బీఆర్ఎస్ ప్రభుత్వం సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్టులను మంజూరు చేస్తే కాంగ్రెస్ సర్కారు పనులు ఆపి రైతులను ఎందుకు గోస పెడుతున్నది? ప్రాజెక్టుల కోసం రెండు నియోజకవర్గాల ప్రజలను సమీకరించి హరీశ్‌రావు పెద్ద ఎత్తున దండయాత్ర చెయ్యాలె. ప్రత్యక్ష ప్రజాపోరాటాలు లేవదీసి ప్రభుత్వం మెడలు వంచాలె. నేను కూడా మీతోనే ఉంటా..
-జనవరి 31న సంగారెడ్డి జిల్లా
మేదపల్లి కార్యకర్తలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులు పూర్తిచేసే దాకా ఉమ్మడి కార్యాచరణను అమలు చేస్తూ కాంగ్రెస్ సర్కారు తీరును ఎండగడదాం. నీటి కోసం మరో పోరాటానికి సిద్ధమవుదాం. రైతులకు మేలు జరిగేలా భవిష్యత్తు కార్యాచరణ చేపడదాం.
– ఫిబ్రవరి 14న సంగారెడ్డి జిల్లా పార్టీ నేతలతో నిర్వహించిన భేటీలో హరీశ్
BRS Party | సంగారెడ్డి, ఫిబ్రవరి 15(నమస్తే తెలంగాణ): సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల విషయంలో పోరాటాలకు సిద్ధం కావాలని ఇటీవల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది. నిలిపివేసిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల పనులను తిరిగి ప్రారంభించింది. సంగారెడ్డి జిల్లా మనూరు మండలం బోరంచలో 12 ఎకరాల్లో పంప్‌హౌస్ నిర్మాణం కోసం తవ్వకం పనులను తిరిగి ప్రారంభించింది. సంగమేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణ పనుల ప్రారంభానికి కూడా సాగునీటి పారుదలశాఖ చర్యలు ప్రారంభించింది. భూసేకరణ అడ్డంకులు తొలగించి నిర్మాణ పనులు సత్వరం ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
సంగారెడ్డి జిల్లాలో నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సంగమేశ్వర,బసవేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిలిపివేసింది. ఇటీవల జహీరాబాద్ ప్రాంత రైతులతో సమావేశమైన కేసీఆర్ సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేసే సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులు పూర్తి చేసేంత వరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని స్పష్టంచేశారు.
మాజీ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో సంగారెడ్డి జిల్లా రైతాంగం, బీఆర్ఎస్ శ్రేణులు పోరాటం చేసేందుకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో హరీశ్‌రావు సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు ప్రారంభం కోసం సాగుపోరు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. హరీశ్‌రావు శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో సంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల పనులను తిరిగి ప్రారంభించేందుకు నారాయణఖేడ్, జహీరాబాద్ కేంద్రంగా రైతులు, ప్రజలతో కలిసి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టుల ఆయకట్టు పరిధిలో నిరసన కార్యక్రమాలు, బహిరంగసభల నిర్వహణకు కార్యాచరణ సిద్ధ్దం చేశారు.
ఈ నెల 24 నుంచి సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలపై సాగుపోరు ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో నిలిపివేసిన బసవేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను ప్రభుత్వం శనివారం తిరిగి ప్రారంభించింది. బోరంచలో పంప్‌హౌస్ నిర్మాణం కోసం 12 ఎకరాల్లో తవ్వకం పనులు మొదలయ్యాయి. హిటాచీలు, బుల్డోజర్లతో మట్టి తవ్వకం పనులు ముమ్మరం చేసింది. పంప్‌హౌస్ నిర్మాణం కోసం 20 మీటర్ల లోతులో మట్టి తవ్వకాలు జరుపుతున్నట్టు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. మట్టి తవ్వకం పనులు పూర్తి కాగానే పంప్‌హౌస్ నిర్మాణం పనులు మొదలు పెడతామని చెప్పారు. మరోవైపు, సంగమేశ్వర ఎత్తిపోతల పనులను కూడా తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
భూసేకరణకు ఉన్న అడ్డంకులు తొలగేలా చర్యలు చేపట్టడంతోపాటు వెంటనే నిర్మాణం పనులు ప్రారంభించాల్సిందిగా జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో ఇరిగేషన్ అధికారులు సంగమేశ్వర ప్రాజెక్టు నిర్మాణం పనులు ప్రారంభించేందుకు అడుగులు వేస్తున్నారు. బీఆర్ఎస్ పోరువల్లే సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టుల పనులు తిరిగి మొదలయ్యాయని రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. కేసీఆర్ ప్రారంభించిన సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరు ఇవ్వాలని సంగారెడ్డి జిల్లా రైతాంగం కోరుకుంటున్నది. తమ పక్షాన పోరుకు సిద్ధమైన కేసీఆర్, హరీశ్‌రావు, బీఆర్ఎస్ శ్రేణులకు రైతులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు రూ.4,427 కోట్లతో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు కేసీఆర్ శ్రీకారం చుట్టారు. రెండు పథకాల ద్వారా సంగారెడ్డి జిల్లాలో నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలను సింగూరు ప్రాజెక్టుకు తీసుకొచ్చి, అక్కడి నుంచి సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల ద్వారా నారాయణఖేడ్, అందోలు, జహీరాబాద్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. 2022 ఫిబ్రవరి 20న నారాయణఖేడ్‌లో కేసీఆర్ సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారు.
రూ.2,653 కోట్ల వ్యయంతో సంగమేశ్వర ఎత్తిపోతల పథకం పనులు కేసీఆర్ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద జహీరాబాద్, అందోలు, సంగారెడ్డి నియోజకవర్గాల్లోని 11 మండలాల పరిధిలో ఉన్న 231 గ్రామాల్లోని 2.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది లక్ష్యం. నారాయణఖేడ్, అందోలు నియోజవర్గాల్లో 1.81 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా కేసీఆర్ సర్కార్ రూ.1,774 కోట్లతో బసవేశ్వర ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను నిలిపివేసింది. దీనిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల పోరుబాటకు పిలుపు ఇవ్వడంతో కాంగ్రెస్ సర్కార్ దిగివచ్చి తిరిగి పనులు ప్రారంభించింది.