ఎనిమిదేండ్లు ఓపిక పట్టి, మోదీ పాలన నాడిపట్టి, దేశ ప్రజల మనోభావాలను కనిపెట్టి కేసీఆర్ చేసిన విశ్లేషణ దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నది. మోదీ తీరుపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలనీ, జరుగుతుందనీ కేసీఆర్ వేసిన అంచనా నూటికి నూరుపాళ్లూ నిజమైంది.
‘నరేంద్ర మోదీకి దేశ ప్రజలు రెండు పర్యాయాల్లో పదేండ్లు సమయమిచ్చారు. అందులో 8 ఏండ్లు.. అంటే 80 శాతం సమయం గడిచిపోయింది. ప్రధానిగా మోదీ ఈ దేశానికి చేసిందేమీ లేదు. అధికార దుర్వినియోగం, సమాఖ్య స్ఫూర్తిని దెబ్బకొట్టడం, మత విద్వేషాల చిచ్చుపెట్టడం, ప్రజల బతుకుల్ని భారం చేయడం తప్ప! 2022 కల్లా చేస్తామని ఇచ్చిన ఏ హామీనీ ఆయన నెరవేర్చలేదు. మిగిలిన రెండేండ్లలో ఆయన చేయగలిగింది కూడా ఏమీ లేదు. బీజేపీ పాలనలో దేశం వినాశనం దిశగా సాగుతున్నది. అందువల్ల బీజేపీని గద్దెదించడం నేటి కర్తవ్యం’. .. ఇదీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 1న ఎగరేసిన జాతీయ ఎజెండా!
హైదరాబాద్, ఫిబ్రవరి 16 : పట్టుమని పదిహేను రోజులు కాకముందే, చర్చ కేసీఆర్ చుట్టూ, ఆయన ప్రతిపాదించిన ఎజెండా చుట్టూ కేంద్రీకృతమవుతున్నది. బీజేపీపై కేసీఆర్ లేవనెత్తిన అభ్యంతరాలన్నీ నూటికి నూరుపాళ్లూ నిజమని, కమల నాథులపై ఆయన పోరాటానికి తమ మద్దతు ఉంటుందనీ జాతీయస్థాయిలో విపక్షాలు ఒకదాని తర్వాత మరొకటిగా సంఘీభావం ప్రకటిస్తున్నాయి. తొలుత సీపీఎం అగ్రనేతలు ఏచూరి, కారత్, కేరళ సీఎం విజయన్.. కేసీఆర్‌ను కలిసి మద్దతు తెలియజేయగా, తర్వాత ఆర్జేడీ యువ నాయకుడు తేజస్వియాదవ్ వచ్చి కేసీఆర్‌ను కలిశారు. బీహార్ మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్ కేసీఆర్‌తో ఫోన్లో మాట్లాడి మద్దతు తెలిపారు. ఆ తర్వాత డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, తృణమూల్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, శివసేనాధిపతి, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, మాజీ ప్రధాని, జేడీయూ (ఎస్) నాయకుడు దేవెగౌడ, సీపీఐ అగ్రనేత డీ రాజా, దక్షిణాది రాష్ర్టాల రైతు సంఘాల నాయకులు, తదితరులంతా కేసీఆర్ పోరాటానికి మద్దతు పలికారు.
