బీఆర్ఎస్ హయాంలో పదేండ్ల కాలంలో ఉద్యోగుల వేతనాలను 73 శాతం పెంచినం. తమకు ఓటేస్తే అందలమెక్కిస్తమని ఊదరగొట్టిన కాంగ్రెస్ అధికారంలో రాగానే వారికి మొండిచేయి చూపింది. ఎనకటికి ఇటువంటి ముఖ్యమంత్రే ఏమీ తెల్వని అమాయకుడ్ని తీర్థం పోదామని తీసపోయిండంట. తీసపోయినాయినేమో గుళ్లో పండుకుండంట. ఆశపడి ఎమ్మటిపోయినోణ్ని సలిలో పండబెట్టిండంట. ఉద్యోగుల పరిస్థితి కూడా ఇలానే తయారైంది.
తెలంగాణను కలుపుకోవాలనే కుట్రలో భాగంగా తెలుగుతల్లి గురించి ప్రచారం చేసిన ఆంధ్రా నాయకత్వం వారి ప్రాంతంలోని 13 జిల్లాల్లో ఎకడా ఒక తెలుగుతల్లిని కూడా ఏర్పాటు చేసుకోలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటికి కేవలం హైదరాబాద్‌లో ఒకటి, మహబూబ్‌నగర్‌లో ఒకటి.. కేవలం రెండే తెలుగు తల్లి విగ్రహాలుండేవి. ఆ తర్వాత నేను నిలదీస్తే తిరుపతిలో తెలుగుతల్లి పేరుతో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నరు.
-బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
KCR | హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అస్తిత్వం, ప్రజల ఆకాంక్షల గురించి ఏమాత్రం సోయిలేని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేవలం రాజకీయ స్వార్థంతో, కేసీఆర్ మీద కక్షతో పిచ్చిపనులకు పూనుకొంటున్నారని, తెలంగాణ తల్లి మార్పు శోచనీయమని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘తెలంగాణ తల్లి భావన కేసీఆర్‌ది కాదు. యావత్ తెలంగాణ సమాజానిది. 70 ఏండ్ల కిందనే, దాశరథి, రావెళ్ల వెంకటరామారావు వంటి తెలంగాణ కవులు, తెలంగాణ తల్లి గురించి కీర్తించారు. ఈ సంగతి ఈ ప్రభుత్వానికి, దాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రికి తెల్వదు. కేసీఆర్ పెట్టిండని కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని మూర్ఖత్వంతో వ్యవహరిస్తున్నారు’ అని మండిపడ్డారు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆదివారం ఎర్రవల్లిలోని నివాసంలో కేసీఆర్ అధ్యక్షతన పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఉభయ సభల్లో పార్టీ సభ్యులు అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ చర్చించారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. తెలంగాణ తల్లి ఆవిర్భావ చారిత్రక నేపథ్యాన్ని గుర్తు చేసుకున్నారు.
‘నాటి నిజాం పాలన నుంచి విముక్తి కోసం కమ్యునిస్టులు సాయుధ పోరాటం నడిపిస్తున్న కాలం అది. నైజాం పాలకుల సాంస్కృతిక ఆచారాలు తప్ప, తమ సొంతభాష సంస్కృతి వంటి తెలంగాణ ప్రజల అస్తిత్వానికి ఆనాటి రాజరిక పాలనలో అంతగా చోటులేకుండే. కమ్యునిస్టుల పోరాటం తెలంగాణ ప్రజల్లో చైతన్యాన్ని నింపింది. నిజాం పాలన మీద తిరుగబడ్డ నాటి తెలంగాణ కవి దాశరథి ‘నా తెలంగాణ తల్లి కంజాతవల్లి’ అని కీర్తించారు. అదే విధంగా ‘నా తల్లి తెలంగాణ రా.. వెలలేని నందనోద్యానమ్మురా’ అంటూ రావెళ్ల వెంకటరామారావు వంటి గొప్ప కవులు తెలంగాణ తల్లి భావనను ముందుకు తెచ్చారు. వారు చేసిన కృషి తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వ భావనల పట్ల ప్రజల్లో సోయిని పెంచింది. తమ భాష గురించి తమ కట్టుబొట్టు గురించిన అవగాహనను ఆవిధంగా నాటి రైతాంగ పోరాటం నేర్పింది. అదే సందర్భంలో నాటి ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో భాగమైన ఆంధ్రా ప్రాంతం ప్రత్యేకాంధ్ర కోసం పోరాటాలు నడిపింది.
