CM KCR | కర్నాటక ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌పై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. వ్యవయాసానికి ఐదుగంటలు కరెంటు ఇస్తున్నామని చెప్పడంపై ఇల్లందు సభ నుంచి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఉత్తమ్ కుమార్‌రెడ్డి రైతుబంధు ఇచ్చి పన్నుల డబ్బులు రైతులకు ఇచ్చి దుబారా చేస్తున్నడు అని మాట్లాడుతున్నడు. కరెంటు మూడు గంటలు ఇస్తే సరిపోతుందని పీసీసీ అధ్యక్షుల వారు. ఇంకా బాధ కలిగించే విషయం ఏంటంటే.. మనుషులకు మాట మాట్లాడితే.. కొంచెం ఇజ్జత్.. షరం ఉండాలే.
కర్నాటక నుంచి ఓ పెద్దమనిషి వచ్చిండు ఉప ముఖ్యమంత్రి. కేసీఆర్ నీకు కావాలంటే బస్సుపెడుతం నువ్వు వచ్చి చూడు.. కర్నాటకలో రైతులకు ఐదుగంటల కరెంటు ఇస్తున్నమని చెబుతున్నడు. సన్నాసి మేం 24గంటల కరెంటు ఇస్తున్నం.. ఐదుగంటల కాదు. నువ్వు ఇక్కడ చూడాలి.. కర్నాటక వచ్చి చూసేది ఏముందని చెబుతున్నం. కాంగ్రెస్ నేతలు కరెంటు మూడుగంటల ఇస్తే సరిపోతుందని మాట్లాడుతున్నరు. మరి సరిపోతుందా మూడుగంటలు ? 24గంటల కరెంటు ఉండాలంటే బీఆర్ఎస్కు ఓటువేయాలి’ అని పిలుపునిచ్చారు.
‘గతంలో నుంచి ఏన్నో చేసుకుంటూ వచ్చాం. ఇంకా కూడా చేస్తాం. మొన్ననే హైదరాబాద్‌లో మేనిఫెస్టో ప్రకటించాం. భగవంతుడి దయతో పదేళ్ల నుంచి వర్షాలు పడుతున్నయ్. కరెంటు మంచిగున్నది. మంచినీళ్ల పీడపోయింది. ఎక్కడ చూసినా మంచి పంటలు పండుతున్నయ్. ఎక్కడ చూసినా వడ్ల కళ్లాలు. లక్ష్మీ అమ్మవారు నాట్యం చేసినట్టున్నది. అప్పుడప్పుడు హెలీకాప్టర్‌లో పోయిన చూసిన సందర్భంలో రోడ్లపై వడ్లు ఎండపోసి కనబడుతున్నయ్. మనసుకు సంతోషమవుతున్నది. మూడుకోట్ల టన్నుల వరిధాన్యం పండితున్నది నా తెలంగాణ. ఒకనాడు గొడగొడ ఏడ్చిన తెలంగాణ.. అన్నమో రామచంద్ర అని తండ్లాడిన తెలంగాణ. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే నాలుగుకోట్ల టన్నుల ధాన్యం పండుతుంది తెలంగాణలో. లక్ష్మీదేవి కటాక్షం ఇంత ఉన్న తెలంగాణలో.. 93లక్షల రేషన్కార్డులున్నయ్. కార్డుదారులందరికీ వచ్చే మార్చి నుంచి సన్నబియ్యమే ఇస్తాం’ అని చెప్పారు.
‘మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఇప్పటి వరకు ఇస్తున్న పెన్షన్లు పెంచుకుందాం. ఆర్థికంగా పెరిగిన కొద్దీ పెన్షన్లు పెంచుకున్నాం. కల్యాణలక్ష్మిని కూడా పెంచుకుంటూ వచ్చాం. పెన్షన్లు రూ.5వేలకు తీసుకొని పోతాం. అర్హులైన మహిళలకు రూ.3వేలు వచ్చేలా విధంగా స్కీమ్ తయారవుతున్నది. గ్యాస్ సిలిండర్ తక్కువ ధరకే రూ.400 ఇచ్చే పథకాన్ని ప్రకటించాం. ఎవరమైనా సరే ఆపదలు రావొచ్చు. హఠాత్తుగా చనిపోవచ్చు. రైతుబీమా పెట్టాం. బ్రహ్మాండంగా పని చేస్తున్నది. ఇవాళ్టికి లక్ష కుటుంబాలకు అందింది. ఇవాళ చేతులెత్తి దండంపెడుతున్నరు.
రైతుబీమా లేకుంటే.. మా కొంప బజారున పడేది.. మేం బతుకలేకపోదుము.. ఈ డబ్బుతో సురక్షితంగా ఉన్నాం.. కనీసం గౌరవంగా ఉన్నామని అంటున్నరు. మొన్న ఆలోచన చేస్తే మంత్రులు, సామంతులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరు సార్ ఇంత మంచి పని చేశారు. మనదగ్గర చాలామంది గిరిజన, దళిత, బీసీ, ముస్లిం మైనారిటీలకు చెందిన పేదలకే ఎక్కువ ఉన్నారు కాబట్టి సామన్య ప్రజానీకానికి రేషన్కార్డులందరికీ అందరికీ బీమా చేయాలని అడిగారు. దాన్ని కూడా వచ్చే మార్చి తర్వాత సాధారణ మరణం సంభవించినా.. రూ.5లక్షలు వస్తయ్’ అని తెలిపారు.