రాజకీయాలు, ఎన్నికల్లో గెలుపు, పదవుల సాధన, పార్టీ విస్తరణ అనే సంకుచిత లక్ష్యాల కోసం కాకుండా, మన దేశమిది.. మన ధర్మమిది.. అంటూ విశాల దృక్పథంతో కేసీఆర్, అనేక అంశాలను లోతైన అవగాహనతో చర్చకు ప్రతిపాదించడం, వీటి సాధనకు అందరం కలసికట్టుగా నడవాల్సిన అవసరం ఉన్నదని ప్రకటించడం వివిధ రాజకీయ పక్షాల్లో పట్టువిడుపులకు కారణమైంది. తాత్కాలికమైన అభిప్రాయ భేదాలను పక్కనబెట్టి, బీజేపీ- మోదీ అసలు రంగును బయటపెట్టడంలో, దేశానికి కొత్త దశ- దిశ చూపడంలో కలసికట్టుగా వ్యవహరించడానికి సిద్ధమని వివిధ పక్షాలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నాయి. ఈ మేరకు కేసీఆర్‌కు సందేశాలు పంపుతున్నాయి. చర్చలకు ప్రతిపాదనలు చేస్తున్నాయి. బీజేపీ అజేయమైనదనే భావన సర్వత్రా వ్యాప్తి చెందిన సమయంలో, మోదీ పాలనలోని డొల్లతనాన్ని ససాక్ష్యంగా, వీడియో క్లిప్పింగులు, పార్లమెంటు తీర్మానాలు, బిల్లుల ముసాయిదాల సాక్షిగా కేసీఆర్ బయటపెడుతున్న తీరు వివిధ వర్గాలను ఆకట్టుకుంటున్నది. ఆలోచింపజేస్తున్నది. తెలుగు, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ.. నాలుగు భాషల్లోనూ అనర్గళమైన ప్రావీణ్యంతో కేసీఆర్ చేస్తున్న విమర్శల క్లిప్పులు దేశమంతా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ‘అమెరికా ఎన్నికలేమైనా అహ్మదాబాద్ మున్సిపల్ ఎన్నికలా? వాటితో మనకేం పని? అక్కడికెళ్లి అబ్కీ బార్ ట్రంప్‌కీ సర్కార్ అని ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ట్రంప్ ఓడిపోయాడు. మరి మన దేశం పరిస్థితి ఏమిటి? ఇది చేయకూడదన్న సంగతి భారతదేశ విదేశాంగ విధాన రూపకర్తలకు తెలియదా? ఇంత అజ్ఞానమా?’ అంటూ కేసీఆర్ సంధించిన ప్రశ్న అటు దౌత్యవేత్తలు మొదలుకుని, ఒక మోస్తరు విద్యావంతుల దాకా అందరినీ ఆలోచింపజేసింది.
గత కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్‌ను అల్లుకుని రాజకీయాలు సాగిస్తున్న వామపక్ష పార్టీలు, వామపక్ష మేధావులు ఇప్పుడు కేసీఆర్ అభిమానులుగా మారుతున్నారు. కాంగ్రెస్ నాయకత్వం చేవగారిపోయిన ఈ సమయంలో, కేసీఆర్ రూపంలో మోదీకి సరైన ప్రత్యర్థి దొరికాడని వారు ప్రశంసిస్తున్నారు. ‘మత విద్వేషాలు, భావోద్వేగాలు, దేశభక్తి ప్రచారాలు, అబద్ధాలు, సోషల్ మీడియా మాయల ఆధారంగా బీజేపీ ఎలా థాట్ పోలీసింగ్ చేస్తున్నదో, దేశ ప్రజానీకంతో ఎలా మైండ్ గేమ్ ఆడుతున్నదో కేసీఆర్ చెప్పినట్టుగా ఇప్పటిదాకా ఎవరూ చెప్పలేదు. ఆయన గొప్ప కమ్యూనికేటర్. ఆయన దాడితో బీజేపీ డిఫెన్స్‌లో పడిపోతున్నది’ అని వామపక్ష మేధావి ఒకరు విశ్లేషించారు. ‘బీజేపీ ఇప్పటిదాకా హిందూ మతానికి, దేశభక్తికి తనను తాను చిరునామాగా ప్రచారం చేసుకున్నది. సైనికుల వీరోచిత పోరాటాన్ని తన రాజకీయ ఖాతాలో వేసుకున్నది. హిందుత్వానికి బీజేపీకి ఏం సంబంధం? సైనికుల త్యాగాలను బీజేపీ తన ఘనతగా ఎలా చెప్పుకొంటుంది? నేను హిందువును కాదా? నేను సైనికుల త్యాగాలను