ఈ నేపథ్యంలో తమకొక అస్తిత్వ చిహ్నం కావాలనే సోయి ఉన్న ఆంధ్రా ఉద్యమకారులు తమిళులతో సాగించిన ఉద్యమంలో ‘ఆంధ్రా మాత’ అనే భావనను ముందుకు తెచ్చారు. అట్లా ముందుకు వచ్చింది ఆంధ్రా తల్లి భావన. అయితే, అనంతర కాలంలో తెలంగాణను విలీనం చేసుకున్న నాటి ఆంధ్రా నాయకత్వం, ఆంధ్రామాత భావనను వదిలివేసింది. తెలంగాణ తల్లి భావనను విస్మరింపచేసింది. రెండింటినీ పకకు పెట్టి తెలుగుతల్లి అనే భావనను ముందుకు తెచ్చిండ్రు. కుట్రపూరితంగా తెలంగాణ అస్తిత్వాన్ని మరిపించ చూశారు. ‘మా తెలుగు తల్లికి మల్లె పూ దండా’ అంటూ ఆంధ్రా నాయకత్వం మనతో కూడా పాటలు పాడించింది. అనంతర కాలంలో మొదలైన తెలంగాణ ఉద్యమ సందర్భాల్లో వట్టికోట ఆళ్వారుస్వామి, కాళోజీ నారాయణ రావువంటి తెలంగాణ కవులు తెలంగాణ భాష, యాసలు సాంస్కృతిక అస్తిత్వాల పట్ల తమ కవిత్వం రచనల ద్వారా ప్రజల్లో భావజాల వ్యాప్తి నింపారు. ఇకడ మనం అర్థం చేసుకోవాల్సిన ఇంకో ముఖ్యవిషయం ఉన్నది.
గమ్మతేందంటే, తెలంగాణను కలుపుకోవాలనే కుట్రలో భాగంగా తెలుగుతల్లి గురించి ప్రచారం చేసిన ఆంధ్రా నాయకత్వం వారి ప్రాంతంలోని 13 జిల్లాల్లో ఎకడా ఒక తెలుగుతల్లిని కూడా ఏర్పాటు చేసుకోలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటికి కేవలం హైదరాబాద్‌లో ఒకటి, మహబూబ్‌నగర్‌లో ఒకటి.. కేవలం రెండే తెలుగు తల్లి విగ్రహాలుండేవి. అంతగా తెలుగుతల్లి గురించి తపిస్తున్న మీరు విగ్రహాలెందుకు పెట్టుకోలేదని అకడి ప్రాంత కవులను, రచయితలను నేను నిలదీసిన. దాంతో అప్రమత్తమైన నాటి ఉమ్మడి పాలకులు తిరుపతిలో తెలుగుతల్లి పేరుతో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. విజయవాడలో ఉన్న విగ్రహాన్ని చాలామంది తెలుగుతల్లి అనుకుంటారు కానీ ఆ విగ్రహం కృష్ణవేణి. కృష్ణమ్మ నదీ తల్లి విగ్రహం’ అని కేసీఆర్ వివరించారు.
మన అస్థిత్వపతాకగా తెలంగాణ తల్లి
‘మలిదశ ఉద్యమ సమయంలో తెలంగాణ అస్తిత్వ సోయి మరోసారి ముందకు వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుతల్లి తెలంగాణకు చేసిన మేలేంది అంటూ ఒక సందర్భంలో విలేకరులడిగిన ప్రశ్నలకు నేను ఘాటైన సమాధానం చెప్పిన. నేను వ్యూహాత్మకంగా చెప్పిన ఆ సమాధానం తెలంగాణ ప్రజల్లో అస్తిత్వ భావనకు ఊపిరి పోసింది. మా ప్రాంతం బాగుకోరే, మా క్షేమం కోరే మన తల్లి మనకు ఉండాలె అని ప్రజలు ముందుకు వచ్చిన్రు. ఒక ప్రాంత ప్రజల అస్తిత్వానికి చిహ్నంగా ఉండాల్సిన తల్లి రూపం దివ్యంగా, భవ్యంగా, భగవత్ స్వరూపంగా ఉండాలె. ప్రజలు చూడగానే చేతులెత్తి నమసరించుకునే విధంగా ఉండాలె. ఇది మన సంప్రదాయం. అట్లా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మలిదశ తెలంగాణ ఉద్యమంలో అనివార్యంగా అస్తిత్వ భావన ముందుకు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ తల్లి రూపానికి అంకురార్పణ జరిగింది. అనేక మంది మేధావులు, కవులు, కళాకారులు వేలాది గంటల పాటు చర్చించి శ్రమించి తెలంగాణ చారిత్రక సాంస్కృతిక, సామాజిక నేపథ్యంలోంచి ఒక రూపాన్ని తీర్చిదిద్దుకున్నాం. 2007లో తెలంగాణ తల్లి రూపాన్ని తీర్చిదిద్దుకుని వేలాది ఉద్యమకారులు ప్రజలు పాల్గొని ఏనుగులు, ఒంటెలతో ఒక తిరునాళ్లలో దేవత ఊరేగింపు మాదిరిగా తోడొని తెలంగాణ భవన్లో స్థాపించుకున్నాం.
