస్తున్నారు. మిమ్మల్ని నమ్మను అని పోలీసులతో చెప్పా. టాలీవుడ్ దర్శకుల కంటే కొత్త కొత్త కథలు రాస్తున్నారని అన్నాను. న్యాయవాదిని తీసుకెళ్లడం రాజ్యాంగపరంగా నాకు ఉన్న హక్కు. నేను మర్యాదగా విచారణకు సహకరిస్తున్నా. ఇంతమంది పోలీసులు ఎందుకు? న్యాయవాదిని అనుమతించబోమని ఏసీబీ వాళ్లు చెప్పాలి. పోలీసులు ఎందుకు చెబుతున్నారు. హైకోర్టులో ఏసీబీ వాళ్లు గంటలు గంటలు వాదనలు వినిపించారు. ఇవాళ కొత్తగా శోధించి.. సాధించేదేమీ లేదు.
రైతు భరోసా ఎగ్గొట్టారు. దాని నుంచి దారి మళ్లించేందుకే ఈ నాటకాలు. ఇలాంటి నాటకాలకు భయపడం, బాధపడం. నేను ఇక్కడికి రాగానే మా ఇంటిపై దాడులు చేయిస్తారన్న సమాచారం ఉంది. రేవంత్ ఇచ్చిన 420 హమీలు అమలు చేసే వరకు కొట్టాడుతాం. కేసులు ఎన్ని పెట్టినా భయపడేది లేదు. నాతోపాటు లాయర్లు ఉంటే వాళ్లకు వచ్చిన నష్టం ఏంటి? అని కేటీఆర్ ప్రశ్నించారు.