Congress Govt | హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): మెదక్‌లో పనిచేస్తున్న ఒక ఐపీఎస్ అధికారిని ప్రభుత్వం హైదరాబాద్‌కు బదిలీ చేసింది. ఆయన భార్య టీచర్. దీంతో ఆమెను కూడా హైదరాబాద్‌కు బదిలీ చేయాలని కోరుతూ ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ముఖ్యమంత్రి కార్యాలయం వరకు చెప్పులు అరిగేలా తిరిగారు. ఆలిండియా ఆఫీసర్స్ రూల్స్ ప్రకారం ఇలా చేయడానికి అవకాశం ఉన్నది. అయినప్పటికీ నెలలు గడుస్తున్నా పని కావడం లేదు. ఒక ఐపీఎస్ అధికారికే ఈ పరిస్థితి ఎదురైతే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో సొంత పార్టీ నేతలే ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘మళ్లా కేసీఆర్ పాలనొస్తే మంచిగుండు’.. అని నిట్టూరుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వాన్ని అతి దగ్గర్నుంచి చూస్తున్నవారు, ప్రభుత్వ పెద్దలతో చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నవారే ఈ మాటలు అంటుండడం చూస్తుంటే రాష్ట్రంలో పాలన ఎలా సాగుతున్నదో అర్థం చేసుకోవచ్చు.
ఏ ఇద్దరు కాంగ్రెస్ నేతలను కదిలించినా పాలన పడకేసిందని, ఏ పనీకావడం లేదని చెప్పుకుంటున్నారు. రాష్ట్రంలో పాలన మొత్తం స్తంభించిపోయిందని అన్ని వర్గాలూ అభిప్రాయపడుతున్నాయి. ప్రభుత్వాన్ని చాలా దగ్గరి నుంచి చూస్తున్న నల్లగొండ జిల్లాకు చెందిన కీలక నేత ఒకరు ముఖ్యమంత్రి పని విధానంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మొదలు ఏదో అనుకున్నం. కానీ మావోడికి తెలుస్తలేదు. ప్రభుత్వానికి ఆదాయం ఎట్ల సమకూర్చాలో తెలియడం లేదు. ఖర్చు ఎలా చేయాలో మాత్రం బాగా తెలుస్తున్నది’ అని వ్యాఖ్యానించారు. ‘మేమేందో పెద్దగా ఊహించుకున్నం. ఎమ్మెల్యేలే కాదు, అధికారులు కూడా గందరగోళంగానే ఉన్నారు’ అని అదే జిల్లాకు చెందిన మరో ప్రజాప్రతినిధి వివరించారు.
పొద్దంత తిప్పుకుంటడు
‘పొద్దంతా కార్ల తిప్పుకుంటడు. కానీ, ఎక్కడి పని అక్కడే పెడ్తడు’ అని సీఎం వ్యవహారశైలిపై సొంతపార్టీ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు. ‘రేపు మనం కలుద్దాం’ అని సీఎం చెప్పగానే ఇక నా పని అయిపోయినట్టే అని ఆ ఎమ్మెల్యే భావించారట. చెప్పిన టైంకు వెళ్లి.. తన పని గురించి చెప్పగానే ‘పోతూ పోతూ మాట్లాకుందాం పావే’ అంటూ కారువైపు దారి చూపి ‘కారు ఎక్కగానే ఆ ముచ్చట.. ఈ ముచ్చటా అన్నీ తీస్తాడు. అసలు ముచ్చట తీసేలోపే వేరే ముచ్చట. ఇట్లా సాయంత్రం దాకా దగ్గరే ఉంచుకొని, వెంటతిప్పుకొని ‘తప్పకుండా చేద్దాం.. తరువాత చేద్దాం’ అని దాటవేసిన ఉదంతాన్ని తన సన్నిహితుల వద్ద చెప్పుకున్నారట. బయట చూస్తే ‘అబ్బో, మావోడు సీఎం దగ్గర ఎన్నిపనులు చేసుకుంటుండో అనుకుంటరు. కానీ, అక్కడ అయిందీ లేదు, పోయిందీ లేదు’ అని సదరు ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారట. చేయాల్సిన పనులే కాదు.. అసలు కావాల్సిన పనులు కూడా కావడం లేదని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు నిర్వేదం చెందుతున్నారు. ‘మేం పట్టుకుపోయిన ఏ పనీ కావడం లేదు. కానీ పక్కరాష్ట్రం (ఏపీ) వాళ్ల పనులు మాత్రం మనిషి లేకున్నా జరిగిపోతున్నాయని ఒక ఎమ్మెల్యే ఉసూరుమన్నారు.