సమర్థించడం లేదా? అని మూడు భాషల్లో కేసీఆర్ సంధించిన ప్రశ్న… దేశాన్ని సూటిగా తాకింది. బీజేపీ అసలు రంగు కరగడం ఇప్పుడిప్పుడు మొదలువుతున్నది’ అని ఓయూలోని ఒక ప్రొఫెసర్ వ్యాఖ్యానించారు. ‘మత చిచ్చుతో సిలికాన్ వ్యాలీని కశ్మీర్ వ్యాలీ చేస్తారా? రామానుజ విగ్రహాన్ని మోదీ కట్టించాడా? దేశ ప్రధాని ఇలా ఎన్నికలకో వేషం వేయడమేమిటి? భవిష్యత్తు యువతది, ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వారిది’ అంటూ కేసీఆర్ సంధించిన బాణాలు టెకీల్లో, యువకుల్లో ఆలోచనను రేకెత్తింపజేస్తున్నాయి. అందుకే నెటిజన్ల వ్యూయర్‌షిప్పే ప్రధానంగా సాగే దేశంలోని ప్రధాన న్యూస్ వెబ్సైట్లన్నీ కేసీఆర్ వ్యాఖ్యల్ని ప్రముఖంగా ప్రచురిస్తున్నాయి. ప్రత్యేక వ్యాసాలు, చర్చా గోష్ఠులు నిర్వహిస్తున్నాయి. జనగామ, భువనగిరి వంటి బహిరంగ సభల్లో కేసీఆర్ మాట్లాడిన మాటలు కూడా నిముషాల వ్యవధిలో ట్రెండ్ అవుతున్నాయంటే, వార్తా సంస్థల వారు, నెటిజన్లు ఆయన్ను ఎంతగా ఫాలో అవుతున్నారో అర్థం చేసుకోవచ్చు.
సంఘ్పరివార్లోనూ చర్చ
బీజేపీకి నీడలా ఉండి నడిపించే సంఘ్‌పరివార్‌లో, తాజా పరిణామాలపై కీలక చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ‘తెలంగాణ- కేసీఆర్ విషయంలో మా పార్టీ వ్యూహ రాహిత్యంతో వ్యవహరించినట్టు స్పష్టమవుతున్నది. ధాన్యం కొనుగోలుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్‌తో మొదలైన తప్పిదం, తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోదీ రాజ్యసభలో చేసిన వ్యాఖ్యతో పరాకాష్ఠకు చేరింది. హుజూరాబాద్ ఎన్నికతో మాకు వచ్చిందనుకున్న అడ్వాంటేజ్ పూర్తిగా పోయింది. ప్రశ్నించి ఇరకాటంలో పెట్టే స్థితి నుంచి మేమిప్పుడు సంజాయిషీ ఇచ్చుకునే పరిస్థితిలో పడ్డాం. ఇది కేవలం మా స్వయంకృతం. వడ్లపై బండి సంజయ్ అయినా, తెలంగాణ ఏర్పాటుపై మోదీ అయినా అసందర్భ ప్రేలాపనలు చేశారు. అవి పూర్తిగా అనవసరమైనవి’ అని హైదరాబాద్‌లోని ఆరెస్సెస్ ముఖ్యుడొకరు విశ్లేషించారు. ‘హైందవ ధర్మం విషయంలో కేసీఆర్‌ను మేం కొట్టలేం. తెలంగాణ అభివృద్ధి కండ్లకు కనబడుతున్న వాస్తవం. దేశ పరిస్థితి కంటే తెలంగాణ, కేంద్రమే ప్రకటించిన అనేక పారామీటర్లలో ముందున్నది. తెలంగాణలో అమలవుతున్న పథకాల్లో అనేకం కేంద్రంలోనూ లేవు, బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనూ లేవు. అమర జవాన్లను ఆదుకోవడంలోనైనా, దేవాలయాల అభివృద్ధిలో అయినా మేం కేసీఆర్ తర్వాతే. ఇలాంటప్పుడు మా నాయకులు సరైన అస్త్రశస్ర్తాలు లేకుండా కేసీఆర్‌పై ఎందుకు దాడి మొదలుపెట్టారో అర్థం కావడం లేదు’ అని ఆయన తలపట్టుకున్నారు. కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేస్తాం అంటూ తమ నేతలు చేసిన బెదిరింపులు వికటించి, దమ్ముంటే వేయండి చూద్దాం అన్న సవాల్‌కు దారితీశాయని, ఇప్పుడిక తాము గట్టిగా దాడి చేయలేని అశక్తతలోకి జారిపోయామని కూడా ఆయన అన్నారు.