నాటి సమైక్య పాలకుల మరిపింపులో మరిచిపోయిన తెలంగాణ ప్రతీకలను తెలంగాణ ఉద్యమ సమయంలో పునరుజ్జీవింప చేసుకోవడానికి నిలుపుకున్న మాతృరూపమే తెలంగాణ తల్లి. ఇదీ తెలంగాణతల్లి ఆవిర్భావ చరిత్ర’ అని కేసీఆర్ వివరించారు. ‘ఈ చారిత్రక నేపథ్యం తెలంగాణ సాంస్కృతిక వారసత్వం గురించి కనీస సోయిలేని నేటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామనే తలతిక ఆలోచనలతో తెలంగాణ అస్థిత్వానికి మచ్చ తెచ్చే ప్రమాదాన్ని తెస్తున్నారు. ఇది ఒక పద్ధతి, పాడులేని ముఖ్యమంత్రి అనుసరిస్తున్న తిర్రి మొర్రి వ్యవహారం. మూర్ఖపు వైఖరికి నిదర్శనం’ అని దుయ్యబట్టారు. ఇదే విషయంపై తనను ప్రభుత్వం ఆహ్వానించడంపై కేసీఆర్ స్పందించారు. ‘నన్ను ఆహ్వానించడం వెనక కోణం ఏదున్నా వారి ఉద్దేశం ఏదయినా మన ఇంటికి అతిథులు వస్తే మర్యాద చేస్తం గౌరవిస్తం. అదే పద్ధతిలో వచ్చిన మంత్రిని, వారి వెంట వచ్చిన వారికి భోజనం పెట్టి సాదరంగా గౌరవించి పంపినం. ఇది తెలంగాణ సంప్రదాయం’ అని వివరించారు.
ఊ.. అంటే కేసులు పెడుతున్నరు
‘రాష్ట్రంలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగినంత సమయం ఇచ్చాం. ఇంకా మనం మాట్లాడకుంటే మంచిదికాదు. ప్రజలు కూడా ఊరుకోరు. లేనిపోని ఆశలు కల్పించి ప్రజలను నిలువునా మోసం చేసి ఇప్పుడు ప్రశ్నించినోళ్లనే రాష్ట్ర ప్రభుత్వం పగబడుతున్నది. తనను నమ్మి ఓట్లేసిన నిరుపేదలను, రైతులను, గిరిజనులను, దళితులను నిర్దాక్షిణ్యంగా వేధిస్తున్నది. ఇదేంది అని అడిగిన వారిని కేసులు పెట్టి వేధిస్తున్నది. ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ నేతలు, శ్రేణులపై ఊ.. అంటే కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తున్నది. త్యాగాలు చేసి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను తెర్లు చేయాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలి. ప్రభుత్వం మీద ఇప్పటికే ప్రజలకు విసుగు పుడుతోంది. అన్నవస్త్రాలకని పోతే ఉన్న వస్త్రాలు వూసిపోయినట్టయిందని ప్రజలు దుఃఖ పడుతున్నారు’ అని కేసీఆర్ పేర్కొన్నారు. దళితులు, బీసీలు ఏ ఒకరినీ వదలకుండా ప్రతి వర్గాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వంచిస్తున్నదని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఏమయిందని ప్రశ్నించారు. సాగునీటి రంగాన్ని అస్తవ్యస్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కాళేశ్వరం అంశాన్ని ముందుకు తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వృథాగా సముద్రంలో కలుస్తున్న కాళేశ్వరం జలాలను ఎందుకు ఎత్తిపోస్తలేరని ప్రశ్నించారు.