అప్పుడన్నా పనులు అయ్యేవి
ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా ఏ పని అంటే ఆ పని అయిందని, ఇప్పుడు చెప్పుకోవడానికి ఒక చిన్న పని కూడా లేదని ఎమ్మెల్యేలు, నేతలు వాపోతున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో కేటీఆర్, హరీశ్‌రావు, కవిత, నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, వినోద్‌కుమార్.. ఇలా ఎవరిని కలిసి మాట వరుసకు చెప్పినా పనులు అయ్యేవని, ‘మీ పని అయిపోయింది’ అని వారే స్వయంగా ఫోన్ చేసి చెప్పేవారని గుర్తు చేసుకుంటారు. ‘మా గవర్నమెంట్ల మా పనులే అయితలేవు. ఇక ప్రజల పనులేం చేస్తాం’ అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే సన్నిహితుల వద్ద వాపోయారట.
అన్నీ అస్తవ్యస్తమే
‘కేసీఆర్ ఫాంహౌస్‌కే పరిమితం అయిండు. సెక్రటేరియట్‌కు రావడం లేదని ఎంత మొత్తుకున్నా జరగాల్సిన పనులు వేటికవే జరిగిపోతూ ఉండేవి. ఆయన పదేండ్ల కాలంలో పనులన్నీ చకచకా జరిగాయి. కానీ ఇప్పుడు యూరియా లేదని, విత్తనాలు దొరకడం లేదని రైతులు నిరసన తెలుపుతున్నారు. రైతుబంధు పైసలు పడ్తాయో, లేదోనని దిగులుగా ఉన్నారు. రూ. 2 లక్షల రుణమాఫీ చేశామని ప్రభుత్వం చెప్తున్నా క్షేత్రస్థాయిలో గందరోళం నెలకొన్నది. మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని, దవాఖానల్లో కనీస మందు గోళీలు లేవని విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తంగా పరిపాలన చేతకాకపోవడం వల్ల రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెల్లుబికుతున్నది. ‘నాయకుడు సరైన రీతిలో ఎత్తుగడలు సక్రమంగా వేయకపోతే నష్టం ఆ నాయకుడికి, పార్టీకే పరిమితం అవుతుంది. కానీ, పాలకుడు సరైన నిర్ణయం తీసుకోకపోతే దాని ప్రభావం మొత్తం రాష్ట్ర ప్రజల మీద పడుతుంది’ అని సీనియర్ రాజకీయ నేత ఒకరు వ్యాఖ్యానించారు.
సమీక్షల్లోనూ డొల్లతనమే
పాలకులకు ఉండాల్సిన దూరదృష్టి, అవగాహన, ప్రజా సమస్యల పరిష్కారం పట్ల ఉండే చిత్తశుద్ధి ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న కాంగ్రెస్ సర్కార్‌కు లేవని ఉన్నతాధికారులు గుసగుసలాడుకుంటున్నారు. అన్ని రంగాల్లో అందరికీ అవగాహన ఉండాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి కనీస అవగాహన లేకపోతే కష్టం అని ఒక సీనియర్ అధికారి ఒకరు పేర్కొనడం గమనార్హం. రెండు మూడు రోజుల క్రితం వినాయక చవితి నిమజ్జనం ఏర్పాట్లపై జరిగిన సమీక్షలో సీఎం స్థాయిలో ఉన్న నాయకుడు ఒక ఏసీపీకి అదే పనిగా సూచనలు ఇవ్వడం గందరగోళానికి దారి తీసింది. దీంతో పోలీసు ఉన్నతాధికారి ఒకరు కల్పించుకుని సరిచేయబోతుండగా ‘ఇదర్ క్యా చల్రా. ఆప్ క్యా కరే. పహెలే మేరే బాత్ సునో’ అని సదరు పోలీసు ఉన్నతాధికారిని సీఎం వారించారు. ఇలా ఏ విషయంలోనూ పట్టులేక, అధికారులకు ఎటువంటి సూచనలు ఇవ్వాలో, ఏవీ ఇవ్వకూడదో తెలియక పాలన అభాసుపాలవుతుందనే వాదన బలంగా వినిపిస్తున్నది.