అనవసరంగా కదిపామా!
8 ఏండ్ల పాటు తెలంగాణ అభివృద్ధే టార్గెట్‌గా పని చేసుకుపోతున్న కేసీఆర్‌ను అనవసరంగా కదిలించడం, ఇప్పుడు దేశవ్యాప్త రాజకీయ పునరేకీకరణకు, కొత్త సమీకరణాలకు దారితీస్తున్నదన్న చర్చ బీజేపీలోనూ సాగుతున్నట్టు ఆ పార్టీకి చెందిన వారే చెబుతున్నారు. ‘కేసీఆర్ ఒకసారి గురిపెడితే ఇక వదలకుండా అదే పని మీద ఉంటారన్న సంగతి మాకు తెలుసు. మేం దుబ్బాకలో గెలిచి, జీహెచ్ఎంసీలో బాగా డివిజన్లు సాధించామని సంబరపడగానే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా సిట్టింగ్ సీటు కొట్టేసి కేసీఆర్ ప్రతికారం తీర్చుకున్నారు. సాగర్‌లో డిపాజిట్ దక్కకుండా, మున్సిపోల్స్‌లో సీట్లు రాకుండా చూశారు. ఇప్పుడు హుజూరాబాద్‌లో గెలిచామన్న సంబరం లేకుండా, జాతీయ స్థాయిలో ఇరకాటంలో పెట్టారు. కేసీఆర్ సంగతి మాకు తెలుసు. అందుకే ఇన్నేండ్లుగా మేం పెద్దగా ఆయన జోలికి పోలేదు. కానీ మా రాష్ట్ర నాయకత్వం చేసిన తప్పులు, కేసీఆర్ మమ్మల్ని టార్గెట్ చేసే పరిస్థితి కల్పించాయి. ఇది ఎటువైపు దారితీస్తుందో తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం. కేవలం 15 రోజుల వ్యవధిలో కేసీఆర్‌కు ఈ స్థాయిలో మద్దతు లభించడం, ఆయన కేంద్ర బిందువుగా దక్షిణాది నుంచి ఉత్తరాది దాకా పార్టీలు చేతులు కలుపుతుండటం, పుట్టిన రోజు సందర్భంగా గుజరాత్లో, యూపీలో, బెంగళూరులో ఆయన పోస్టర్లు వెలవడం మాత్రం అనూహ్యం.
జాతీయ మీడియాలో ఆయనకు దక్కుతున్న స్పేస్, మాపై వ్యతిరేకతనే కాదు; కేసీఆర్కున్న పాపులారిటీని కూడా నిరూపిస్తున్నది’ అని బీజేపీ ముఖ్యుడొకరు విశ్లేషించారు. సుదీర్ఘ అనుభవంతో రాజకీయ ఎత్తుగడల్లో ఆరితేరిన కేసీఆర్‌ను ఢీకొట్టడానికి రాష్ట్ర నేతలు ఎంతమాత్రం సరిపోరని తెలుగు పాత్రికేయుడొకరు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతానికి బీజేపీ అగ్ర నాయకత్వం కేసీఆర్ మాటలపై మౌనం వహిస్తున్నది. కేంద్ర మంత్రి అనురాగ్ఠాకూర్, అస్సాం సీఎం హేమంత్ బిశ్వశర్మ వంటివారు మాత్రమే నేరుగా స్పందించారు. అటు ధాన్యం విషయంలోనైనా, ఇటు వ్యవసాయ మోటర్లకు కరెంటు మీటర్ల విషయంలోనైనా కేంద్ర ప్రభుత్వం తనవైపు వివరణ ఇవ్వడానికి మాత్రమే పరిమితమైంది. విపక్షాల విమర్శలపై గంటల వ్యవధిలో ఒంటికాలిపై లేచే మోదీ, అమిత్‌షా నోరు మెదపడం లేదు. కారణం… వీడియో క్లిప్పులు, కేంద్ర ప్రభుత్వ డాక్యుమెంట్ల సాక్ష్యంగా కేసీఆర్ చేస్తున్న దాడికి వారివద్ద జవాబులు లేకపోవడమే!