గురుకులాలు అధ్వానం
రాష్ట్రంలోని గురుకుల విద్య రోజురోజుకూ దిగజారుతున్నదని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘గురుకుల విద్యాలయాలను మనం దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దినం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ విద్యార్థులను ప్రపంచస్థాయిలో పోటీపడి అత్యున్నత చదువులు చదివించాం. అత్యున్నత స్థాయి ఉద్యోగాల్లో వారికి అవకాశాలు వచ్చాయి’ అని పేర్కొన్నారు. మనం తీర్చిదిద్ది చేతుల్లో పెడితే కూడా సకగా నడపడం ఈ ప్రభుతానికి చేతకావట్లేదని మండిపడ్డారు. తినేతిండిని కూడా సరిగ్గా వండి పెట్టలేక పిల్లలకు విషాహారం పెడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు చనిపోతున్న దారుణ దృశ్యాలు మనసును కలిచివేస్తున్నాయని, ఇందుకు సభ్య సమాజం సిగ్గుపడుతున్నదని పేర్కొన్నారు. నాటి మన ప్రభుత్వ హయాంలో గురులకులాల బాధ్యుడిగా అత్యున్నత సేవలందించిన ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు అభినందనలు తెలుపుతున్నట్టు చెప్పారు.
అన్ని అంశాలపై లోతుగా చర్చించాలి
శాసనమండలి, శాసనసభ వేదికగా ప్రతి అంశంపై లోతుగా చర్చ జరగాలని, అందుకు మనం ప్రజల పక్షాన నిలబడాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ ఉద్బోధించారు. దాదాపు మూడుగంటల పాటు కొనసాగిన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. ప్రభుత్వ నిరంకుశ విధానాలపై మొకవోని ధైర్యంతో పోరాడుతున్న పార్టీ నాయకత్వాన్ని కార్యకర్తలను కేసీఆర్ అభినందించారు. తెలంగాణ భవన్ నిత్యం పార్టీ శ్రేణులతో, సమస్యలతో వచ్చే ప్రజలతో జనతా గ్యారేజీ’లా మారిందనే వార్తలను కేసీఆర్ ప్రస్తావించి నాయకులను అభినందించారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సమావేశంలో పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్‌ముదిరాజ్, బీఆర్ఎస్ పక్షనేత మధుసూధనాచారి, ముఖ్యనేతలు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, మహమూద్ అలీ, శ్రీనివాసయాదవ్, పద్మారావుగౌడ్, సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు కవిత, వాణీదేవి, సత్యవతి రాథోడ్, దేశపతి శ్రీనివాస్, వెంకట్రామిరెడ్డి, ఎల్ రమణ, తాతా మధు, తకెళ్లపల్లి రవీందర్రావు, శేరి శుభాష్‌రెడ్డి, ఎంసీ కోటిరెడ్డి, నవీన్‌రావు, శంభీపూర్ రాజు, నవీన్‌కుమార్‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, గోరటి వెంకన్న, వంటేరి యాదవరెడ్డి, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, ముఠా గోపాల్, వివేకానంద్, సుధీర్‌రెడ్డి, గంగుల కమలాకర్, మల్లారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, కోవాలక్ష్మి, అనిల్‌జాదవ్, చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, బండారి లక్ష్మారెడ్డి, మాగంటి గోపీనాథ్, విజయుడు పాల్గొన్నారు.
ఉద్యోగుల పరిస్థితి దారుణం
ఉద్యోగుల పరిస్థితి కూడా దారుణంగా తయారయ్యిందని కేసీఆర్ పేర్కొన్నారు. ‘మన ప్రభుత్వ హయాంలో తెలంగాణ ఉద్యోగులు దేశంలోనే అత్యంత ఎకువ జీతాలు తీసుకున్న ఉద్యోగులుగా చరిత్రకెకారు. పదేండ్ల కాలంలో వారి జీతాలను 73 శాతం పెంచినం. తమకు ఓటేస్తే అందలమెకిస్తామని ఊదరగొట్టి అధికారంలోకి రాగానే ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం మొండిచేయి చూపింది. వారికి అందాల్సిన 5 డీఏలకు గాను కేవలం ఒక డీఏ విదిలించింది. దాన్ని కూడా 17 వాయిదాల్లో అందిస్తామని సిగ్గులేకుండా ప్రకటించింది. ఎనకటికి ఇటువంటి ముఖ్యమంత్రే ఏమీ తెల్వని అమాయకుడ్ని తీర్థం పోదామని తీసపోయిండంట. తీసపోయినాయినేమో గుళ్లో పండుకుండంట. ఆశపడి ఎమ్మటిపోయినోణ్ని సలిలో పండబెట్టిండంట. ఉద్యోగుల పరిస్థితి కూడా ఇలానే తయారైందని అనగానే సమావేశంలో నవ్వులు విరిశాయి.
