(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): ఎవుసం బాయికాడ మోటర్లకు మీటర్లు పెట్టొద్దని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుతో కొట్లాడారు. ‘స్మార్ట్‌మీటర్’ ఓ విఫల ప్రాజెక్టు అని.. రైతును, సామాన్యుడిని నష్టపరిచేందుకే తీసుకొచ్చిందని మండిపడ్డారు. అయినప్పటికీ, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మారట్లేదు. దేశవ్యాప్తంగా పలు రాష్ర్టాల్లో విమర్శలు ఎదుర్కొన్న ‘స్మార్ట్‌మీటర్’ ప్రాజెక్టును కశ్మీర్‌లోనూ అమలు చేయడానికి ప్రయత్నించింది. అయితే, తమ జేబులకు చిల్లు పెడుతున్న ఈ ప్రాజెక్టును వెంటనే నిలిపివేయాలంటూ కశ్మీర్‌లోని బుద్గామ్ ప్రజలు శనివారం నిరసన ప్రదర్శనలు చేశారు.
కేంద్రం నిర్ణయానికి వంతపాడుతున్నట్టు ప్రవర్తిస్తున్న నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీపైనా మండిపడ్డారు. 11న జరగనున్న బుద్గామ్ ఉప ఎన్నికలో ఇరు పార్టీలకు ఓటుతో సమాధానం చెప్తామని హెచ్చరించారు. నిరసనలు పెరుగుతుండటంతో సీఎం ఓమర్ అబ్దుల్లా స్పందించారు. ఇష్టంలేకపోతే స్మార్ట్‌మీటర్లను ఇన్స్టాల్ చేసుకోవద్దని పేర్కొన్నారు. సెంట్రల్ కశ్మీర్‌లోని గండెర్బాల్ జిల్లాలోనూ స్మార్ట్‌మీటర్లకు వ్యతిరేకంగా సోమవారం పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. మీటర్లను తొలగించాలంటూ గడూరా గ్రామ మహిళలు ఆందోళన చేపట్టారు.
స్మార్ట్‌మీటర్లకు వ్యతిరేకంగా వివిధ రాష్ర్టాల్లో ఇప్పటికే తీవ్రస్థాయిలో ఆందోళనలు జరిగాయి. వేలల్లో బిల్లులు వస్తున్న ఈ స్మార్ట్‌మీటర్లు తమకు వద్దంటూ ఉత్తరప్రదేశ్‌లోని బాగ్పత్ జిల్లాలో ఉన్న రాథోడా గ్రామ రైతులు.. పశ్చిమ్ విద్యుత్ విట్రన్ నిగం లిమిటెడ్ (పీవీవీఎన్‌ఎల్) కార్యాలయం ముందు మీటర్లను కుప్పలుగా పోశారు. స్మార్ట్‌మీటర్లు బిగించినప్పటి నుంచి వారానికి రూ. 8 వేల దాకా బిల్లులు వస్తున్నాయని యూపీలోని ఉమర్పూర్ రైతులు ఆందోళనలు తీవ్రం చేశారు. బుధానా కరెంటు ఆఫీసులో మీటర్లను కుప్పలుగా పోసి నిరసనలు హోరెత్తించారు.
వేలల్లో బిల్లులు వస్తున్న మీటర్లను ఊడబీకిన మీరట్ రైతులు.. విద్యుత్తు ఆఫీసు ఎదుట ధర్నాకు దిగారు. ఏపీలోని శ్రీకాకుళంలో కూడా రైతుల గుండెలమీద స్మార్ట్చిచ్చు కుంపటిగా మారింది. స్మార్ట్‌మీటర్లు పెట్టినప్పటి నుంచి తమకు కరెంటు బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని నిరుడు బీహార్‌లోని నందలాల్‌పూర్, మిల్లీచక్, బహదూర్‌పూర్, ఐనాయత్పూర్, రోస్రా, సమస్తీపూర్ తదితర గ్రామాల ప్రజలు నిరసనలు తెలిపారు. యూపీవ్యాప్తంగా అమర్చిన 12 లక్షల స్మార్ట్‌మీటర్లు లోపాలపుట్టగా ఉన్నాయని, బిల్లులు ఎక్కువగా చూయిస్తున్నాయని 2023లో కేంద్ర విద్యుత్తుశాఖ చేపట్టిన పరిశీలనలోనూ తేలింది. అయినప్పటికీ, ప్రజాగ్రహాన్ని పట్టించుకోకుండా ‘స్మార్ట్’ మీటర్లపై ప్రభుత్వాలు ముందుకు వెళ్తుండటం విమర్శలకు తావిస్తున్నది.