హైదరాబాద్: కార్మిక లోకానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) మేడే శుభాకాంక్షలు తెలిపారు. శ్రామికుల త్యాగాలకు ఘన నివాళులర్పించారు. శ్రామికుల రెక్కల కష్టం, వారి త్యాగం అనితరసాధ్యమన్నారు. మేడే స్ఫూర్తితో రాష్ట్రంలోని శ్రామికుల హక్కులను కాపాడుతూ నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు కార్మికుల జీవన భద్రతకు భరోసా పెంచిందని చెప్పారు. పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలబెట్టామని తెలిపారు.
రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానాలు అమలు చేసి ప్రపంచ పెట్టుబడులు ఆకర్షించామని పేర్కొన్నారు. లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించామని వెల్లడించారు. ఉత్పత్తి సేవా రంగాల్లో పాల్గొనే మహిళా కార్మికులకు హక్కులు కల్పించి అండగా నిలిచామన్నారు. సింగరేణి, ఆటో డ్రైవర్లు, పలు పరిశ్రమలు సహా అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న శ్రామికులకు అన్ని రకాలుగా భరోసా కల్పించామని చెప్పారు.