హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి మానవత్వం చాటారు. రెండేండ్ల క్రితం అనారోగ్యంతో మరణించిన పార్టీ నేత, తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా నిలిచారు. ములుగు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కుసుమ జగదీశ్ కుమార్తె సుకీర్తి మెడిసిన్ చదువుకొనేందుకు ఆర్థికంగా ఇబ్బందు లు పడుతున్నదని పార్టీ నాయకుల ద్వా రా తెలుసుకున్నారు.
చదువుకయ్యే ఫీజు మొత్తాన్ని చెల్లించేందుకు ముందుకొచ్చారు. శుక్రవారం ఎర్రవల్లిలోని నివాసంలో తన తల్లితో కలిసివచ్చిన సుకీర్తికి మెడిసిన్ చదువుకు అవసరమైన ఫీజుల చెల్లింపుల కోసం చెక్కు అందజేశారు. ‘సుకీర్తనమ్మా.. బాగా చదువుకొని ఉన్నతస్థాయికి చేరుకోవాలి బిడ్డా’ అని ఆశీర్వదించారు. కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ధైర్యమిచ్చారు. ఇక్కడ కర్నె ప్రభాకర్, రసమయి బాలకిషన్ తదితరులున్నారు.