హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కృషితోనే తెలంగాణలో బంజారాలకు మంచి రోజులు వచ్చాయని, వారి బతుకులు మారాయని ఎమ్మెల్సీ కవిత స్పష్టంచేశారు. అఖిల భారత బంజారాల ఆధ్యాత్మిక గురువు, పౌరాదేవి పీఠాధిపతి చంద్రశేఖర్ మహారాజ్ బుధవారం బంజారాహిల్స్‌లోని కవిత నివాసానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనను కవిత సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని బంజారాల ఆశీస్సులు కేసీఆర్‌పై, బీఆర్ఎస్పై ఉన్నాయని, బీఆర్ఎస్ హయాంలో బంజారాల సంక్షేమానికి పెద్దపీట వేశారని, కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలు చేశారని గుర్తుచేశారు. ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించి చరిత్ర సృష్టించింది కేసీఆరేనని, తెలంగాణలో మూడు వేలకు పైగా తండాలను పంచాయతీలుగా తీర్చిదిద్దింది కేసీఆరేనని, దేశంలోనే తొలిసారిగా సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యే చంద్రవతి, హరిప్రియా నాయక్, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు వాల్యానాయక్, రాంబల్ నాయక్, రామచంద్ర నాయక్, రూప్సింగ్, బంజారా పెద్దలు పాల్గొన్నారు.