ప్రజా సమస్యలపై గొంతు విప్పండి
అసెంబ్లీని వేదికగా చేసుకుని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గొంతు విప్పాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ చేతకానితనం వల్ల పాలన అస్తవ్యవస్తంగా మారడంతో ప్రజలు విసుగు చెంది తిరగబడుతున్నారని, ఈ నేపథ్యంలో తెలంగాణను తెచ్చి పదేండ్లపాటు ప్రగతి పథాన నిలిపిన పార్టీగా, ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వైఖరిని నిలదీయాలని సూచించారు. సమస్యలను పరిషరించకుండా ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణి, మోసపూరిత వైఖరిని నిలదీయాలని సూచించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేక చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ప్రజలను అణచివేస్తున్నదని దుయ్యబట్టారు. లగచర్లలో ఫార్మాసిటీ పేర తమ భూములు గుంజుకుంటున్నారని రోడ్లమీదికి వచ్చిన గిరిజనుల మీద ప్రభుత్వం కేసులు పెట్టి వేధిస్తున్నదని, ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని పేర్కొన్నారు. మూసీ సుందరీకరణ పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల ఇండ్లను కూలగొడుతున్నదని, ఇది ఎంతమాత్రమూ క్షమించరానిదని తెలిపారు. హైడ్రా ముసుగులో పేదల ఆవాసాలను బుల్డోజర్లతో నిలువునా కూల్చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఉభయ సభల్లో ఎండగట్టాలని సూచించారు.
వ్యవసాయ రంగ నిర్వీర్యంపై నిలదీయండి
వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేయడంపై అసెంబ్లీలో నిలదీయాలని కేసీఆర్ కోరారు. రాష్ట్రంలో అస్తవ్యస్తంగా మారిన వ్యవసాయ రంగం, రైతు సంక్షేమం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. నాటి ఉద్యమ సమయంలో ‘పల్లె పల్లెనా పల్లేర్లు మొలిసే..’ అని శోకం పెట్టిన నాటి ఉమ్మడి రాష్ట్రంలోని తెలంగాణ వ్యవసాయ రంగ దురవస్థను బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్ల అనతి కాలంలో దూరం చేసిందని కేసీఆర్ తెలిపారు. రైతును రాజును చేసే దిశగా వ్యవసాయం, దాని అనుబంధ రంగాలను లక్షల కోట్ల రూపాయలతో తీర్చిదిద్దిన ఘనత దేశంలో కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని వివరించారు. రైతుబంధును ఇంకా పెంచుతాం అని రైతులకు ఆశలు పెట్టి ఉన్నదాన్ని ఎగ్గొడుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీయాలని సూచించారు. వ్యవసాయాన్ని స్థిరీకరించడానికి పటిష్టమైన విధానాలు అమలు చేశామని, తద్వారా తెలంగాణ వ్యవసాయం రంగం రైతు సంక్షేమ రంగంలో దేశానికే తలమానికంగా నిలిచిందని పేర్కొన్నారు. కడుపుల సల్ల కదలకుండా పిల్లా పాపలతో సుఖంగా బతుకుతున్న రైతులకు లేని పోని ఆశలు కల్పించి వారిని ఇవాళ ప్రభుత్వం గోసపెడుతున్నదని విమర్శించారు.
కేసీఆర్ ఆనవాళ్లు చెరపాలనుకోవడం మూర్ఖత్వం
కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని విర్రవీగుతున్న ముఖ్యమంత్రి యాదాద్రి పవర్ ప్లాంట్‌ను ప్రారంభించారని, అది కేసీఆర్ వేసిన ఆనవాలు అని తెల్వదా అని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల కరెంటు కష్టాలను తీర్చడానికి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం దార్శనికతతో నిర్మాణం ప్రారంభించిన యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రారంభం కావడం పట్ల కేసీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. అటు ఎన్టీపీసీ ఇటు యాదాద్రితో మొత్తంగా 2,400 మెగావాట్ల విద్యుత్తు అదనంగా అందుబాటులోకి వచ్చిందన్నారు. కనీసం ఇప్పుడైనా రైతులకు ప్రజలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తును అందించలేకపోవడం శోచనీయమన్నారు.